రూ.75 లక్షలైనా జనాలు ఆగట్లేదు..6 నెలల్లోనే ఇండియాలో నంబర్ 1 స్పోర్ట్స్ కార్‌గా MG సైబర్‌స్టర్
భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. అయితే కేవలం ఫ్యామిలీ కార్లు, ఎస్‌యూవీలే కాదు.. ఇప్పుడు స్పోర్ట్స్ కార్లలో కూడా ఈవీలు దుమ్మురేపుతున్నాయి. జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) తీసుకొచ్చిన సైబర్‌స్టర్ (Cyberster) ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ మోడల్‌గా అవతరించింది. అదిరిపోయే లుక్స్, మెరుపు వేగంతో దూసుకెళ్లే ఈ కారు.. ఇండియాలోని ధనవంతులను, స్పోర్ట్స్ కార్ ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది.
2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రదర్శితమైన ఎంజీ సైబర్‌స్టర్, మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. నవంబర్ 30, 2025 నాటికి అందిన గణాంకాల ప్రకారం, కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఎంజీ సంస్థ ఏకంగా 350 సైబర్‌స్టర్ ఈవీలను విక్రయించింది.

సాధారణంగా లగ్జరీ స్పోర్ట్స్ కార్ల విభాగంలో ఇన్ని కార్లు అమ్ముడవ్వడం ఒక పెద్ద రికార్డుగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కారు కోసం కొన్ని నగరాల్లో 4 నుండి 5 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉందంటేనే దీని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. విదేశీ స్పోర్ట్స్ కార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా దీని డిజైన్ ఉంటుంది. పొడవైన బోనెట్, గ్రౌండ్ లెవల్‌కు దగ్గరగా ఉండే బాడీ, వెడల్పాటి వెనుక భాగం దీనికి క్లాసిక్ రోడ్‌స్టర్ లుక్‌ను ఇస్తాయి.
అయితే ఈ కారులో హైలైట్ ఏంటంటే.. పైకి తెరుచుకునే సిజర్ డోర్లు (Scissor Doors). ఇవి ఎలక్ట్రికల్ బటన్ ద్వారా పనిచేస్తాయి. అలాగే అవసరాన్ని బట్టి పైకప్పును కూడా (Soft-top roof) ఓపెన్ చేసుకునే కన్వర్టబుల్ ఫీచర్ ఇందులో ఉండటం మరో విశేషం. స్లిమ్ ఎల్‌ఈడీ హెడ్ లాంప్స్, భారీ అల్లాయ్ వీల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

కేవలం లుక్ మాత్రమే కాదు, వేగంలో కూడా సైబర్‌స్టర్ ఒక రేసింగ్ కారులా దూసుకుపోతుంది. ఇందులోని డ్యూయల్ మోటార్ సిస్టమ్ ఏకంగా 510 PS పవర్ మరియు 725 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3.2 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 580 కిలోమీటర్ల వరకు రేంజ్ (MIDC) ఇస్తుంది.
అంటే దీనిని కేవలం వీకెండ్ సరదాలకే కాకుండా, రోజువారీ అవసరాలకు కూడా హాయిగా వాడుకోవచ్చు. ఇంటీరియర్ విషయానికొస్తే.. డ్రైవర్ ఫోకస్డ్ క్యాబిన్, మల్టీ స్క్రీన్ లేఅవుట్ మరియు అత్యంత సౌకర్యవంతమైన సీట్లు దీని సొంతం. భారత మార్కెట్లో ఎంజీ సైబర్‌స్టర్ ధర రూ. 74.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే లాంచ్ ఆఫర్‌లో భాగంగా ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి రూ. 72.99 లక్షలకే ఈ కారును అందించారు.

ఎంజీ సంస్థ తన ప్రీమియం డీలర్‌షిప్‌లైన ఎంజీ సెలక్ట్(MG Select) ద్వారా ఈ కార్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 ప్రధాన నగరాల్లో ఈ డీలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. స్పోర్ట్స్ కార్లపై భారతీయులకు పెరుగుతున్న ఆసక్తికి, ఎలక్ట్రిక్ వాహనాల పట్ల మారుతున్న దృక్పథానికి ఎంజీ సైబర్‌స్టర్ విజయమే నిదర్శనం.


Click it and Unblock the Notifications