జపాన్ కంపెనీ కార్లకు బ్రహ్మరథం పడుతున్న జనాలు.. ఈ కార్ల కోసం షోరూమ్‌ల ముందు పడిగాపులు
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా (Toyota Motor Corporation) భారత మార్కెట్లో కూడా తన స్థాయిని క్రమంగా పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా దేశీయ మార్కెట్లో బలమైన ఉనికి కలిగిన మారుతి సుజుకితో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న తర్వాత, టయోటా కార్ల విక్రయాలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా పలు మోడళ్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టి, వినియోగదారుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. దీనికి తాజా ఉదాహరణగా ఫిబ్రవరి 2026 నెలలో నమోదైన అమ్మకాల గణాంకాలను చెప్పుకోవచ్చు. గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి 2026లో భారత మార్కెట్లో టయోటా మొత్తం 30,737 కార్లను విక్రయించింది. ఈ సంఖ్య కంపెనీకి మంచి వృద్ధిని సూచిస్తోంది.
గత ఏడాది ఫిబ్రవరి 2025లో, టయోటా 26,414 కార్లను మాత్రమే విక్రయించింది. ఈ రెండు గణాంకాలను చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో టయోటా అమ్మకాలు పెరిగినట్టు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 4,000కు పైగా అదనపు కార్లు అమ్ముడయ్యాయి. శాతంగా లెక్కిస్తే 16 శాతం వృద్ధి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2026లో టయోటా అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణమైన టాప్-6 టయోటా కార్ మోడళ్లు ఏవో ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.

Toyota Urban Cruiser Hyryder: టయోటా హైరైడర్ మిడ్-సైజ్ SUV స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో అందుబాటులో ఉండటం దీనికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ప్రస్తుతం భారతదేశంలో హైబ్రిడ్ కార్లపై వినియోగదారుల ఆసక్తి వేగంగా పెరుగుతోంది. అదే కారణంగా హైరైడర్ అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి 2025లో 4,314 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, 2026 ఫిబ్రవరిలో ఈ సంఖ్య భారీగా పెరిగి 9,359 యూనిట్లకు చేరుకుంది.
Toyota Innova: భారతదేశంలో ఇన్నోవా పేరు చాలా కాలంగా విశ్వసనీయమైన ఫ్యామిలీ కారుగా గుర్తింపు పొందింది. అందుకే కంపెనీ దీనిని రెండు వేరియంట్లలో అందిస్తోంది. అవే ఇన్నోవా క్రిస్టా (Innova Crysta), ఇన్నోవా హైరైడర్ (Innova Hycross). ఈ రెండు మోడళ్లు కలిసి ఫిబ్రవరి 2026లో మొత్తం 8,703 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈ సంఖ్య మరింత పెరిగింది.

Toyota Glanza: మరోవైపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో టయోటా గ్లాంజా కూడా టయోటాకు ముఖ్యమైన మోడల్‌గా నిలుస్తోంది. ఇది నిజానికి Maruti Suzuki Baleno కారుకు రీబ్యాడ్జ్డ్ వెర్షన్. అయితే ఈసారి గ్లాంజా అమ్మకాలు కొద్దిగా తగ్గినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. ఫిబ్రవరి 2025లో 4,596 యూనిట్లు అమ్ముడవగా, 2026 ఫిబ్రవరిలో మాత్రం 3,212 యూనిట్లకు తగ్గాయి.
Toyota Fortuner: టయోటా లైన్‌అప్‌లో మరో అత్యంత ప్రాచుర్యం పొందిన SUV టయోటా ఫార్చ్యూనర్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ భారత మార్కెట్లో దీనికి ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. గత నెలలో ఈ SUV మొత్తం 3,076 యూనిట్లు అమ్ముడైంది. ఇదే సమయంలో ఫిబ్రవరి 2025లో 2,876 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి. అంటే ఈసారి కొద్దిగా వృద్ధి నమోదైంది.

Toyota Taisor: టైజర్ కారుని నిజానికి Maruti Suzuki Fronx కారుకు రీబ్యాడ్జ్డ్ వెర్షన్‌గా టయోటా తీసుకొచ్చింది. ప్రారంభంలో మంచి స్పందన వచ్చినప్పటికీ ప్రస్తుతం అమ్మకాలు కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తోంది. ఫిబ్రవరి 2025లో 3,604 యూనిట్లు అమ్ముడవగా, గత నెలలో ఈ సంఖ్య 2,854 యూనిట్లకు తగ్గింది. ఇటీవల ఇతర మోడళ్ల నుంచి వస్తున్న పోటీ కారణంగా దీని అమ్మకాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
Toyota Rumion: అదే సమయంలో కుటుంబ అవసరాలకు అనువైన MPVగా రూమియన్ కూడా మార్కెట్లో మంచి స్పందన పొందుతోంది. ఇది అసలుగా Maruti Suzuki Ertiga కారుకు రీబ్యాడ్జ్డ్ వెర్షన్. ఫిబ్రవరి 2026లో రూమియన్ మొత్తం 2,817 యూనిట్లు అమ్ముడైంది. జనవరిలో కూడా దాదాపు ఇదే స్థాయి అమ్మకాలు నమోదయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో మాత్రం కేవలం 2,099 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి.


Click it and Unblock the Notifications








