దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే మారుతి కారు ధర పెరిగింది.. షోరూమ్‌కు వెళ్లే ముందు ఎంత పెరిగిందో తెలుసుకోండి!
భారత ఆటోమొబైల్ మార్కెట్లో కార్ల ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం, తయారీ వ్యయాలు అధికమవడం, సరఫరా వ్యవస్థ ఖర్చులు పెరగడం వంటి కారణాలతో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ వాహనాల ధరలను దశలవారీగా సవరిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ధరలను పెంచిన కంపెనీలు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను దృష్టిలో ఉంచుకుని మరోసారి ప్రైస్ హైక్ అమలు చేస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా ఇదే బాటలో నడుస్తోంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులను పూర్తిగా భరించడం సాధ్యం కాకపోవడంతో, ఆ భారంలో కొంత భాగాన్ని వినియోగదారులపై మోపాలని కంపెనీ నిర్ణయించింది. దీంతో తన మోడల్ శ్రేణిలోని పలు కార్ల ధరలను మరోసారి పెంచుతోంది.
ఈ ధరల పెంపు ప్రభావం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ మారుతి సుజుకి డిజైర్ (Dzire)పై కూడా పడింది. డిజైర్ కొనుగోలు చేయాలని భావిస్తున్న కస్టమర్లకు ఇది ముఖ్యమైన అప్డేట్. కంపెనీ ఈ మోడల్ ధరను రూ. 7,500 వరకు పెంచింది. అంటే ఇకపై డిజైర్‌ను సొంతం చేసుకోవాలంటే గతంతో పోలిస్తే మరింత ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ధరల పెంపుతో డిజైర్ వివిధ వేరియంట్ల ధరలు కూడా పెరిగాయి.

అయితే మారుతి సుజుకి అన్ని వేరియంట్లపై ఒకే స్థాయిలో ధరలను పెంచలేదు. ఎంట్రీ-లెవల్ వేరియంట్ అయిన డిజైర్ LXi పెట్రోల్ మాన్యువల్ ధరను యథాతథంగా కొనసాగించింది. ఈ వేరియంట్ ఇప్పటికీ రూ. 6.26 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతోనే అందుబాటులో ఉంది. దీంతో బడ్జెట్‌లో డిజైర్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు కొంత ఊరట లభించినట్లైంది. ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసే వారికి ఈ నిర్ణయం ప్రయోజనకరంగా మారనుంది.
అయితే మిగిలిన చాలా వేరియంట్లపై కంపెనీ ధరలను సవరించింది. తాజా ధరల పెంపు అనంతరం మారుతి డిజైర్ ధరలు ఇప్పుడు రూ. 6.26 లక్షల నుంచి రూ. 9.36 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. అంటే వేరియంట్‌ను బట్టి కొనుగోలుదారులు గతంతో పోలిస్తే మరింత ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ల విషయానికి వస్తే, వీటి ధరలను గరిష్టంగా రూ. 5,000 వరకు మాత్రమే పెంచారు.

దీంతో పెట్రోల్ మోడళ్లను ఎంచుకునే కస్టమర్లపై ధరల పెంపు ప్రభావం కొంతవరకే పరిమితమైంది. అయితే CNG వేరియంట్లపై మాత్రం కంపెనీ మరింత ఎక్కువ ధర పెంపును అమలు చేసింది. ముఖ్యంగా VXi CNG, ZXi CNG ట్రిమ్‌ల ధరలను రూ. 7,500 వరకు పెంచింది. ఈ రెండు వేరియంట్లపైనే అత్యధిక ధరల పెంపు అమలైంది. ఈ రెండింటిని ఎంచుకునే వారు కాస్త ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం డిజైర్ LXi, VXi, ZXi, ZXi+ అనే ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఈ సెడాన్‌లో కొత్త తరం 1.2-లీటర్ Z12E, 3-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 82 bhp పవర్, 112 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు 5-స్పీడ్ AMT (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్ ఎంపికలను కూడా కంపెనీ అందిస్తోంది.

డిజైర్‌కు మరో ప్రధాన బలమైన అంశం CNG ఆప్షన్ అందుబాటులో ఉండటమే. పెట్రోల్‌తో పాటు ఫ్యాక్టరీ-ఫిటెడ్ CNG వేరియంట్ కూడా లభించడం వల్ల తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వినియోగదారులు దీనిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, డిజైర్ CNG ఒక కిలో CNGకి గరిష్టంగా 33.73 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.


Click it and Unblock the Notifications