రూ.6 లక్షల లోపే దొరుకుతాయి.. మిడిల్ క్లాస్ జనాల ఫేవరెట్ కార్లు ఇవే.. వాటి సేల్స్ రిపోర్ట్ ఇదే
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లోని హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి సంస్థ తన ఏకఛత్రాధిపత్యాన్ని చాటుకుంటోంది. గత మే నెల కార్ల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. కంపెనీకి చెందిన మూడు హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు అయిన బాలెనో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ కార్లు గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి.
మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న మహింద్రా స్కార్పియో, హ్యుందాయ్ క్రెటా వంటి భారీ ఎస్‌యూవీ కార్లను సైతం వెనక్కి నెట్టి మారుతి కార్లు దూసుకుపోతున్నాయి. మే నెలలో ఈ మూడు మోడళ్లు కలిపి ఏకంగా 53,991 యూనిట్ల మేర అమ్ముడుపోవడం విశేషం. ఈ మూడు కార్ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షల కంటే తక్కువగానే ఉండటం వీటికి ఇంతటి ఆదరణ లభించడానికి ప్రధాన కారణం.

మే నెలలో దేశవ్యాప్తంగా అమ్ముడైన కార్ల మోడల్ వైజ్ గణాంకాలను గమనిస్తే.. మారుతి సుజుకి డిజైర్ 24,546 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ 20,686 యూనిట్లు, మారుతి సుజుకి ఎర్టిగా 20,350 యూనిట్లతో నిలిచాయి. టాటా కంపెనీకి చెందిన పాపులర్ మోడల్ టాటా పంచ్ 20,208 యూనిట్లు, టాటా నెక్సాన్ 19,100 యూనిట్ల విక్రయాలతో టాప్-5లో నిలిచాయి.
ఇక మారుతి సుజుకి బాలెనో 18,396 యూనిట్లు, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ 18,076 యూనిట్లు, మారుతి సుజుకి స్విఫ్ట్ 17,519 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. చివరి రెండు స్థానాల్లో మహింద్రా స్కార్పియో 15,774 యూనిట్లు, హ్యుందాయ్ క్రెటా 15,235 యూనిట్ల విక్రయాలతో నిలిచాయి.

మారుతి సుజుకి బాలెనో కారు అద్భుతమైన ఏరోడైనమిక్ బాడీ డిజైన్, బోల్డ్ ఫ్రంట్ గ్రిల్‌తో వస్తుంది. దీని ముందు భాగంలో షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్టైలిష్ డీఆర్‌ఎల్‌లు ఉండగా, వెనుక వైపు అగ్రెసివ్ బంపర్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షలుగా ఉంది. కేబిన్ లోపల 9-ఇంచుల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేను సపోర్ట్ చేస్తుంది.
ఇందులో హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), 360-డిగ్రీ కెమెరా, ఆర్కామిస్ ఆడియో సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, హిల్-స్టార్ట్ అసిస్ట్ వంటి గంభీరమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 2-లీటర్ కే-సిరీస్ పెట్రోల్ ఇంజన్ కలిగిన ఈ కారు లీటరుకు 22 నుంచి 23 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
భారతదేశంలో టాల్‌బాయ్ డిజైన్‌తో ఎంతో పాపులర్ అయిన మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4,98,900గా ఉంది. ఈ కారులో నెవిగేషన్‌తో కూడిన 7-ఇంచుల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి.

సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఏఎమ్‌టీ వేరియంట్లలో హిల్-హోల్డ్ అసిస్ట్ ఫీచర్లు ఇచ్చారు. ఇది 1.0-లీటర్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.0-లీటర్ పెట్రోల్ వేరియంట్ 25.19 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగా, దీని సిఎన్‌జీ (CNG) వేరియంట్ ఏకంగా కిలోకు 34.05 కిలోమీటర్ల మైలేజీని ఇస్తూ అత్యంత పొదుపైన కారుగా నిలిచింది.
ఇటీవలే సరికొత్త మార్పులతో లాంచైన న్యూ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ కారులో సరికొత్త జెడ్-సిరీస్ (Z12E) 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 80 బీహెచ్‌పీ పవర్, 112 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ సెటప్‌తో వచ్చే ఈ కారు మాన్యువల్ వేరియంట్ 24.80 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వేరియంట్ 25.75 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5,78,900 గా ఉంది. దీని కేబిన్‌లో 9-ఇంచుల ఫ్రీ-స్టాండింగ్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ స్క్రీన్, రియర్ ఏసీ వెంట్స్, వైర్‌లెస్ ఛార్జర్, రియర్ వ్యూ కెమెరా ఉన్నాయి. సేఫ్టీ పరంగా అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ (ESP), హిల్ హోల్డ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లను అందించారు.


Click it and Unblock the Notifications