రోడ్డు మీద చూస్తే ప్రతి రెండో కారు బ్రెజ్జానే.. ఏంటి బాబూ ఈ రేంజ్ క్రేజ్.. 12 నెలల్లో 1.80 లక్షల మంది ఫిదా
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మధ్యతరగతి సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు అందరికీ నచ్చేలా కార్లను రూపొందించడంలో ఈ కంపెనీ దిట్ట. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం (FY2026) గణాంకాలను పరిశీలిస్తే, మారుతి సుజుకికి చెందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజ్జా (Brezza) మరోసారి తన సత్తా చాటింది. ఏడాది పొడవునా లక్షలాది మంది కస్టమర్లను ఆకట్టుకుంటూ అమ్మకాల్లో దూసుకుపోతోంది.
అమ్మకాల్లో తగ్గుముఖం ఉన్నా.. అగ్రస్థానమే
గత ఆర్థిక సంవత్సరం (FY2026) లో మారుతి సుజుకి బ్రెజ్జా ఏకంగా 1,80,104 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అయితే, అంతకుముందు ఏడాది (FY2025)లో జరిగిన 1,89,163 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది 5 శాతం తక్కువ. అయినప్పటికీ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో లక్షా ఎనభై వేల మందికి పైగా కస్టమర్లను సంపాదించుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ వంటి గట్టి పోటీదారులు ఉన్నప్పటికీ బ్రెజ్జా తన పట్టును నిలబెట్టుకుంది.

చూపు తిప్పుకోనివ్వని మోడ్రన్ డిజైన్
పాత విటారా బ్రెజ్జాతో పోలిస్తే, ప్రస్తుత కొత్త బ్రెజ్జా డిజైన్ చాలా బోల్డ్‌గా, మోడ్రన్‌గా మారింది. దీని ఫ్రంట్ గ్రిల్‌కు గన్మెటల్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల కారుకు ఒక ప్రీమియం లుక్ వచ్చింది. స్లీక్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్, అట్రాక్టివ్ ఎల్-షేప్డ్ ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs) రాత్రి వేళల్లో కారును మెరిసిపోయేలా చేస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, మస్కులర్ క్లాడింగ్ దీనికి పక్కా ఎస్‌యూవీ రూపాన్ని ఇచ్చాయి. వెనుక వైపు సన్నని ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, Brezza సిగ్నేచర్ బ్యాజింగ్ కారును స్పోర్టీగా చూపిస్తాయి.
ఫీచర్ల సునామీ.. లోపల అంతా టెక్నాలజీయే
మారుతి సుజుకి బ్రెజ్జా కేవలం బయట మాత్రమే కాదు, లోపల కూడా అద్భుతమైన ఫీచర్లతో నిండిపోయింది. మారుతి కార్లలో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ను ఈ మోడల్ లోనే ప్రవేశపెట్టారు. అలాగే రద్దీగా ఉండే నగరాల్లో పార్కింగ్ కోసం 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్సుడ్ ఫీచర్ కూడా ఉంది. 9-అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో+ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లేను సపోర్ట్ చేస్తుంది. అదనంగా హెడ్-అప్ డిస్ప్లే (HUD) ఫీచర్ ఉండటం వల్ల డ్రైవర్ రోడ్డు మీదే దృష్టి పెట్టి అవసరమైన సమాచారాన్ని స్పీడోమీటర్ పై చూడవచ్చు.

పవర్‌ఫుల్ ఇంజిన్, అద్భుతమైన మైలేజీ
బ్రెజ్జాలో 1.5-లీటర్ K15C పెట్రోల్ ఇంజిన్‌ను వాడారు. ఇది 103bhp పవర్, 137Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. మైలేజీ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్ లీటరుకు సుమారు 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుండగా, సీఎన్‌జీ వేరియంట్ కిలో గ్యాస్‌కు ఏకంగా 25 కిలోమీటర్ల పైగా మైలేజీని ఇస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి సీఎన్‌జీ వేరియంట్ ఒక వరం లాంటిది.
సేఫ్టీకి పెద్దపీట
మారుతి కార్లలో సేఫ్టీ తక్కువగా ఉంటుందనే విమర్శలకు బ్రెజ్జా చెక్ పెట్టింది. ఇందులో గరిష్టంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ (ABS) వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టుల్లో కూడా బ్రెజ్జా మెరుగైన రేటింగ్ సాధించడం వల్ల కస్టమర్లు దీనిని ధైర్యంగా కొనుగోలు చేస్తున్నారు.

ధర
మారుతి సుజుకి బ్రెజ్జా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.8.26 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ ధర రూ.14.14 లక్షల వరకు ఉంటుంది. ఇతర లగ్జరీ ఎస్‌యూవీలతో పోలిస్తే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, మంచి మైలేజీ, సుజుకి విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ ఉండటమే దీని విజయానికి ప్రధాన కారణాలు. ఎర్టిగా, నెక్సాన్, ఎక్స్ యూవీ 3XO వంటి కార్లకు బ్రెజ్జా గట్టి పోటీనిస్తోంది.


Click it and Unblock the Notifications








