7 ఏళ్ల తర్వాత లెజెండ్ పజెరో తిరిగి వస్తోంది.. ఒకప్పుడు రోడ్లపై సింహం.. ఎన్ని SUVలు వచ్చినా దీని క్రేజ్ వేరు!
ఒకప్పుడు SUV ప్రియుల కలల వాహనంగా గుర్తింపు పొందిన మిత్సుబిషి పజెరో (Mitsubishi Pajero) మళ్లీ రోడ్లపైకి రావడానికి సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ ఐకానిక్ SUVను తిరిగి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు మిత్సుబిషి మోటార్స్ ప్రకటించింది. దీంతో పజెరో అభిమానుల్లో మరోసారి ఉత్సాహం నెలకొంది. కొత్త తరం పజెరో 2026లో ప్రపంచవ్యాప్తంగా పరిచయం కావచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. పజెరో పేరు SUV ప్రపంచంలో ఒక ప్రత్యేక చరిత్రను కలిగి ఉంది. దశాబ్దాల పాటు ఆఫ్‌రోడ్ సామర్థ్యాలు, బలమైన నిర్మాణం, విశ్వసనీయ పనితీరుతో ఈ వాహనం ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
ముఖ్యంగా కఠినమైన రోడ్లు, కొండ ప్రాంతాలు, ఎడారి మార్గాల్లో సైతం అద్భుతమైన పనితీరు కనబరచడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అడ్వెంచర్ ప్రేమికులకు పజెరో ఒక ఫేవరెట్ మోడల్‌గా మారింది. అయితే మారుతున్న మార్కెట్ పరిస్థితులు, కొత్త ఉద్గార నిబంధనలు, వినియోగదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పుల కారణంగా పజెరో ఉత్పత్తిని జపాన్‌లో 2019లో నిలిపివేశారు. అనంతరం విదేశీ మార్కెట్లలో కూడా 2021 నాటికి ఈ మోడల్‌కు వీడ్కోలు పలికారు.

అయితే పజెరోపై ఉన్న అభిమానుల ప్రేమ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ముఖ్యంగా భారతదేశంలో మిత్సుబిషి తన కార్ల వ్యాపారాన్ని నిలిపివేసిన తర్వాత కూడా ఈ బ్రాండ్‌కు చెందిన వాహనాలు సెకండ్‌హ్యాండ్ మార్కెట్లో మంచి డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయి. అందులోనూ పజెరోకు ప్రత్యేకమైన క్రేజ్ ఇప్పటికీ కనిపిస్తుంది. దృఢమైన నిర్మాణం, ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా ఈ SUV ఇప్పటికీ ఎంతో మంది అభిమానుల గ్యారేజీల్లో స్థానం దక్కించుకుంది.
పజెరోకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకువచ్చిన అంశాల్లో డాకర్ ర్యాలీ కూడా ఒకటి. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఆఫ్‌రోడ్ మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్‌గా పేరొందిన డాకర్ ర్యాలీలో పజెరో అనేక విజయాలను సాధించింది. ఈ విజయాలే దీనిని కేవలం ఒక SUVగా కాకుండా, ఆఫ్‌రోడ్ లెజెండ్‌గా నిలబెట్టాయి. అందుకే ఇప్పటికీ పజెరో పేరు వినగానే చాలా మంది ఆటోమొబైల్ అభిమానులకు బలమైన, నమ్మకమైన, అడ్వెంచర్‌కు సిద్ధంగా ఉండే SUV గుర్తుకు వస్తుంది.

ఇప్పుడు రాబోతున్న కొత్త తరం పజెరోలో ఆధునిక డిజైన్, తాజా సాంకేతికత, మరింత అధునాతన భద్రతా ఫీచర్లు, హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిఫైడ్ పవర్‌ట్రెయిన్ ఎంపికలు ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ మోడల్‌ను మిత్సుబిషి భారత మార్కెట్లోకి తీసుకువస్తుందా లేదా అన్నది ప్రస్తుతం స్పష్టంగా తెలియలేదు. ఎందుకంటే ప్రస్తుతం మిత్సుబిషి భారతదేశంలో ఎలాంటి కార్లను విక్రయించడం లేదు.
అయినప్పటికీ, ఒకవేళ పజెరో మళ్లీ భారత మార్కెట్లో అడుగుపెడితే, SUV ప్రియుల నుంచి మంచి స్పందన లభించే అవకాశాలు ఉన్నాయని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు. తొలిసారిగా 1982లో ప్రపంచ మార్కెట్లో అడుగుపెట్టిన పజెరో, అప్పటి వరకు ఉన్న సంప్రదాయ ఆఫ్‌రోడ్ వాహనాల భావనను పూర్తిగా మార్చేసింది. ఫోర్-వీల్ డ్రైవ్ వ్యవస్థ ద్వారా కఠినమైన రోడ్లపై అలాగే, సాధారణ ప్యాసింజర్ కార్ల మాదిరిగా సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కూడా కల్పించింది.

అందుకే విడుదలైన కొద్ది కాలంలోనే పజెరో అనేక దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటిగా ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా 170కి పైగా దేశాల్లో మిత్సుబిషి 32.5 లక్షలకు పైగా పజెరో యూనిట్లను విక్రయించింది. SUV విభాగంలో ఇది ఒక అరుదైన ఘనతగా చెప్పవచ్చు. దశాబ్దాల పాటు నిలకడగా విక్రయాలు కొనసాగించడం, వివిధ తరాల మోడళ్ల ద్వారా వినియోగదారుల ఆదరణను నిలబెట్టుకోవడం పజెరో ప్రత్యేకత.
అందుకే ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా ఈ SUV పేరు వినగానే ఆటోమొబైల్ ప్రేమికుల్లో ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఇప్పుడు కొత్త తరం పజెరో రాబోతుందనే వార్తతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ కారులో అధునాతన ఫీచర్లను కంపెనీ అందించనుందని తెలుస్తుంది. ప్రపంచ మార్కెట్లో విడుదల తర్వాత భారత్‌లో కూడా రావచ్చు. దీనిపై మరింత పూర్తి సమాచారం రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications