ఫార్చ్యూనర్ హవాకు చెక్?.. ఎంజీ మెజెస్టర్‌లో ఇన్ని ఫీచర్లా అంటూ షాక్ అవుతున్న జనం!
భారతీయ రోడ్ల మీద రారాజుగా వెలుగొందుతున్న టయోటా ఫార్చ్యూనర్ (Fortuner)కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎంజీ మోటార్స్ (MG Motors) రెడీ అయింది. తన అమ్ములపొదిలోని సరికొత్త అస్త్రాన్ని ఎంజీ మెజెస్టర్ (MG Majestor) రూపంలో మార్కెట్లోకి వదులుతోంది. ముఖ్యంగా ఫార్చ్యూనర్‌లోని ప్రీమియం వెర్షన్ అయిన లెజెండర్ (Legender) టార్గెట్‌గా ఈ కారు రాబోతుంది. రానున్న కొద్ది వారాల్లోనే భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ టెక్నాలజీ హ్యావీ ఎస్‌యూవీలో ఏముంది? ఇది టయోటా లెజెండర్‌ను ఎలా ఢీకొట్టబోతోంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సైజులో మెజెస్టర్ దే పైచేయి!
కారు చూడగానే అందరినీ ఆకర్షించేది దాని సైజు. ఈ విషయంలో ఎంజీ మెజెస్టర్, లెజెండర్ కంటే ఒక మెట్టు పైనే ఉంది. మెజెస్టర్ పొడవు 5,046 మి.మీ, వెడల్పు 2,016 మి.మీ ఉంటుంది. దీనితో పోలిస్తే లెజెండర్ పొడవు 4,795 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ మాత్రమే. అంటే మెజెస్టర్ 251 మి.మీ ఎక్కువ పొడవు, 151 మి.మీ ఎక్కువ వెడల్పు కలిగి ఉంది. దీనివల్ల కారు లోపల సెకండ్ రో, థర్డ్ రో లో ప్రయాణికులకు లెగ్ రూమ్ చాలా విశాలంగా ఉంటుంది. మెజెస్టర్ వీల్‌బేస్ కూడా 205 మి.మీ ఎక్కువగా ఉండటం వల్ల లాంగ్ జర్నీలలో ప్రయాణం చాలా సుఖంగా ఉంటుంది.

రంగుల ప్రపంచం - ఛాయిస్ మీదే!
టయోటా లెజెండర్ కేవలం ఒకే ఒక్క కలర్ ఆప్షన్‌లో (ప్లాటినం వైట్ పెర్ల్ విత్ బ్లాక్ రూఫ్) లభిస్తుంది. కానీ ఎంజీ మెజెస్టర్ తన కస్టమర్ల కోసం మెటల్ బ్లాక్, పెర్ల్ వైట్, మెటల్ యాష్, కాంక్రీట్ గ్రే వంటి నాలుగు ఆకర్షణీయమైన రంగులను అందుబాటులోకి తెస్తోంది. వెరైటీ కోరుకునే వారికి మెజెస్టర్ మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు.
టెక్నాలజీ, ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే ఎంజీ ఎప్పుడూ ముందుంటుంది. మెజెస్టర్‌లో 12.3 అంగుళాల హెచ్‌డీ పోర్ట్రెయిట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 64 రంగుల యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, ముందు సీట్లకు మసాజ్ ఫంక్షన్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. లెజెండర్‌లో కేవలం 8 అంగుళాల టచ్‌స్క్రీన్, సింగిల్ వైర్‌లెస్ ఛార్జర్ వంటి బేసిక్ ఫీచర్లు మాత్రమే ఉన్నాయి. లెజెండర్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ లేకపోవడం ఒక పెద్ద లోటుగా కనిపిస్తోంది. మెజెస్టర్‌లో లెవల్ 2 ఏడీఏఎస్ (ADAS) సేఫ్టీ ఫీచర్లు ఉండటం వల్ల హైవేలపై ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది.

పవర్ వర్సెస్ టార్క్ - ఇంజిన్ లెక్కలు
ఇంజిన్ సామర్థ్యం విషయానికి వస్తే రెండూ పోటాపోటీగా ఉన్నాయి. మెజెస్టర్‌లో 2.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఉంది, ఇది 213 హెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక లెజెండర్‌లో 2.8 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ ఉంది, ఇది 201 హెచ్‌పి పవర్‌ను ఇస్తుంది. పవర్ విషయంలో ఎంజీ మెజెస్టర్ ముందున్నా, టార్క్ (Torque) విషయంలో మాత్రం టయోటా లెజెండర్ (500 Nm) కే పైచేయి ఉంది. దీనివల్ల భారీ లోడ్లను లాగడంలో లెజెండర్ కాస్త వేగంగా స్పందిస్తుంది.
ఆఫ్-రోడింగ్ లో కొత్త మ్యాజిక్!
సాధారణ రోడ్లపైనే కాకుండా గుట్టలు, రాళ్లపై ప్రయాణించడానికి మెజెస్టర్ లో ప్రత్యేకమైన హార్డ్‌వేర్ ఉంది. ఇందులో మూడు డిఫరెన్షియల్ లాక్స్, క్రాల్ కంట్రోల్ మరియు ఏకంగా 10 రకాల టెర్రైన్ మోడ్స్ ఉన్నాయి. లెజెండర్ కూడా ఆఫ్-రోడింగ్‌లో దిట్టే అయినప్పటికీ, మెజెస్టర్‌లో ఉన్నన్ని ఎలక్ట్రానిక్ అసిస్టెన్స్ ఫీచర్లు అందులో లేవు. కాబట్టి సాహసయాత్రలు చేసే వారికి మెజెస్టర్ ఒక వరమని చెప్పొచ్చు.

ఏది కొనాలి?
టయోటా లెజెండర్ తన విశ్వసనీయతకు, బ్రాండ్ వాల్యూకు పెట్టింది పేరు. ప్రస్తుతం దీని ధర రూ. 42.17 లక్షల నుంచి రూ. 47.46 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. ఎంజీ మెజెస్టర్ ఇన్ని ఫీచర్లు, టెక్నాలజీని ఇస్తోంది కాబట్టి, ధర కూడా పోటీకి తగ్గట్టుగా ఉంటే ఫార్చ్యూనర్ హవాకు అడ్డుకట్ట వేయడం ఖాయం. మీకు కేవలం బ్రాండ్, రీసేల్ వాల్యూ కావాలంటే లెజెండర్ వైపు వెళ్లొచ్చు.. లేదు నాకు లేటెస్ట్ టెక్నాలజీ, లగ్జరీ ఫీచర్లు కావాలంటే మాత్రం మెజెస్టర్ కోసం వేచి చూడాల్సిందే!


Click it and Unblock the Notifications