పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు పెద్ద కుటుంబాలు కలిసి వెళ్లేందుకు పర్ఫెక్ట్ కారు.. 2 లక్షల కార్ల విక్రయాలతో రికార్డ్
భారతదేశంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఇవి కాలక్రమేణా చిన్న కుటుంబాలు పెరిగినా, పండుగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఫ్యామిలీ ట్రిప్స్ అనగానే అందరూ కలిసి వెళ్లడానికే మొగ్గు చూపుతారు. ఇలాంటి పెద్ద కుటుంబాల కలల కారుగా మధ్యతరగతి ప్రజల ఆశాకిరణంగా నిలించింది మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga).
తాజాగా ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరంలో (FY26) ఎర్టిగా క్రియేట్ చేసిన రికార్డులు చూస్తుంటే..ఈ కారుకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది. దాదాపు 2 లక్షల యూనిట్ల విక్రయాలతో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన 7 సీటర్ ఎంపీవీగా చరిత్ర సృష్టించింది.

భారతీయ ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి అంటేనే ఒక నమ్మకం. అందులోనూ 7 సీటర్ సెగ్మెంట్లో ఎర్టిగాకు ఉన్న స్థానం చాలా స్పెషల్. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కారు ఏకంగా 1,98,876 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. అంటే దాదాపు 2 లక్షల కుటుంబాలు ఈ కారును తమ ఇంటి సభ్యుడిగా చేసుకున్నాయి.
గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో 4 శాతం వృద్ధిని కనబరిచింది. ఒక ఎంపీవీ (Multi Purpose Vehicle) ఇంత భారీ స్థాయిలో అమ్ముడవ్వడం భారత మార్కెట్లో ఇదే తొలిసారి. సాధారణంగా 7 సీటర్ కార్లు అనగానే మనకు టక్కున టయోటా ఇన్నోవానే గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం ఇన్నోవా ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవు.
టయోటా ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్ మోడళ్ల రెండింటినీ కలిపినా గతేడాది అమ్మకాలు కేవలం 1.12 లక్షల యూనిట్లు మాత్రమే. అంటే ఇన్నోవా అమ్మకాల కంటే ఎర్టిగా విక్రయాలు దాదాపు రెట్టింపుగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఎర్టిగా ప్రైసింగ్. రూ.8.79 లక్షల నుంచి రూ.12.94 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయే కారు దొరకడం అంటే అదృష్టమే.

ఎర్టిగా సక్సెస్ వెనుక ఉన్న అసలు రహస్యం దాని ఇంజిన్ కెపాసిటీ. ఇందులో 1.5 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను వాడారు. ఇది 103 బీహెచ్‌పీ పవర్, 137 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. అయితే, అందరినీ ఆకట్టుకునే అంశం ఏంటంటే దీని సిఎన్జి (CNG) వెర్షన్.
పెట్రోల్ ధరలు మండుతున్న ఈ రోజుల్లో, కిలో సీఎన్జీకి సుమారు 26 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వడం వల్ల సామాన్యులు, ట్రావెల్ ఆపరేటర్లు ఎర్టిగా వైపు మొగ్గు చూపుతున్నారు. పెద్ద ఫ్యామిలీ కారు అంటే కేవలం సీట్లు ఉంటే సరిపోదు. ప్రయాణం కూడా సుఖంగా ఉండాలి. ఎర్టిగాలో మూడవ వరుసలో కూర్చునే వారికి కూడా సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేశారు.
ఇందులో 7 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక వరుసలో కూర్చునే వారి కోసం ప్రత్యేకంగా ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ వేరియంట్లలో క్రూయిజ్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ (సుజుకి కనెక్ట్) కూడా ఉండడం వల్ల ప్రయాణం మరింత స్మార్ట్ గా మారుతుంది.

మారుతి సుజుకికి చెందిన ఇతర కార్లతో పోలిస్తే కూడా ఎర్టిగా తన పట్టును చూపించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజైర్ (2,29,130 యూనిట్లు), టాటా నెక్సాన్ (2,16,054 యూనిట్లు), హ్యుందాయ్ క్రెటా (2,01,921 యూనిట్లు) మొదటి మూడు స్థానాల్లో నిలవగా, ఎర్టిగా నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
అయితే 7-సీటర్ విభాగంలో మాత్రం ఇదే టాప్ ప్లేసులో ఉంది. టయోటా రూమియన్, కియా క్యారెన్స్ వంటి కార్లు పోటీలో ఉన్నప్పటికీ ఎర్టిగా దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. మారుతి తన కొత్త మోడల్స్ లో టాటా మాదిరి సేఫ్టికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
ఎర్టిగాలో 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి ఫీచర్లు బేసిక్ వేరియంట్ల నుంచే లభిస్తున్నాయి. ఇది కుటుంబ సభ్యుల సేఫ్టీ పై భరోసాను అందిస్తుంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు మంచి స్టేబిలిటీని ఇవ్వడమే కాకుండా తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉండడం వల్ల ఈ కారుకు ఫుల్ డిమాండ్ ఉంది.
మొత్తం మీద మన దేశంలో ఒక పెద్ద కుటుంబానికి ఒకే కారులో సరసమైన ధరలో సుఖవంతమైన ప్రయాణాన్ని అందించే ఏకైక ఎంపీవీగా ఎర్టిగా తన పేరును మార్కెట్లో సుస్థిరం చేసుకుంది. కేవలం వ్యక్తిగత అవసరాలకు మాత్రమే కాకుండా ట్యాక్సీ మార్కెట్లో కూడా ఇది తిరుగులేని రారాజు. అందుకే 2026 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల మైలురాయిని దాటి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications