ఈ కారు అంటేనే జంకుతున్న జనం.. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఉత్పత్తినే ఆపేసిన కంపెనీ
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఫుల్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ అంటేనే ఒక ప్రత్యేకమైన క్రేజ్. ఒకప్పుడు ఫోర్డ్ ఎండీవర్ ఈ విభాగంలో రారాజుగా వెలుగొందేది. ఎండీవర్ నిష్క్రమణ తర్వాత ఆ ఖాళీని భర్తీ చేసేందుకు, టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎంజీ మోటార్స్ గ్లోస్టర్‌ను ఎంతో ఆశతో ప్రవేశపెట్టింది. అద్భుతమైన ఫీచర్లు, అదిరిపోయే రోడ్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు గ్లోస్టర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఎంజీ గ్లోస్టర్ ప్రస్థానం ముగియనుంది. గత రెండు నెలలుగా ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోకపోవడంతో, ఈ మోడల్‌ను పూర్తిగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది.
గ్లోస్టర్ వైఫల్యానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేరళకు చెందిన ఒక ప్రముఖ వ్లాగర్‌తో తలెత్తిన వివాదం ఈ కారు బ్రాండ్ ఇమేజ్‌ను బాగా దెబ్బతీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫార్చ్యూనర్ కంటే ఎక్కువ ఫీచర్లు, మెరుగైన కంఫర్ట్ ఉన్నప్పటికీ, భారతీయ వినియోగదారుల మనసు గెలవడంలో గ్లోస్టర్ వెనుకబడింది. గతేడాది విక్రయాలను పరిశీలిస్తే.. 2025 ఫిబ్రవరిలో 102 యూనిట్లు, మార్చిలో 100 యూనిట్లు అమ్ముడవగా, ఏప్రిల్ నుంచి పరిస్థితి దారుణంగా తయారైంది. మే నెలలో సున్నా అమ్మకాలు నమోదు కాగా, ఆ తర్వాత నెలల్లో కూడా రెండంకెల సంఖ్యకే పరిమితమైంది. చివరికి డిసెంబర్ 2025, జనవరి 2026 నెలల్లో ఒక్క కారు కూడా అమ్ముడుపోకపోవడం గ్లోస్టర్ పతనానికి నిదర్శనంగా నిలిచింది.

అయితే గ్లోస్టర్ అభిమానుల కోసం ఎంజీ మోటార్స్ ఒక శుభవార్త కూడా తెచ్చింది. గ్లోస్టర్ స్థానాన్ని భర్తీ చేస్తూ దాని కంటే భారీగా, మరింత శక్తివంతంగా ఉండే మెజెస్టర్ ఎస్‌యూవీని కంపెనీ రంగంలోకి దించుతోంది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో తొలిసారిగా పరిచయమైన ఈ మెజెస్టర్, ఇప్పుడు ప్రీ-బుకింగ్ దశకు చేరుకుంది. మజస్టర్ కేవలం గ్లోస్టర్ వారసుడు మాత్రమే కాదు, ఇది ప్రతి విషయంలోనూ ఒక పెద్ద అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు. మ్యాక్సస్ D90 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందిన ఈ కారు 5,046 మి.మీ పొడవు, 2,016 మి.మీ వెడల్పుతో రోడ్డుపై ఒక భారీ ఏనుగులా కనిపిస్తుంది. దీని వీల్ బేస్ 2,950 మి.మీ ఉండటం వల్ల లోపల స్థలం చాలా ధారాళంగా ఉంటుంది.
టెక్నికల్ పరంగా చూస్తే మెజెస్టర్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇందులో 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 213 bhp శక్తిని, 478 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 4x4 సిస్టమ్ కలయికతో ఇది ఎంతటి కఠినమైన దారిలోనైనా సులభంగా దూసుకుపోతుంది. షార్ప్ 4x2, సావీ 4x2, సావీ 4x4 అనే మూడు వేరియంట్లలో ఇది లభించనుంది. అలాగే కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్టుగా 6-సీటర్ లేదా 7-సీటర్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. దీని ఆఫ్-రోడ్ సామర్థ్యం ఫార్చ్యూనర్‌కు నిద్ర లేకుండా చేసేలా ఉంటుందని కంపెనీ ధీమాగా ఉంది.

ఫీచర్ల విషయంలో మెజెస్టర్ ఒక లగ్జరీ హోటల్‌ను తలపిస్తుంది. పనోరమిక్ సన్ రూఫ్, లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), 12.3 ఇంచుల టచ్ స్క్రీన్, జేబీఎల్ 12-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ముందు సీట్లలో మసాజ్ ఫంక్షన్, వెంటిలేషన్ సౌకర్యం ఉండటం ప్రయాణికులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. 64 కలర్ యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, 10 రకాల ఆఫ్-రోడ్ మోడ్స్ ఈ ఎస్‌యూవీని టెక్నాలజీ పరంగా టాప్‌లో నిలబెడుతున్నాయి. కేవలం రూ.41,000 టోకెన్ అమౌంట్‌తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం మెజెస్టర్ ధరలను కంపెనీ వెల్లడించలేదు కానీ, ఏప్రిల్ 2026లో ధరల ప్రకటన ఉంటుందని, మే నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. మొదటి 3,000 మంది కస్టమర్లకు 5 ఏళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీ, 5 ఏళ్ల రోడ్ సైడ్ అసిస్టెన్స్, లేబర్ ఫ్రీ సర్వీస్ వంటి ఆకర్షణీయమైన ఆఫర్లను ఎంజీ ప్రకటించింది. గ్లోస్టర్ విఫలమైనా, మెజెస్టర్ ద్వారా ఫుల్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన సత్తా చాటాలని ఎంజీ మోటార్స్ గట్టి పట్టుదలతో ఉంది. టయోటా ఫార్చ్యూనర్ ఏకచ్ఛత్రాధిపత్యానికి ఈ కొత్త మెజెస్టర్ ఎంతవరకు అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications








