రేపే దేశంలోనే తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు రివీల్! మారుతి వ్యాగన్‌ఆర్‌నా.. ఫ్రాంక్స్‌నా?.. ఉత్కంఠకు తెర!
భారత ఆటోమొబైల్ రంగంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. పర్యావరణ పరిరక్షణ, దిగుమతి ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించడం, స్వదేశీ ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో దేశం ముందుకు సాగుతున్న వేళ, మారుతి సుజుకి (Maruti Suzuki) ఒక చారిత్రాత్మక అడుగు వేయబోతోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5)కు ముందురోజు అయిన జూన్ 4న, భారతదేశంలోనే తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని అధికారికంగా ఆవిష్కరించేందుకు కంపెనీ సిద్ధమైంది. న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక తాజ్ ప్యాలెస్ హోటల్‌లో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
దీంతో ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ భారత ఆటో రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. ఇది కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు, దేశీయంగా ఉత్పత్తి అయ్యే బయోఫ్యూయల్స్‌కు డిమాండ్ పెంచడంలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటివరకు భారత మార్కెట్లో ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాల్లో ఫ్లెక్స్-ఫ్యూయల్ సాంకేతికతపై చర్చలు జరిగినప్పటికీ, ప్యాసింజర్ కార్ల విభాగంలో ఇది తొలి అడుగు కావడం విశేషం.

భారతదేశంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగానికి మరింత ఊతమిచ్చేలా మారుతి సుజుకి తీసుకురానున్న కొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మోడల్ పూర్తిగా 100 శాతం ఇథనాల్ (E100)పై నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో, దేశంలోనే తొలి మాస్-మార్కెట్ E100 ప్యాసింజర్ వాహనంగా చరిత్ర సృష్టించనుంది. పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా బయోఫ్యూయల్స్‌ను ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ వాహనం అభివృద్ధి చేయబడింది.
ఈ కీలక విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మే 23న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మారుతి సుజుకి ఒక E100-అనుకూల ప్యాసింజర్ వాహనాన్ని ఆవిష్కరించబోతోందని ఆయన ప్రకటించారు. దీంతో దేశ ఆటోమొబైల్ రంగం దృష్టి మొత్తం ఈ లాంచ్‌పైనే కేంద్రీకృతమైంది.

అయితే ఈ వాహనం ఏ మోడల్ అనే విషయాన్ని మారుతి సుజుకి ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ పరిశ్రమ వర్గాల్లో రెండు మోడళ్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటి మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ Flex Fuel కాగా, మరొకటి మారుతి ఫ్రాంక్స్ Flex Fuel. వాస్తవానికి వాగన్ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్రోటోటైప్‌ను 2024లో జరిగిన Bharat Mobility Global Expo 2024లో మారుతి సుజుకి తొలిసారిగా ప్రజల ముందుకు తీసుకొచ్చింది.
E20 నుంచి E85 వరకు వివిధ ఇథనాల్ మిశ్రమాలపై పనిచేసే సామర్థ్యంతో ఈ కారు అప్పుడే చర్చనీయాంశమైంది. మరోవైపు, సుజుకి 2025లో జరిగిన Japan Mobility Show 2025లో ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్‌ను ప్రదర్శించింది. ఇప్పుడు ఈ రెండు మోడళ్లలో ఏదో ఒకటి E100 సామర్థ్యంతో భారత మార్కెట్లోకి రావచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, దేశంలో ఇథనాల్ ఆధారిత మొబిలిటీకి ఇది ఒక పెద్ద మైలురాయిగా నిలవనుంది.

పెట్రోల్ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, రైతులకు చెరకు ఆధారిత ఇథనాల్ పరిశ్రమ ద్వారా అదనపు ఆదాయం కల్పించడం, అలాగే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలకు ఈ వాహనం దోహదపడే అవకాశం ఉంది. దీంతో మారుతి సుజుకి తీసుకురాబోతున్న ఈ కొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు భారత ఆటో రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలకనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications