హైబ్రిడ్, ఈవీ, సిఎన్‌జీ ఇలా ఒక్కొక్కటి కాదు ఒకేసారి 7 SUVలను దింపుతున్న మారుతి సుజుకీ
భారతదేశ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఆటోమొబైల్ రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా రాబోయే మూడేళ్లలో ఏకంగా 9 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో అత్యంత విశేషం ఏంటంటే.. ఈ 9 మోడళ్లలో 7 కేవలం ఎస్‌యూవీ (SUV) కార్లే ఉండబోతున్నాయి. సాంప్రదాయ పెట్రోల్ (ICE) ఇంజన్లతో పాటు ఎలక్ట్రిక్ (EV), హైబ్రిడ్, సిఎన్‌జీ వేరియంట్లలో ఈ అప్‌కమింగ్ ఎస్‌యూవీలను మారుతి డిజైన్ చేస్తోంది.
కొత్త ఇంజన్‌తో మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్
మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ బ్రెజ్జా (Brezza)ను సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధం చేస్తోంది. ఈ అప్‌డేటెడ్ మోడల్‌లో సరికొత్త డిజైన్ ఉన్న బంపర్, సరికొత్త ఫాగ్ లాంప్ హౌసింగ్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ కనిపించనున్నాయి. ప్రస్తుతం బ్రెజ్జా కారు 1.5 లీటర్ పెట్రోల్, సిఎన్‌జీ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుండగా.. రాబోయే కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఫ్రాంక్స్ కారులో ఉపయోగించే 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా ఆఫర్ చేయనున్నారు. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది.

పండుగ సీజన్లో గ్రాండ్ విటారా అప్‌డేట్స్
మారుతి సుజుకి 2022లో లాంచ్ చేసిన గ్రాండ్ విటారా ఎస్‌యూవీకి ఇప్పుడు మిడ్-సైకిల్ అప్‌డేట్ రాబోతోంది. రాబోయే పండుగ సీజన్ (Festive Season) నాటికి ఈ ఫేస్‌లిఫ్ట్ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఫ్రంట్ గ్రిల్ మార్పులు, కొత్త బంపర్లు, సరికొత్త లైటింగ్ సిస్టమ్ ఉండబోతున్నాయి. అంతేకాకుండా కారు లోపల 10.1 ఇంచుల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అధునాతన సేఫ్టీ ఫీచర్ అయిన లెవెల్ 2 ADASను కూడా జోడించనున్నారు.
ఫ్యామిలీ కస్టమర్ల కోసం గ్రాండ్ విటారా 7-సీటర్
గ్రాండ్ విటారా ప్లాట్‌ఫారమ్‌ను బేస్ చేసుకుని మారుతి సుజుకి ఒక సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీని కూడా డెవలప్ చేస్తోంది. పెద్ద ఫ్యామిలీల కోసం వస్తున్న ఈ కారులో వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఎన్నో లగ్జరీ ఫీచర్లు ఉండబోతున్నాయి. ఇది కూడా లెవెల్ 2 ADAS సేఫ్టీతో పాటు మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లలో లభించనుంది. ఈ కారు కూడా ఈ ఏడాది పండుగ సీజన్ లోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

టాటా పంచ్‌కు పోటీగా మారుతి Y43 మైక్రో ఎస్‌యూవీ
భారత మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ కార్లకు చెక్ పెట్టేందుకు మారుతి సుజుకి ఒక సరికొత్త మైక్రో ఎస్‌యూవీపై పనిచేస్తోంది. దీనికి కంపెనీ అంతర్గతంగా Y43 అనే కోడ్‌నేమ్ పెట్టింది. గతంలో నిలిపివేసిన ఇగ్నిస్ (Ignis) కారుకు సక్సెసర్‌గా రాబోతున్న ఈ కారును నెక్సా (NEXA) షోరూమ్‌ల ద్వారా విక్రయించనున్నారు.
ఇందులో 1.2 లీటర్, త్రీ-సిలిండర్ Z12E పెట్రోల్ ఇంజన్‌తో పాటు సిఎన్‌జీ, అలాగే భవిష్యత్తులో దీని ఎలక్ట్రిక్ (EV) వెర్షన్‌ను కూడా తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో లాంచ్ కావచ్చు.

35 కిమీ మైలేజ్ ఇచ్చే ఫ్రాంక్స్ సిరీస్ హైబ్రిడ్
మారుతి సుజుకి త్వరలోనే ఫ్రాంక్స్ (Fronx) ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కూడా తీసుకురానుంది. ఇందులో డిజైన్ మార్పులతో పాటు అత్యంత పొదుపైన సిరీస్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ టెక్నాలజీని వాడుతున్నారు. ఈ సెటప్‌లో కారు చక్రాలు ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా నడుస్తాయి.
కారులోని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కేవలం బ్యాటరీని రీఛార్జ్ చేయడానికి ఒక జనరేటర్‌లా మాత్రమే పనిచేస్తుంది. ఈ సరికొత్త టెక్నాలజీ వల్ల ఈ కారు ఏకంగా లీటర్ పెట్రోల్‌కు 35 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెప్తోంది. దీనితో పాటు ఇథనాల్ ఇంధనంతో నడిచే ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్‌ను కూడా మారుతి సిద్ధం చేస్తోంది.


Click it and Unblock the Notifications