ప్రతి నెలా వేల మంది ఇదే కారును కొంటున్నారు.. ఈ కారు మీద జనాలకు క్రేజ్ మామూలుగా లేదు!
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki) తయారు చేసిన విక్టోరిస్ (Victoris) క్రమంగా వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదిస్తూ అత్యంత ప్రజాదరణ పొందుతున్న మోడల్‌గా మారుతోంది. ప్రారంభంలోనే ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, విశ్వసనీయ పనితీరు కారణంగా ఈ కారు మార్కెట్‌లో మంచి స్పందన పొందింది. కాలక్రమేణా ఈ SUVపై డిమాండ్ మరింత పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా యువత, కుటుంబ వినియోగదారులు, మొదటిసారి SUV కొనుగోలు చేయాలనుకునే వారు ఈ కారును ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇటీవల విడుదలైన విక్రయ గణాంకాలు కూడా ఈ కారు పెరుగుతున్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి.
2026 ఫిబ్రవరి నెలలో భారీ డిమాండ్ కనిపించింది. ఆ నెలలో మొత్తం 13,021 యూనిట్లు కొనుగోలుదారులకు పంపిణీ చేయబడ్డాయి. ఈ సంఖ్యను రోజువారీగా లెక్కిస్తే, సగటున ప్రతి రోజు 465 కార్లు విక్రయమైనట్లుగా తెలుస్తోంది. ఒకే మోడల్‌కు ఇంత స్థాయిలో రోజువారీ అమ్మకాలు నమోదు కావడం ఆ కారుపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది. అయితే ఫిబ్రవరి నెలతో పోలిస్తే, 2026 జనవరిలో ఈ SUVకు ఇంకా ఎక్కువ డిమాండ్ కనిపించింది.

ఆ నెలలో మొత్తం 15,240 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే సంవత్సర ప్రారంభంలోనే ఈ కారు భారీ విక్రయాలతో ఆటోమొబైల్ మార్కెట్‌లో మంచి ఊపును సృష్టించింది. జనవరి, ఫిబ్రవరి నెల పరిశీలిస్తే, ఈ మోడల్ స్థిరంగా మంచి అమ్మకాలు నమోదు చేస్తూ ముందుకు సాగుతుంది. డిజైన్ పరంగా ఆకర్షణీయంగా, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు ఉండటం, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు అంశాలు ఈ కారును వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.
ఈ SUVను కంపెనీ 2025 సెప్టెంబర్ 16న అధికారికంగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. విడుదలైన మొదటి నెల నుంచే మంచి స్పందన కనిపించింది. సెప్టెంబర్ నెలలో మొత్తం 4,261 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ తరువాత అక్టోబర్‌లో అమ్మకాలు మరింత వేగం పుంజుకుని 13,496 యూనిట్లు విక్రయమయ్యాయి. నవంబర్ నెలలో కూడా వినియోగదారుల ఆసక్తి కొనసాగుతూ 12,300 యూనిట్లు కొనుగోలుదారులకు చేరాయి.

డిసెంబర్ నెలలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ 6,210 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలు చూస్తే, విడుదలైన కొద్ది కాలంలోనే ఈ SUV మార్కెట్‌లో మంచి ఆదరణ పొందినట్లు తెలుస్తోంది. ధర పరంగా కూడా విక్టోరిస్ SUV ధర రూ. 10.50 లక్షల నుండి రూ. 19.99 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే కాకుండా ప్రీమియం SUV కొనాలనుకునే వినియోగదారులు కూడా సులభంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
ఈ SUVలో కంపెనీ శక్తివంతమైన మూడు సిలిండర్ల పవర్‌ట్రెయిన్ ఎంపికలను అందిస్తోంది. ప్రధానంగా 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో ఇది పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద సుమారు 101.65 bhp శక్తిని ఉత్పత్తి చేయగా, 4,300 rpm వద్ద 139 Nm పీక్ టార్క్ అందిస్తుంది. దీంతో నగర రోడ్లపై మాత్రమే కాకుండా హైవేలపై కూడా ఈ SUV మంచి పనితీరును ప్రదర్శిస్తుంది.

ఇంకా మెరుగైన ఇంధన సామర్థ్యం కంపెనీ 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) ఇంజిన్ ఎంపికను కూడా అందిస్తోంది. ఈ ఇంజిన్ 5,500 rpm వద్ద 91 bhp హార్స్‌పవర్ ఉత్పత్తి చేయగలదు. 1.5-లీటర్ CNG ఇంజిన్ ఎంపికను కూడా అందుబాటులో ఉంచారు. ఈ ఇంజిన్ 5,500 rpm వద్ద 87.8 bhp శక్తిని, 4,200 rpm వద్ద 121 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.
ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, ఈ SUV వేరియంట్‌ను బట్టి 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, e-CVT గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తుంది. ఇంధన సామర్థ్యం కూడా ఈ కారుకు ఒక ప్రధాన ఆకర్షణగా చెప్పాలి. వేరియంట్, ఇంజిన్ ఎంపికను బట్టి ఈ SUV 21.06 kmpl నుండి 28.65 kmpl వరకు మైలేజీ అందించగలదు.


Click it and Unblock the Notifications








