E20 పెట్రోల్‌తో నిజంగానే మైలేజ్ 17 నుంచి 5కి పడిపోతుందా? మెర్సిడెస్ ఇచ్చిన క్లారిటీ ఇదే
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ యూట్యూబర్ సౌరవ్ జోషి చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీసింది. తన లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz) ఎస్‌యూవీ మైలేజ్ కేవలం రెండు రోజుల్లోనే ఊహించని విధంగా ఘోరంగా పడిపోయిందని ఆయన ఒక వీడియో ద్వారా ఆరోపించారు.
సాధారణంగా 17 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే తన కారు, ప్రస్తుతం లీటరుకు కేవలం 5 కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే ఇస్తోందని స్క్రీన్ చూపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెట్రోల్ బంకుల్లో లభిస్తున్న E20 పెట్రోల్ వల్లే తన కారు ఇంజన్ మైలేజ్ దెబ్బతిందని ఆయన ఆరోపించడంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

స్థానిక పెట్రోల్ బంకుల్లో లభించే ఫ్యూయెల్ క్వాలిటీ లోపం వల్లే తన లగ్జరీ పెట్రోల్ ఇంజన్‌కు నష్టం వాటిల్లుతోందని ఆయన భయపడ్డారు. ఈ మైలేజ్ సమస్య, ఇంజన్ పాడైపోతుందనే భయంతోనే తాను ఇప్పుడు తన పెట్రోల్ కారును పక్కనబెట్టి, ఎలక్ట్రిక్ మెర్సిడెస్ జీ-వాగన్ (G-Wagon) నడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వ్లాగర్ వెల్లడించారు.

యూట్యూబర్ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన హంగామా సృష్టించడంతో జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా వెంటనే రంగంలోకి దిగింది. తమ కస్టమర్ల అనుమానాలను నివృత్తి చేయడానికి కంపెనీ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
ఈ ప్రకటనలో సౌరవ్ జోషి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ.. "మాకు వినియోగదారుల భద్రత, వాహనంపై నమ్మకం, వాటి పర్ఫార్మెన్స్ అత్యంత ముఖ్యం. భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ విక్రయిస్తున్న అన్ని పెట్రోల్ BS-VI వాహనాలు E20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా ఉండేలా మెటీరియల్ పరంగా డిజైన్ చేయబడ్డాయి" అని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని సంబంధిత ప్రభుత్వ అధికారులు సైతం ధృవీకరిస్తూ సర్టిఫికేట్ ఇచ్చారని, కస్టమర్లకు ఎలాంటి టెక్నికల్ సందేహాలున్నా నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా E20 పెట్రోల్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. E20 ఇంధనం అంటే 80 శాతం పెట్రోల్‌లో 20 శాతం ఎథనాల్‌ను మిక్స్ చేస్తారు. పాత వాహనాలు వాడుతున్న కొంతమంది ఓనర్లు ఈ బ్లెండెడ్ పెట్రోల్ వల్ల పాత ఇంజన్లు పాడవుతున్నాయని, మైలేజ్ తగ్గుతోందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్‌ను గట్టిగా సమర్థిస్తోంది.
ఎథనాల్ మిక్సింగ్ వల్ల దేశీయ చక్కెర పరిశ్రమ బలోపేతం కావడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా, 2014-15 సంవత్సరం నుండి ఇప్పటివరకు ఈ విధానం ద్వారా దేశానికి దాదాపు రూ. 1.90 లక్షల కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం (Foreign Exchange) ఆదా అయిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ వివాదంపై ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు విభిన్నమైన విశ్లేషణను అందిస్తున్నారు. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఎథనాల్‌లో ఎనర్జీ కంటెంట్ కాస్త తక్కువగా ఉంటుంది, కాబట్టి మైలేజీలో స్వల్పంగా (దాదాపు 5 నుంచి 8 శాతం) తగ్గుదల కనిపించడం సహజమేనని వారు అంగీకరిస్తున్నారు. అయితే, మెర్సిడెస్ బెంజ్ లాంటి అత్యంత ఆధునిక సాంకేతికత కలిగిన లగ్జరీ కార్లలో మైలేజ్ ఒక్కసారిగా 17 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లకు పడిపోవడం అనేది కేవలం ఇంధనం మారడం వల్ల మాత్రమే జరగదని తేల్చి చెప్పారు.
కారు నడిపే విధానం (డ్రైవింగ్ స్టైల్), విపరీతమైన ట్రాఫిక్ జామ్స్ లేదా వాహనంలో ఏదైనా ఇతర తీవ్రమైన సాంకేతిక లోపం ఉండటం వల్లే మైలేజ్ అంతలా తగ్గి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మెర్సిడెస్ అధికారిక క్లారిటీ ఇవ్వడంతో లగ్జరీ కార్ల యజమానులు ఊపిరి పీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications