మార్కెట్లోకి సరికొత్త మినీ ఓపెన్ టాప్ కార్.. దీనిలో రోడ్డుపై వెళ్తుంటే అందరి చూపు మీ వైపే!
ప్రీమియం కార్ల విభాగంలో తన స్థానాన్ని మరింత బలపరచుకునే దిశగా మినీ (Mini) ఇండియా మరో ప్రత్యేక మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే మినీ కన్వర్టిబుల్ జెసిడబ్ల్యు ప్యాక్ (Mini Convertible JCW Pack). ఈ కారును రూ. 61.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు భారతదేశంలో విడుదల చేయగా, ఇది పూర్తిగా దిగుమతిగా (CBU) దేశానికి వస్తోంది. పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటం దీని ప్రత్యేకతను మరింత పెంచుతోంది. స్టాండర్డ్ కూపర్ ఎస్ కన్వర్టిబుల్ ఆధారంగా రూపొందించిన ఈ జెసిడబ్ల్యూ (John Cooper Works) ప్యాక్, ముఖ్యంగా డిజైన్ పరంగా మరింత స్పోర్టీగా, ఆకర్షణీయంగా కనిపించేలా కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లను అందిస్తుంది.
వెలుపలి లుక్‌లో స్పోర్టీ టచ్, లోపల ప్రీమియం ఫినిషింగ్ కలిపి ఈ కారుకు ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. అయితే మెకానికల్ పరంగా పెద్ద మార్పులు లేకపోయినా, ఇప్పటికే ఉన్న పనితీరు దీనికి సరిపడేలా ఉంటుంది. ఓపెన్ టాప్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇష్టపడే వారికి ఈ కన్వర్టిబుల్ కారు ఒక ప్రత్యేక ఎంపికగా నిలుస్తుంది. రోడ్డుపై నడుస్తూ స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా, డ్రైవింగ్‌లో కూడా ఒక ప్రత్యేక ఫీలింగ్‌ను అందిస్తుంది.

బుకింగ్‌లు ఇప్పటికే ఏప్రిల్ 14న ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లకు డెలివరీలు కూడా త్వరగా ప్రారంభం కానున్నాయి. డిజైన్, ఫీచర్ల విషయంలో చాలా స్టైలిష్‌గా ఉంటుంది. బయట నుంచి చూస్తే నలుపు రంగు మిర్రర్ క్యాప్స్, స్పోర్టీ స్ట్రైప్స్, 17-అంగుళాల JCW అల్లాయ్ వీల్స్ ఈ కారుకు ప్రత్యేక లుక్ ఇస్తాయి. వెనుక భాగంలో ఉన్న ఓవల్ LED టెయిల్ ల్యాంప్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి.
ఈ కారులో సాఫ్ట్ టాప్ పూర్తిగా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. గంటకు 30 కిలోమీటర్ల వేగం వరకు 18 సెకన్లలో తెరవచ్చు, 15 సెకన్లలో మూసేయవచ్చు. కావాలంటే కొంత వరకు మాత్రమే ఓపెన్ చేసి సన్‌రూఫ్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. రూఫ్ మూసి ఉన్నప్పుడు బూట్ స్పేస్ 215 లీటర్లు, ఓపెన్ చేసినప్పుడు 160 లీటర్లుగా ఉంటుంది. లైటింగ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది.

LED హెడ్‌లైట్లు మూడు రకాల లైట్ సిగ్నేచర్‌లతో పాటు, వెల్కమ్ యానిమేషన్‌తో వస్తాయి. లోపల క్యాబిన్ పూర్తిగా స్పోర్టీ ఫీల్ ఇస్తుంది. JCW స్పోర్ట్స్ సీట్లు, నలుపు రంగు అప్హోల్స్టరీ, స్టైలిష్ స్టీరింగ్ వీల్ కలిసి ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. డాష్‌బోర్డ్‌లో గుండ్రని OLED డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇందులో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ ఫీచర్లు ఒకే స్క్రీన్‌లో కనిపిస్తాయి.
అదనంగా టాగల్ కంట్రోల్స్ ద్వారా స్టార్ట్/స్టాప్, గేర్, డ్రైవింగ్ మోడ్‌లను సులభంగా ఆపరేట్ చేయవచ్చు. అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. బయటి వైపున, JCW-కు ప్రత్యేకమైన మార్పులలో సవరించిన ఫ్రంట్ గ్రిల్, కొత్తగా రూపొందించిన బంపర్లు, సైడ్ స్కర్ట్‌లు, డోర్ ఎంట్రీ సిల్స్‌తో పాటు పియానో బ్లాక్ ఎక్స్‌టీరియర్ ట్రిమ్ మరియు వీల్ ఆర్చ్ క్లాడింగ్ ఉంటాయి.

పనితీరు విషయంలో ఆకట్టుకుంటుంది. ఇందులో MINI TwinPower Turbo టెక్నాలజీతో పనిచేసే పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 204 hp పవర్‌ను(5,000-6,500 rpm వద్ద), 300 Nm టార్క్‌ను (1,450-4,500 rpm వద్ద) ఉత్పత్తి చేస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా ఈ కారు చాలా స్పోర్టీగా ఉంటుంది. కేవలం 6.9 సెకన్లలోనే 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. అలాగే గరిష్ట వేగం 240 km/h వరకు ఉంటుంది.


Click it and Unblock the Notifications