బైక్ ఇచ్చే మైలేజ్ ఇచ్చినా ఈ 5 కార్ల ముఖం చూడని జనం..తలలు పట్టుకుంటున్న షోరూం ఓనర్లు
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki) అంటే ఒక తిరుగులేని బ్రాండ్. మధ్యతరగతి ప్రజల నాడి తెలిసిన సంస్థగా, తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను అందించడంలో మారుతికి సాటిలేదు. అయితే, మారుతి సుజుకి అమ్మే ప్రతి కారు హాట్ కేకులా అమ్ముడవుతుందని అనుకుంటే పొరపాటే.
తాజా గణాంకాల ప్రకారం (జనవరి 2026).. మారుతి సుజుకి విక్రయిస్తున్న 17 మోడళ్లలో 5 కార్ల పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు 35 కి.మీ వరకు మైలేజ్ ఇచ్చే సత్తా ఉన్నప్పటికీ, జనం వీటిని కొనడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. మరి ఆ ఫ్లాప్ కార్లు ఏవో, వాటి కథాకమీమామిషు ఏంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మైలేజ్ ఉన్నా జనం ఎందుకు కొనడం లేదు?
మారుతి సుజుకి తన కార్లను ఎరీనా(Arena), నెక్సా (Nexa) అనే రెండు రకాల షోరూమ్‌ల ద్వారా విక్రయిస్తుంది. ఎరీనాలో బడ్జెట్ కార్లు, నెక్సాలో ప్రీమియం కార్లు లభిస్తాయి. అయితే జనవరి 2026 అమ్మకాల నివేదిక చూస్తే, కొన్ని కార్లు కనీసం 2,000 మార్కును కూడా దాటలేకపోయాయి. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి:

1. మారుతి ఎస్-ప్రెస్సో (S-Presso)
ఎస్-ప్రెస్సో కారును మారుతి ఒక మినీ ఎస్‌యూవీగా ప్రచారం చేసింది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది పెట్రోల్‌పై 24 కి.మీ, సిఎన్‌జీపై 32.73 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ధర కూడా రూ.3.70 లక్షల నుంచే ప్రారంభమవుతుంది. ఇంత తక్కువ ధర, భారీ మైలేజ్ ఉన్నా జనవరిలో కేవలం 1,954 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీని లుక్స్ కస్టమర్లను అంతగా ఆకట్టుకోలేకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.
2. మారుతి ఇగ్నిస్ (Ignis)
నెక్సా షోరూమ్‌లలో లభించే అత్యంత చౌకైన కారు ఇగ్నిస్. దీని డిజైన్ చాలా వెరైటీగా ఉంటుంది. 1.2 లీటర్ ఇంజిన్‌తో 20.89 కి.మీ మైలేజ్ ఇస్తుంది. కానీ, ఇది గత నెలలో కేవలం 1,902 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. టాటా టియాగో వంటి కార్ల నుంచి వస్తున్న గట్టి పోటీని ఇగ్నిస్ తట్టుకోలేకపోతోంది.

3. మారుతి సెలీరియో (Celerio)
మారుతి సెలీరియో నిజంగా మైలేజ్ కింగ్. సిఎన్‌జీ వేరియంట్ అయితే లీటరుకు ఏకంగా 34.43 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఒక బైక్ ఇచ్చే మైలేజ్ ఇది. ధర రూ. 4.69 లక్షల నుంచి మొదలవుతుంది. కానీ అమ్మకాలు మాత్రం కేవలం 1,501 వద్దే ఆగిపోయాయి. వాగన్ఆర్ ఉండగా సెలీరియో ఎందుకు అనే భావన కస్టమర్లలో బలంగా నాటుకుపోవడమే దీనికి మైనస్.
4. మారుతి జిమ్నీ (Jimny)
ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం తీసుకొచ్చిన జిమ్నీ పరిస్థితి మరీ దారుణం. రూ.12.31 లక్షల ధర ఉన్న ఈ కారు కేవలం 591 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. మహీంద్రా థార్ (Thar) నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడంలో జిమ్నీ పూర్తిగా విఫలమైంది. పవర్ తక్కువగా ఉండటం, సైజ్ చిన్నదిగా అనిపించడం జిమ్నీ కొంపముంచాయి.

5. మారుతి ఇన్విక్టో (Invicto)
ఇది మారుతి అమ్ముతున్న అత్యంత ఖరీదైన కారు. టయోటా ఇన్నోవా హైక్రాస్‌కు రీబ్యాడ్జ్ వెర్షన్ ఇది. రూ.24.97 లక్షల నుంచి రూ.28.61 లక్షల వరకు ధర ఉంటుంది. హైబ్రిడ్ టెక్నాలజీతో 23.24 కి.మీ మైలేజ్ ఇస్తున్నా, జనం మారుతి బ్రాండ్ పేరుతో రూ. 25 లక్షలు పెట్టడానికి సిద్ధంగా లేరు. జనవరిలో కేవలం 197 ఇన్విక్టో కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
మారుతి సుజుకి ఎన్ని కొత్త మోడల్స్ తెచ్చినా, కస్టమర్లు మాత్రం స్విఫ్ట్, డిజైర్, వాగన్ఆర్ వంటి పాత బ్రాండ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మైలేజ్ ఒక్కటే ఉంటే సరిపోదు, కారుకు రోడ్ ప్రెజెన్స్, సరైన ధర కూడా ఉండాలని ఈ అమ్మకాల లెక్కలు నిరూపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








