పెద్ద ఫ్యామిలీకి పర్ఫెక్టు కారు..23 కిమీ మైలేజ్ ఇచ్చినా ఇది మారుతి సుజుకి చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్
భారత ఆటోమొబైల్ మార్కెట్లో బడ్జెట్ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మారుతి సుజుకి కంపెనీకి ఒక పెద్ద షాక్ తగిలింది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలోనే అత్యంత ఖరీదైన, లగ్జరీ మోడల్‌గా ప్రవేశపెట్టిన మారుతి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.
గత నెల అంటే మే 2026 సేల్స్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే, ఈ కారును కొనేందుకు కస్టమర్లు అస్సలు ఆసక్తి చూపించడం లేదని స్పష్టమవుతోంది. మే నెలలో ఈ మోడల్ కేవలం 301 యూనిట్లు మాత్రమే అమ్ముడై అత్యంత తక్కువ సేల్స్ ఉన్న కారుగా రికార్డు కెక్కింది.

ఈ ఏడాదిలో ఇదే పెద్ద సేల్
నిజానికి, గత కొన్ని నెలలతో పోలిస్తే మే నెలలో నమోదైన 301 యూనిట్ల అమ్మకాలే ఈ ఏడాదిలో ఇన్విక్టో సాధించిన అత్యధిక విక్రయాలు కావడం విశేషం. అయినప్పటికీ మారుతి వంటి పెద్ద కంపెనీ రేంజ్ హవాకు ఈ సంఖ్య చాలా తక్కువ.
ఈ 2026 సంవత్సరంలో గత ఐదు నెలల్లో ఈ కారు మొత్తం 1,069 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. నెలవారీగా చూస్తే జనవరిలో 197 యూనిట్లు, ఫిబ్రవరిలో 143 యూనిట్లు, మార్చిలో 191 యూనిట్లు, ఏప్రిల్‌లో 237 యూనిట్లు, మే నెలలో 301 యూనిట్ల చొప్పున విక్రయాలు జరిగాయి.

ఇన్నోవాతో గట్టి పోటీ
మారుతి ఇన్విక్టో కారు నిజానికి టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross)కు రీబ్యాడ్జ్ వెర్షన్. టయోటా కంపెనీతో ఉన్న ఒప్పందంలో భాగంగా అదే కారును మారుతి కొన్ని మార్పులతో ఇన్విక్టోగా అమ్ముతోంది. మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 24.97 లక్షల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 28.61 లక్షల వరకు ఉంది.
ఈ కారు జెటా+ వేరియంట్లలో 7-సీటర్, 8-సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అయితే కస్టమర్లు ఇంత భారీ బడ్జెట్ పెట్టేటప్పుడు మారుతి కంటే టయోటా ఇన్నోవా వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుండటంతో ఇన్విక్టోకు గిరాకీ తగ్గింది.

పవర్‌ఫుల్ ఇంజన్ - మైండ్ బ్లోయింగ్ మైలేజ్
ధర, అమ్మకాలు ఎలా ఉన్నప్పటికీ ఈ కారు పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మారుతి ఇన్విక్టోలో ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడిన 2.0-లీటర్ TNGA పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది ఈ-సివిటి (E-CVT) గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి ఉంది.
ఈ ఇంజన్ గరిష్టంగా 183 హెచ్‌పీ పవర్‌ను, 1250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ లగ్జరీ కారు కేవలం 9.5 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంతేకాకుండా, ఇంత పెద్ద కారు అయినప్పటికీ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల లీటరు పెట్రోల్‌కు ఏకంగా 23.24 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
లగ్జరీ ఫీచర్లు, అదరిపోయే సేఫ్టీ
ఈ కారు డిజైన్ పరంగా చాలా మస్కులర్‌గా ఉంటుంది. ఇందులో స్లీక్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, డీఆర్‌ఎల్‌లు, హెక్సాగనల్ గ్రిల్, సిల్వర్ స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి. కారు లోపల డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, లెదర్ అప్హోల్‌స్టరీ, పనోరమిక్ సన్ రూఫ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, మూడ్ లైటింగ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.
భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, నెక్స్ట్-జెన్ సుజుకి కనెక్ట్ ఫీచర్లు ఇచ్చారు. 4755 ఎమ్‌ఎమ్ పొడవు, 1850 ఎమ్‌ఎమ్ వెడల్పు ఉన్న ఈ కారులో వన్-టచ్ పవర్ టెయిల్‌గేట్, వెంటిలేటెడ్ సీట్లు కూడా లభిస్తాయి. కానీ ఇంతటి లగ్జరీ ఫీచర్లు ఉన్నా బ్రాండ్ ఇమేజ్ కారణంగా సేల్స్ పెరగడం లేదు.


Click it and Unblock the Notifications