రూ. 4 లక్షలకే మారుతి ఎలక్ట్రిక్ కారు? సామాన్యుల కోసం వరుసగా 4 కార్లు వచ్చేస్తున్నాయ్!
భారతీయ రహదారులపై దశాబ్దాలుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న మారుతి సుజుకి (Maruti Suzuki), ఇప్పుడు కొత్త దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఐసీ ఇంజిన్ కార్లలో అగ్రస్థానంలో నిలిచిన ఈ కంపెనీ, ఇకపై ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్‌లో కూడా అదే స్థాయిలో ప్రభావం చూపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా, వినియోగదారుల అభిరుచులు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్న నేపథ్యంలో, మారుతి తన భవిష్యత్ వ్యూహాన్ని బలంగా రూపొందిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా, కంపెనీ నాలుగు కొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. తక్కువ ధరలో అందుబాటులో ఉండే బడ్జెట్ ఈవీ నుంచి ప్రారంభించి, పెద్ద కుటుంబాలకు అనువైన 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ వరకు విస్తరించేలా ఈ లైనప్‌ను డిజైన్ చేస్తోంది.
ముఖ్యంగా, కేవలం రూ.4 లక్షల పరిధిలో ఎలక్ట్రిక్ కారు అందించాలనే ఆలోచన వినియోగదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది నిజంగా అమలైతే, భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు ఇది ఒక పెద్ద మలుపు కావచ్చు. ఇప్పటికే కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ మోడల్‌గా e-Vitara ను పరిచయం చేయడం ద్వారా ఈ సెగ్మెంట్‌లో ప్రవేశించింది. 2031 నాటికి మొత్తం నాలుగు కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఎలక్ట్రిక్ వాహనాల దిశగా దూసుకెళ్తున్న మారుతి సుజుకి, తన భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఒక కొత్త ఈవీని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యూహంలో రెండో అడుగుగా, కంపెనీ ఒక 7-సీటర్ ఎలక్ట్రిక్ MPVను మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం 'YMC' అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చెందుతున్న ఈ వాహనం, కుటుంబ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడుతోంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ MPV సుమారు రూ. 17 లక్షల ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇందులో అసలు గేమ్‌చేంజర్ అంశం 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (BaaS) మోడల్. ఈ పథకం కింద వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీ ఖర్చు చెల్లించాల్సిన అవసరం ఉండదు. దాని బదులుగా, వినియోగదారులు వారు నడిపిన ప్రతి కిలోమీటరుకు బ్యాటరీ కోసం అద్దె చెల్లిస్తారు.

ఈ విధానం అమలులోకి వస్తే, వాహనం ప్రారంభ ధర గణనీయంగా తగ్గి సుమారు రూ. 12 లక్షల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే, పెద్ద కుటుంబాల కోసం ఎలక్ట్రిక్ MPV మరింత అందుబాటులోకి వస్తుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, 'YMC' ఎలక్ట్రిక్ MPV రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభించనుందని సమాచారం. కంపెనీ ఇందులో 49 kWh, 61.1 kWh సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్‌లను అందించే అవకాశం ఉంది.
కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో మంచి పట్టున్న టాటా నెక్సాన్ EV స్థానంలో మారుతి బ్రెజ్జా లేదా ఫ్రాంక్స్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా మారుతి సుజుకి విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 12 లక్షలు ఉంటుందని అంచనా. అయితే ధరను తగ్గించడానికి BASS పథకం కింద, ఈ మోడల్‌ను సుమారు రూ. 8-9 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.

Tata Tiago EV, MG Comet EV మోడళ్లకు పోటీగా నిలిచే మరో కొత్త ఎలక్ట్రిక్ కారు రూ.7 లక్షల ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అయితే కంపెనీ అమలు చేయాలనుకుంటున్న 'బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్' లేదా బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్(BaaS) మోడల్ అమలులోకి వస్తే, ఈ కారు ప్రారంభ ధర మరింత తగ్గి రూ. 4 నుంచి రూ. 5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వీటన్నిటితో పాటు, మారుతి అత్యాధునిక ఫీచర్లతో కూడిన ప్రీమియం ఎలక్ట్రిక్ కారును కూడా సిద్ధం చేస్తోంది. అత్యాధునిక సాంకేతికత, ఆధునిక డిజైన్, విలాసవంతమైన ఫీచర్లు కలిపి ఈ మోడల్‌ను రూపొందించనున్నారు. దీని ద్వారా కేవలం బడ్జెట్ కార్ల తయారీదారుగా ఉన్న మారుతి బ్రాండ్ ఇమేజ్‌ను మరింత ప్రీమియం స్థాయికి తీసుకెళ్లాలని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








