రూ.3.70 లక్షలకే కారు.. పైగా 33.40 కి.మీ మైలేజ్.. దేశంలో అందరి ఫేవరెట్ కారు ఇదే!
భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాల కారు కలను నిజం చేసిన వాహనాల గురించి మాట్లాడితే, మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto) పేరు తప్పకుండా ప్రస్తావనకు వస్తుంది. దశాబ్దాలుగా భారతీయుల విశ్వాసాన్ని సంపాదించుకున్న ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ కేవలం ఒక కారు మాత్రమే కాదు, లక్షలాది కుటుంబాల తొలి నాలుగు చక్రాల ప్రయాణానికి నాంది పలికిన మధుర జ్ఞాపకం. 1990ల చివరలో భారత రోడ్లపై అడుగుపెట్టి, కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులు, అప్‌డేట్లను అందుకుంటూ నేటికీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రారంభంలో 800cc ఇంజన్‌తో వచ్చిన ఈ కారు, ప్రస్తుతం మరింత శక్తివంతమైన 1.0-లీటర్ K10 పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. చిన్న కుటుంబాలకు, నగర ప్రయాణాలకు అనువైన కారుగా ఆల్టో K10 ఇప్పటికీ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది.
ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు, ఆధునిక టెక్నాలజీతో కూడిన కార్లు మార్కెట్లోకి వస్తున్నప్పటికీ, ఆల్టో తన క్రేజ్‌ను మాత్రం ఏమాత్రం కోల్పోలేదని అమ్మకాల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2026 మే నెలలో ఈ కారు 9,887 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి మరోసారి మార్కెట్లో తన బలమైన ఉనికిని చాటుకుంది. చిన్న కార్ల విభాగంలో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, వినియోగదారుల విశ్వాసం ఇంకా ఆల్టో పైనే ఉందని ఈ సంఖ్యలు సూచిస్తున్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గత ఏడాది మే నెలలో ఆల్టో K10 అమ్మకాలు కేవలం 4,970 యూనిట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే ఈ ఏడాది అదే కాలంతో పోలిస్తే అమ్మకాలు రెండింతలు పెరగడం విశేషం. వార్షిక ప్రాతిపదికన చూస్తే 99 శాతం వృద్ధిని నమోదు చేయడం ద్వారా ఆల్టో K10 తన పాపులారిటీ ఇంకా తగ్గలేదని నిరూపించింది.కొత్త SUVలు, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పోటీ కాలంలో ఆల్టో మంచి డిమాండ్ సాధిస్తుంది.
డిజైన్ పరంగా చిన్న కారే అయినప్పటికీ, ఆధునిక లుక్‌తో ఆకట్టుకుంటుంది. ముందు భాగంలో పెద్ద గ్రిల్, ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్స్ కారుకు స్టైలిష్ రూపాన్ని అందిస్తాయి. పాత ఆల్టోతో పోలిస్తే కొత్త మోడల్ మరింత బోల్డ్‌గా కనిపిస్తుంది. కాంపాక్ట్ సైజు కారణంగా నగర రోడ్లలో సులభంగా డ్రైవ్ చేయవచ్చు. సైడ్ ప్రొఫైల్‌లో సింపుల్ కానీ ఆకర్షణీయమైన డిజైన్ కనిపించగా, వెనుక భాగంలో టెయిల్‌ల్యాంప్స్ కారుకు చక్కని ఫినిషింగ్‌ను ఇస్తాయి.

మారుతి సుజుకి ఆల్టో K10లో ఉపయోగించిన 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ దాని సెగ్మెంట్‌లో మంచి బ్యాలెన్స్‌డ్ పనితీరును అందిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 67 bhp పవర్, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ నగర ప్రయాణాలకు సరిపడే స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లలో కూడా కారును సులభంగా హ్యాండిల్ చేయగలగడం ఈ ఇంజిన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు.
ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ AMT ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. డ్రైవింగ్‌లో సౌలభ్యం కోరుకునేవారికి AMT మంచి ఎంపికగా నిలుస్తుంది. అలాగే తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే వారికి CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. మైలేజ్ పరంగా కూడా ఆల్టో K10 తన సెగ్మెంట్‌లో బలమైన స్థానాన్ని కలిగి ఉంది.

పెట్రోల్ వేరియంట్ లీటరుకు సుమారు 24.90 కిలోమీటర్ల వరకు, CNG వేరియంట్ కిలో గ్యాస్‌కు దాదాపు 33.40 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యంతో మరింత ఆర్థికంగా మారుతుంది. మొత్తంగా చూస్తే, పనితీరు, మైలేజ్, ఆర్థిక ప్రయోజనాల మధ్య మంచి సమతుల్యతను అందించే కారు గా ఆల్టో K10 నిలుస్తుంది. ఆల్టో K10 ఎక్స్-షోరూమ్ ధర ప్రస్తుతం రూ. 3.70 లక్షల నుంచి రూ. 5.45 లక్షల వరకు ఉంది.


Click it and Unblock the Notifications