మారుతి మాస్టర్ ప్లాన్..ఇక పెట్రోల్ బంకుల్లోనే కారు సర్వీసింగ్..కస్టమర్లకు పండగే
భారతదేశంలో కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి ఎందుకు రారాజుగా వెలుగుతుందో చెప్పడానికి మరో బలమైన కారణం దొరికింది. కేవలం కార్లను అమ్మడమే కాదు, అమ్మిన తర్వాత కస్టమర్లకు అందించే సర్వీస్ విషయంలో కూడా తమకు సాటి ఎవరూ లేరని మారుతి మరోసారి నిరూపించుకుంది. ఇందుకోసం మారుతి సుజుకి సంస్థ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL)తో చేతులు కలిపి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
మారుతి సుజుకి అంటేనే మధ్యతరగతి భారతీయుల నమ్మకం. కారు కొనాలని అనుకునే సగటు మనిషి మొదట ఆలోచించేది సర్వీసింగ్ ఎక్కడ చేయించాలి? విడిభాగాలు దొరుకుతాయా? అని. ఈ నమ్మకాన్ని మరింత బలపరుస్తూ మారుతి సుజుకి తన సర్వీస్ నెట్‌వర్క్‌ను ఊహించని స్థాయికి తీసుకెళ్తోంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా 2,882 నగరాల్లో 5,780 సర్వీస్ సెంటర్లను కలిగి ఉన్న మారుతి, ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL)తో జతకట్టింది. ఈ ఒప్పందం ప్రకారం సెలక్ట్ చేసిన ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల్లో మారుతి సుజుకి సర్వీస్ పాయింట్లను ఏర్పాటు చేయబోతున్నారు.
చాలామందికి కారు సర్వీసింగ్ సెంటర్‌కు వెళ్లి రోజంతా అక్కడ గడపడం అంటే పెద్ద తలనొప్పిగా ఉంటుంది. కానీ ఇకపై ఆ అవసరం ఉండదు. మీరు పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్ళినప్పుడే, మీ కారుకు సంబంధించిన చిన్నపాటి సమస్యలను అక్కడ ఉన్న మారుతి సర్వీస్ సెంటర్‌లో చూపించుకోవచ్చు.

సాధారణంగా చేసే ఆయిల్ మార్పు, క్లీనింగ్, చిన్న చిన్న రిపేర్ల వంటి పనులను ఇక్కడ క్షణాల్లో పూర్తి చేస్తారు. కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్యలను కూడా పరిష్కరించేలా ఈ సెంటర్లను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు దేశవ్యాప్తంగా 41 వేలకు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో అత్యధిక రద్దీ ఉన్న ప్రాంతాలు, హైవేలపై ఉన్న బంకులను ఎంపిక చేసి, అక్కడ మారుతి తన సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది.

దీనివల్ల లాంగ్ డ్రైవ్ వెళ్ళే వారికి కారులో ఏదైనా సమస్య వస్తే, వెంటనే దగ్గరలోని పెట్రోల్ బంకులోనే మారుతి నిపుణులు అందుబాటులో ఉంటారు. ఇది కస్టమర్ల ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మరియు సులభంగా మారుస్తుంది.
మారుతి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఇతర కారు తయారీ సంస్థలైన హ్యుందాయ్, టాటా, మహీంద్రా వంటి కంపెనీలకు సవాల్‌గా మారింది. కారు అమ్మడం ఒకెత్తయితే, ఆ కారును ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవడం మరో ఎత్తు.

మారుతి సరిగ్గా అదే పాయింట్‌ను పట్టుకుంది. ఈ సర్వీస్ సెంటర్ల ఏర్పాటుతో మారుతి కార్ల రీసేల్ వాల్యూ కూడా పెరుగుతుంది. కస్టమర్లకు సర్వీసింగ్ విషయంలో ఎలాంటి భయం లేకపోవడం వల్ల భవిష్యత్తులో మారుతి కార్ల విక్రయాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
మారుతి సుజుకి దశాబ్దాలుగా నెంబర్-1 స్థానంలో ఉండటానికి కారణం కేవలం కొత్త మోడల్స్ కాదు, కస్టమర్ల సౌకర్యం కోసం ఇలాంటి వినూత్న ఆలోచనలు చేయడమే. ఐఓసీఎల్ బంకుల్లో సర్వీస్ పాయింట్లు అంటే అది కేవలం ఒక రిపేర్ షాపు కాదు, కస్టమర్లకు ఇచ్చే అతిపెద్ద భరోసా.
మారుతి సుజుకి అధికారికంగా విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం..ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇది అమల్లోకి వస్తే మారుతి కారు ఉన్న ప్రతి ఒక్కరికీ పండగే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications








