ఈ కారుని జనాలు పట్టించుకోవడం లేదు.. కేవలం 197 మంది మాత్రమే కొన్నారు! దారుణమైన స్థితి
మారుతి సుజుకి (Maruti Suzuki) అనే పేరు వినగానే భారత మార్కెట్‌లో అమ్మకాల రికార్డులు గుర్తుకొస్తాయి. డిజైర్, ఎర్టిగా, ఫ్రాంక్స్, బాలెనో, వ్యాగన్ఆర్ లాంటి కార్లు ప్రతి నెలా వేల సంఖ్యలో అమ్ముడవుతూ, కంపెనీకి టాప్ సెల్లర్స్‌గా నిలుస్తున్నాయి. ఈ కార్ల మధ్య ఏది నంబర్ వన్ అనే పోటీ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అయితే, ఇదే మారుతి సుజుకి లైనప్‌లో అత్యల్పంగా అమ్ముడవుతున్న కారు ఏది? అని ఎవరైనా ఆలోచించారా? ఆశ్చర్యంగా అనిపించినా, ఆ జాబితాలో ముందుంటుంది ఒకే ఒక్క కారు... అదే మారుతి సుజుకి ఇన్విక్టో (Invicto). ఇన్విక్టోను ఒక్కసారి చూస్తేనే ఇది సాధారణ మారుతి కారు కాదు అనే ఫీలింగ్ వస్తుంది. సైజ్ పరంగా చూస్తే ఇది నిజంగా ఏనుగు సైజు MPVలా కనిపిస్తుంది.
రోడ్డుపై భారీ ప్రెజెన్స్, పొడవైన బాడీ, విశాలమైన క్యాబిన్‌తో రెండు కుటుంబాలు కలిసి ప్రయాణించడానికి సరిపోయేంత స్థలం అందిస్తుంది. అంత పెద్దదిగా, ఉండి కూడా అమ్మకాల విషయంలో మాత్రం బాగా వెనుకబడింది. నెలకు వందల సంఖ్యలో కూడా అమ్మకాలు నమోదు కాకపోవడం ఇన్విక్టోకు పెద్ద మైనస్. మారుతి అంటే మైలేజ్, తక్కువ ధర, మెయింటెనెన్స్ సులువు అనే ఆలోచనతో కొనుగోలుదారులు ముందుకు వస్తారు. కానీ ఇన్విక్టో మాత్రం ఆదరణ కోల్పోతుంది.

జనవరి నెలలో మారుతి సుజుకి ఇన్విక్టోకు అమ్మకాల పరంగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీకి చెందిన ఈ పెద్ద, 8 సీట్ల ప్రీమియం MPVలో ఆ నెలలో కేవలం 197 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. ఇది గత ఆరు నెలల కాలంలో ఇన్విక్టోకు నమోదైన అత్యంత బలహీనమైన అమ్మకాల గణాంకంగా నిలిచింది. గత ఆరు నెలల ట్రెండ్‌ను గమనిస్తే, ఇన్విక్టో అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నట్టు కనిపించాయి.
ఆగస్టు 2025లో 237 యూనిట్లు, సెప్టెంబర్ 2025లో 215 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత అక్టోబర్‌లో అమ్మకాలు కొంత ఊపందుకుని 301 యూనిట్లకు చేరాయి. నవంబర్‌లో ఈ సంఖ్య మరింత పెరిగి 410 యూనిట్లు, డిసెంబర్ 2025లో అయితే ఏకంగా 514 యూనిట్లు అమ్ముడయ్యాయి. డిసెంబర్‌లో వచ్చిన ఈ మంచి నంబర్లతో, 2026లో ఇన్విక్టో అమ్మకాలు మరింత మెరుగవుతాయన్న అంచనాలు కూడా ఏర్పడ్డాయి.

అయితే, కొత్త క్యాలెండర్ సంవత్సరం ప్రారంభమైన వెంటనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2026 జనవరిలో అమ్మకాలు ఒక్కసారిగా 197 యూనిట్లకు పడిపోయాయి.ఇది డిసెంబర్‌తో పోలిస్తే భారీ పతనం. అంతేకాదు, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. జనవరి 2024లో ఇన్విక్టో 556 యూనిట్లు అమ్ముడయ్యాయి.ఇప్పుడు అదే కారుకు జనవరి 2026లో వచ్చిన అమ్మకాలను చూస్తే, సంవత్సరానికి 64.57 శాతం నష్టం నమోదైనట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ సంఖ్యలు చూస్తే, మారుతి సుజుకి లైనప్‌లో ఇన్విక్టో ప్రస్తుతం ఎంతటి కష్టకాలాన్ని ఎదుర్కొంటుందో అర్థమవుతోంది. సైజ్ పరంగా ఏనుగు సైజు లాగా కనిపించే పెద్ద సంఖ్యలో కస్టమర్లను ఆకర్షించలేకపోతోంది. ఈ పరిస్థితిని మార్చడానికి కంపెనీ కూడా యాక్టివ్‌గా ప్రయత్నిస్తోంది. అమ్మకాలను పెంచడం, షోరూమ్‌లలో ఉన్న స్టాక్‌ను క్లియర్ చేయడం కోసం ప్రతి నెలా లక్షల రూపాయల విలువైన భారీ డిస్కౌంట్ ఆఫర్‌లను ఇన్విక్టోపై అందిస్తోంది.

కొత్త మారుతి సుజుకి ఇన్విక్టో ధర కొంచెం ప్రీమియం రేంజ్‌లో ఉంది. ఈ MPV ధర రూ. 24.97 లక్షల నుండి రూ. 28.61 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండగా, ఈ ప్రైస్ కాస్త ఎక్కువగా ఉండటం కారణంగా చాలా మంది కొనుగోలు చేయడానికి కాస్త వెనకడుగు వేస్తున్నారని మార్కెట్ వర్గాలు అంచన వేస్తున్నాయి. రానున్నరోజుల్లో దీని సేల్స్ పెంచడానికి మారుతి మరిన్ని కీలక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications








