బైక్‌తో పాటు సమానంగా మైలేజ్ ఇచ్చే మారుతి కారు.. కేవలం 3 ఏళ్లలో 5 లక్షల ఇళ్లకు చేరింది!
మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) భారత మార్కెట్లో మరో అరుదైన మైలురాయిని అందుకుంది. దేశంలోని అత్యంత పోటీ ఉన్న సబ్-కాంపాక్ట్ క్రాస్ఓవర్ SUV సెగ్మెంట్‌లో విక్రయించబడుతున్నప్పటికీ, ఈ మోడల్ అమ్మకాల పరంగా అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తూ 5 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును దాటింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి నెక్సా SUVగా ఫ్రాంక్స్ చరిత్ర సృష్టించింది. 2023 ఏప్రిల్‌లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఫ్రాంక్స్, ప్రారంభం నుంచే వినియోగదారుల నుంచి విశేష ఆదరణ పొందింది. SUV తరహా డిజైన్, ప్రీమియం ఫీచర్లు, మంచి మైలేజ్, అందుబాటు ధరలు, మారుతి సుజుకి బ్రాండ్‌పై ఉన్న నమ్మకం ఈ వాహనం విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
మార్కెట్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఫ్రాంక్స్ భారీ డిమాండ్‌ను సొంతం చేసుకుని కంపెనీ బెస్ట్ సెల్లింగ్ మోడళ్ల జాబితాలో స్థానం సంపాదించింది. సాధారణంగా 5 లక్షల అమ్మకాల మార్కును చేరుకోవడానికి చాలా వాహనాలకు ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అయితే ఫ్రాంక్స్ కేవలం మూడేళ్లలోపే ఈ ఘనతను అందుకోవడం డిమాండ్‌కు నిదర్శనం. ముఖ్యంగా యువత, చిన్న కుటుంబాలు, మొదటిసారి SUV కొనుగోలు చేసే కస్టమర్లు దీన్ని ఎక్కువగా ఎంచుకోవడం అమ్మకాలకు బలాన్నిచ్చింది.

భారత ఆటోమొబైల్ మార్కెట్లో సబ్-కాంపాక్ట్ SUV సెగ్మెంట్ అత్యంత పోటీతో కూడుకున్నది. ఈ విభాగంలో అనేక ప్రముఖ కంపెనీల మోడళ్లు ఉన్నప్పటికీ, ఫ్రాంక్స్ మాత్రం తన ప్రత్యేకతతో వినియోగదారులను ఆకట్టుకుంటూ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. ప్రతి నెలా స్థిరమైన అమ్మకాలను నమోదు చేస్తూ దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్ల జాబితాలో టాప్-10లో చోటు దక్కించుకోవడం దీనికి నిదర్శనం.
ఫ్రాంక్స్ అమ్మకాల వేగం సంవత్సరానికొకసారి మరింత పెరుగుతూ ఉండటం ఈ మోడల్‌పై కస్టమర్ల నమ్మకాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రారంభంలో మొదటి లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకోవడానికి ఫ్రాంక్స్‌కు 10 నెలల సమయం పట్టింది. అయితే ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం చివరి లక్ష యూనిట్లను విక్రయించడానికి కేవలం ఐదు నెలల సమయం మాత్రమే తీసుకోవడం ఈ క్రాస్ఓవర్ SUVకు మార్కెట్లో ఎంతటి డిమాండ్ ఉందో చూపిస్తోంది.

అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, విక్రయాలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 1.34 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 1.66 లక్షల యూనిట్లకు చేరి గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ పెరుగుదల అక్కడితో ఆగలేదు. 2026 ఆర్థిక సంవత్సరంలో ఫ్రాంక్స్ తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తూ 1.72 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
ఈ గణాంకాలు చూస్తే ఫ్రాంక్స్ మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో అత్యంత కీలకమైన వాహనంగా మారిందని అర్థమవుతోంది. ఆకర్షణీయమైన SUV స్టైలింగ్, ప్రీమియం నెక్సా అనుభవం, ఇంధన సామర్థ్యం, ఆధునిక ఫీచర్లు, విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాలు ఈ వాహన విజయానికి బలమైన పునాది అయ్యాయి. కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలోనే 5 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకోని తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది.

ఫ్రాంక్స్ ధరలు రూ.6.85 లక్షల నుంచి రూ.11.98 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ SUVలో 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2-లీటర్ CNG ఇంజిన్ ఉన్నాయి. టర్బో పెట్రోల్ ఇంజిన్ 99 bhp పవర్‌తో 20.1-21.5 kmpl వరకు మైలేజీ ఇస్తుంది. 1.2-లీటర్ పెట్రోల్ 21.79-22.89 kmpl వరకు మైలేజీ అందిస్తుండగా, CNG వేరియంట్ 28.51 km/kg మైలేజీ ఇస్తుంది. ఇది కొన్ని బైకులతో సమానం.


Click it and Unblock the Notifications