రెండు ఫ్యామిలీలు ఇబ్బంది లేకుండా జర్నీ చేయొచ్చు.. అందుకే 30 రోజుల్లో 16,111 కార్లు అమ్ముడయ్యాయి
భారతీయ కార్ల వినియోగదారులకు మల్టీ యూటిలిటీ వెహికల్స్ (MUV) అంటే ఎప్పుడూ ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. పెద్ద కుటుంబాలు కలిసి ప్రయాణించడానికి ఈ కార్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. గత జూన్, 2026 నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే ఎప్పటిలాగే ఈసారి కూడా మారుతి సుజుకి ఎర్టిగా తన నంబర్-1 స్థానాన్ని పదిలం చేసుకుంది.
జూన్ నెలలో ఏకంగా 16,111 మంది కొత్త కస్టమర్లు ఎర్టిగా కారును కొనుగోలు చేశారు. గతేడాది జూన్ 2025లో ఈ కారు అమ్మకాలు 14,151 యూనిట్లుగా ఉండగా, ఈ ఏడాది వార్షిక ప్రాతిపదికన 13.9 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ప్రస్తుతం భారతదేశంలోని మొత్తం ఎంయూవీ కార్ల మార్కెట్లో ఒంటరిగానే 45.0 శాతం వాటాను ఎర్టిగా సొంతం చేసుకుంది.

ఈ అమ్మకాల జాబితాలో టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా (హైక్రాస్, క్రిస్టా) రెండో స్థానాన్ని దక్కించుకుంది. టయోటా ఇన్నోవా జూన్ నెలలో మొత్తం 7,332 యూనిట్ల అమ్మకాలను జరిపింది. అయితే గతేడాదితో పోలిస్తే ఇన్నోవా అమ్మకాలు 16.7 శాతం తగ్గుముఖం పట్టాయి. ఇక మూడో స్థానంలో కియా క్యారెన్స్, క్లెవిస్ జంట నిలిచాయి. కియా కంపెనీకి చెందిన ఈ కార్లు గతేడాదితో పోలిస్తే ఏకంగా 38.8 శాతం వార్షిక క్షీణతతో కేవలం 4,847 యూనిట్ల అమ్మకాలకే పరిమితం కావడం గమనార్హం.
అమ్మకాల లిస్ట్‌లో నాల్గో స్థానంలో మారుతి సుజుకికి చెందిన ప్రీమియం మోడల్ ఎక్స్‌ఎల్6 నిలిచింది. ఈ కారు జూన్ 2026లో 34.8 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 2,711 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అలాగే ఐదో స్థానంలో టయోటా కంపెనీకి చెందిన బడ్జెట్ మోడల్ రుమియాన్ నిలిచింది. మధ్యతరగతి కస్టమర్లను ఆకట్టుకుంటున్న టయోటా రుమియాన్ ఏకంగా 67.9 శాతం బంపర్ వృద్ధితో మొత్తం 2,376 యూనిట్ల కార్లను విక్రయించి మార్కెట్లో తన పట్టును నిరూపించుకుంది.

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ ఇమేజ్ కాపాడుకుంటూ రెనాల్ట్ ట్రైబర్ ఆరో స్థానంలో నిలిచింది. ఈ కారు జూన్ నెలలో 31.7 శాతం వృద్ధితో 1,871 యూనిట్ల అమ్మకాలను జరిపింది. ఇక ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఇన్విక్టో ఏడో స్థానంలో నిలిచింది.
ఇన్విక్టో కారు 32.2 శాతం వృద్ధితో మొత్తం 349 యూనిట్లు అమ్ముడైంది. సూపర్ ప్రీమియం, లగ్జరీ విభాగంలో టయోటా వెల్‌ఫైర్ 140 యూనిట్ల అమ్మకాలతో ఎనిమిదో స్థానంలో నిలవగా, కియా కార్నివాల్ కేవలం 30 యూనిట్ల అమ్మకాలతో తొమ్మిదో స్థానంలో అంటే ఆఖరి స్థానంలో నిలిచింది.

మారుతి సుజుకి ఎర్టిగా కారు ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడానికి ప్రధాన కారణం దాని పవర్‌ఫుల్ ఇంజన్, మైలేజ్ అని చెప్పవచ్చు. ఈ కారులో 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది.
ఎర్టిగా పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.3 కిలోమీటర్ల నుంచి 20.51 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇక CNG వేరియంట్ విషయానికి వస్తే కేజీ సిఎన్‌జికి ఏకంగా 26.11 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజ్‌ను ఇస్తుంది. మార్కెట్లో మారుతి ఎర్టిగా ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.80 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ రూ. 13.13 లక్షల వరకు ఉంటుంది.


Click it and Unblock the Notifications