సింగిల్ ఛార్జ్‌తో 926 కిమీ..ఒక్కసారి ఛార్జింగ్ పెడితే వారమంతా నో టెన్షన్.. ఈ కారును మించింది లేదు
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz) ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. తన పాపులర్ ఎలక్ట్రిక్ సెడాన్ ఈక్యూఎస్ (EQS)ను సరికొత్త హంగులతో, అదిరిపోయే రేంజ్‌తో అప్‌డేట్ చేసి ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 926 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రూపొందించారు. గాలి వేగంతో దూసుకెళ్లడమే కాకుండా, విలాసవంతమైన ఇంటీరియర్, అత్యాధునిక సాంకేతికతతో ఈ కారు ఎలక్ట్రిక్ వాహన ప్రపంచంలో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తోంది.
మెర్సిడెస్ బెంజ్ విడుదల చేసిన ఈ అప్‌డేటెడ్ ఈక్యూఎస్ (EQS) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన ప్రియుల హాట్ టాపిక్‌గా మారింది. కంపెనీ ఇందులో 800V అనే సరికొత్త ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల కారు బ్యాటరీ ఎఫిషియెన్సీ పెరగడమే కాకుండా, రేంజ్ కూడా మునుపటి కంటే సుమారు 13 శాతం మెరుగుపడింది. ముఖ్యంగా ఈక్యూఎస్ 450+ మోడల్ ఇప్పుడు డబ్ల్యూఎల్టీపీ (WLTP) నిబంధనల ప్రకారం గరిష్టంగా 926 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తోంది. అంటే మన దేశంలో అందుబాటులో ఉన్న అత్యంత పొడవైన రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ సెడాన్లలో ఇది అగ్రస్థానంలో నిలుస్తుంది.

బ్యాటరీ సామర్థ్యాన్ని గమనిస్తే, ఇందులో 122kWh వరకు ఉండే భారీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. కేవలం రేంజ్ మాత్రమే కాకుండా, ఛార్జింగ్ విషయంలో కూడా ఈ కారు రికార్డులు సృష్టిస్తోంది. ఈ కారు 350kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల మీరు కేవలం 10 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే చాలు, ఏకంగా 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అంతేకాకుండా, ఈ కారు వి-టు-హెచ్ (V2H), వి-టు-జి (V2G) వంటి బైడైరెక్షనల్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. అంటే మీ కారు బ్యాటరీలోని పవర్‌తో అత్యవసర సమయాల్లో మీ ఇంటికి లేదా గ్రిడ్‌కు విద్యుత్తును సరఫరా చేయవచ్చు.
సాంకేతికపరంగా ఈ కారులో అనేక మార్పులు చేశారు. వెనుక యాక్సిల్ వద్ద టూ-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది కారు వేగంగా ఊపందుకోవడానికి ఒక గేర్, హై-స్పీడ్ వద్ద బ్యాటరీని ఆదా చేయడానికి మరో గేర్‌ను వాడుకుంటుంది. రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా 33 శాతం వరకు మెరుగుపరిచారు. ఇక ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్ గురించి చెప్పాలంటే, ఇది క్లౌడ్ ఆధారిత సమాచారంతో పనిచేస్తూ రోడ్డుపై ఎక్కడ గుంతలున్నా ముందే పసిగట్టి కారు లోపల కూర్చున్న వారికి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్‌ను స్మూత్‌గా మారుస్తుంది.

డిజైన్ విషయానికి వస్తే, మెర్సిడెస్ తన ఐకానిక్ కౌపే స్టైల్‌ను అలాగే ఉంచింది. అయితే ఫ్రంట్ గ్రిల్‌లో రీడిజైన్ చేసిన 'బ్యాక్‌లిట్ స్టార్ ప్యాటర్న్' మరియు ఇల్యూమినేటెడ్ మెర్సిడెస్ స్టార్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీని డిజిటల్ లైట్ హెడ్‌లైట్లు చీకట్లో ఏకంగా 600 మీటర్ల దూరం వరకు వెలుగును ప్రసరిస్తాయి. కారు లోపల మూడు స్క్రీన్లు కలిసిన ఒకే గ్లాస్ ప్యానల్ కింద MBUX హైపర్‌స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇది ఏఐ (AI) ఆధారిత వర్చువల్ అసిస్టెంట్‌తో పనిచేస్తుంది. 2026 రెండో భాగం నాటికి ఈ కారు యూరప్, అమెరికా మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. మన దేశంలోకి ఇది వచ్చే ఏడాది ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ధర కోట్లలో ఉన్నా, ఈ కారు ఇచ్చే లగ్జరీ, రేంజ్ మరే ఇతర కారులోనూ లభించదని ఆటో ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








