దేశంలో కొత్త చరిత్ర సృష్టించిన కారు.. రూ.7.24 లక్షలకే వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్
భారత ఆటోమొబైల్ రంగంలో ఇథనాల్ ఆధారిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా దేశీయ దిగ్గజ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మరో కీలక అడుగు వేసింది. కంపెనీ తాజాగా తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (Wagon R Flex Fuel) కారు ధరలను అధికారికంగా ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో ఈ మోడల్‌ను ప్రజలకు పరిచయం చేసినప్పటికీ, అప్పట్లో ధరను వెల్లడించలేదు. ఇప్పుడు కంపెనీ ఈ కారు ప్రారంభ ధరను రూ.7.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో మారుతి సుజుకి తీసుకొచ్చిన వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ భారత మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది దేశంలోనే E20 నుంచి E85 వరకు ఇథనాల్-పెట్రోల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించగల తొలి మాస్-మార్కెట్ కారు. అంటే వినియోగదారులు అందుబాటులో ఉన్న ఇథనాల్ శాతాన్ని బట్టి వివిధ రకాల ఇంధన మిశ్రమాలను ఉపయోగించుకోవచ్చు. ఇది దేశంలో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారుగా నిలిచింది.

ప్రస్తుతం మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌ను సాధారణ వినియోగదారుల కోసం కాకుండా వాణిజ్య అవసరాల కోసం మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే భవిష్యత్తులో ఈ మోడల్‌ను సామాన్య కొనుగోలుదారులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీపై ప్రజల్లో అవగాహన పెరగడం, ఇథనాల్ మౌలిక సదుపాయాలు విస్తరించడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని దీనిని మరింత విస్తృతంగా విక్రయించే అవకాశం ఉంది.
ఈ మోడల్ వ్యాగన్ ఆర్ టాప్-ఎండ్ ZXi+ వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 90 bhp పవర్‌తో పాటు 113.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో పనిచేసేలా ప్రత్యేకంగా ట్యూన్ చేసిన ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ప్రస్తుతం ఈ మోడల్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో లేదు.

అదేవిధంగా, కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగన్ ఆర్‌ను పలు రంగుల్లో అందిస్తున్నారు. మెటాలిక్, నాన్-మెటాలిక్ కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో వినియోగదారులు తమకు నచ్చిన రంగును ఎంచుకునే అవకాశం ఉంటుంది. సంప్రదాయ వ్యాగన్ ఆర్‌కు ఉన్న విశ్వసనీయతతో పాటు భవిష్యత్ ఇంధన సాంకేతికతను కలిపి తీసుకొచ్చిన ఈ మోడల్, భారతదేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల విస్తరణకు మార్గం సుగమం చేయనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
దీనిలో డ్యూయల్-టోన్ ఇంటీరియర్, ఫ్యాబ్రిక్ సీట్లు, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ వల్ల ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గే అవకాశం ఉంది. అలాగే దేశీయ ఇథనాల్ వినియోగం పెరగడం ద్వారా రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది.


Click it and Unblock the Notifications