ట్యాక్సీ డ్రైవర్లకు పండగే.. ఎంజీ విండ్సర్ కమ్యూట్ వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్‌తో 332 కి.మీ రేంజ్
దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న జేఎస్‌డబ్ల్యూ-ఎంజీ మోటార్ (JSW-MG Motor) తన పాపులర్ ఎలక్ట్రిక్ కార్ విండ్సర్ ఈవీలో సరికొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. ముఖ్యంగా ట్యాక్సీ ఆపరేటర్లు, ఫ్లీట్ ఓనర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విండ్సర్ కమ్యూట్ (MG Windsor Commute) అనే వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాధారణ మోడల్ కంటే తక్కువ ధరకే లభిస్తున్న ఈ వేరియంట్ ఇప్పుడు వాహన రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారు ధర, ఫీచర్లు, రేంజ్, ఇతర పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర, వేరియంట్ వివరాలు:
జేఎస్‌డబ్ల్యూ-ఎంజీ మోటార్ ఇండియా తన విండ్సర్ ఈవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ కమ్యూట్ వేరియంట్‌ను రూ.13.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇది ఇప్పటివరకు ఉన్న బేస్ వేరియంట్ ఎక్సైట్ (Excite) కంటే సుమారు రూ.61,000 తక్కువ ధరకే లభిస్తుంది. అయితే, ఈ కారును కేవలం ఫ్లీట్-ఓన్లీ (Fleet-only) అంటే ట్యాక్సీలు లేదా క్యాబ్ సర్వీసుల కోసం మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి వీలుంటుంది. వ్యక్తిగత వినియోగం కోసం ఈ వేరియంట్ అందుబాటులో ఉండదు. ఎంజీ కంపెనీ ఈ కారు కోసం బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) మోడల్‌ను కూడా ఆఫర్ చేస్తోంది, దీనివల్ల కారును కొనేటప్పుడు చెల్లించాల్సిన ముందస్తు ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

ఛార్జింగ్, రేంజ్ సామర్థ్యం:
విండ్సర్ కమ్యూట్ వేరియంట్‌లో 38 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఏఆర్ఏఐ (ARAI) రేటింగ్ ప్రకారం.. ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 332 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇది నగరాల్లో ట్యాక్సీలుగా నడిపేవారికి అద్భుతమైన రేంజ్ అని చెప్పవచ్చు. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, 7.4 కిలోవాట్ ఏసీ (AC) ఛార్జర్ ద్వారా 10 నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి సుమారు 7 గంటల సమయం పడుతుంది. అయితే, 45 కిలోవాట్ డీసీ (DC) ఫాస్ట్ ఛార్జర్ వాడితే కేవలం 45 నిమిషాల్లోనే 20 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. విరామ సమయంలో టీ తాగే లోపు కారు మళ్లీ ప్రయాణానికి సిద్ధమవుతుందన్నమాట.
ఎక్స్‌టీరియర్ డిజైన్:
ధర తగ్గించినప్పటికీ ఎంజీ మోటార్ బయటి వైపు డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. విండ్సర్ కమ్యూట్‌లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్లు, కారు లోపలికి నొక్కినట్టుగా ఉండే ఫ్లష్-ఫిటింగ్ డోర్ హ్యాండిల్స్ వంటి ఆధునిక ఫీచర్లను కొనసాగించారు. అయితే, ధర తగ్గించడం కోసం ఇందులో అల్లాయ్ వీల్స్‌ను తొలగించి, వాటి స్థానంలో 17 అంగుళాల స్టీల్ వీల్స్‌ను అందించారు. ఈ వీల్స్‌కు క్యాప్స్ (Covers) కూడా ఉండవు, కానీ కమర్షియల్ వాహనంగా ఇవి మన్నికగా ఉంటాయి.

ఇంటీరియర్, కంఫర్ట్:
కారు లోపలి భాగంలో బ్లాక్ థీమ్ ఉంటుంది, కొన్ని చోట్ల గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. సీట్ల కోసం క్లాత్ అపోల్స్టరీని వాడారు. డ్రైవర్ కోసం 7 అంగుళాల ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. అయితే, ఖర్చు తగ్గించడానికి ఇందులో ఎక్సైట్ వేరియంట్‌లో ఉండే 10.1 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను తీసేశారు. దానికి బదులుగా యూఎస్‌బీ, ఎఫ్ఎం, బ్లూటూత్ వంటి ప్రాథమిక ఫీచర్లు ఉన్న ఒక చిన్న మ్యూజిక్ సిస్టమ్‌ను అమర్చారు. వెనుక సీట్లను వెనక్కి వాల్చుకునే (Recline) సదుపాయం ఉండటం వల్ల ప్రయాణికులకు విమానం లాంటి అనుభూతి కలుగుతుంది.
ఫీచర్లు, సేఫ్టీ :
ఎంజీ విండ్సర్ కమ్యూట్‌లో మాన్యువల్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ అడ్జస్ట్‌మెంట్ (టిల్ట్ అండ్ టెలిస్కోపిక్), పవర్ విండోస్, వెనుక వైపు టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటి నిత్యవసర ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో కంపెనీ అస్సలు తగ్గలేదు. ఈ కారులో నాలుగు టైర్లకు డిస్క్ బ్రేక్‌లు అందించారు. అలాగే రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), అందరికీ త్రీ-పాయింట్ సీట్ బెల్టులను ప్రామాణికంగా ఇచ్చారు. ఇది డ్రైవర్, ప్రయాణికులకు పూర్తి భద్రతను కల్పిస్తుంది.

మార్కెట్ ప్రభావం, పోటీ:
ప్రస్తుతం భారతీయ ఇలెక్ట్రిక్ ఫ్లీట్ మార్కెట్‌లో టాటా నెక్సాన్ ఈవీ, టాటా టిగోర్ ఈవీల హవా నడుస్తోంది. ఇప్పుడు ఎంజీ విండ్సర్ తన విశాలమైన క్యాబిన్, తక్కువ ధరకు ఫ్లీట్ వేరియంట్‌ను తీసుకురావడంతో ట్యాక్సీ రంగంలో పోటీ పెరగనుంది. ఎంజీ కమ్యూట్ మోడల్ ద్వారా ఆపరేటర్లకు నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఎంజీ ఐఎం6 (MG IM6) పేరుతో మరో ప్రీమియం ఎలక్ట్రిక్ కారును కూడా తీసుకురావడానికి జేఎస్‌డబ్ల్యూ-ఎంజీ మోటార్ సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications








