అక్టోబర్ 1 నుంచి కొత్త కార్ల రూల్స్ మారనున్నాయి! ఈ AVAS సిస్టమ్ లేకపోతే మీ కారు డెలివరీకి ఇబ్బందేనా?
భారతదేశంలో 2026 అక్టోబర్ 1 నుంచి విక్రయించే ప్రతి కొత్త ఎలక్ట్రిక్, స్ట్రాంగ్-హైబ్రిడ్ కార్లు మరియు వ్యాన్లలో అకౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్ (AVAS) అమర్చడం తప్పనిసరి కానుంది. మీరు కూడా రాబోయే పండుగ సీజన్‌లో కొత్త వాహనం డెలివరీ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. కారు తయారీ తేదీ, ఇన్‌వాయిస్ వివరాలు, AVAS సిస్టమ్ సరిగ్గా పనిచేస్తోందో లేదో ముందే చెక్ చేసుకోవడం మంచిది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడళ్లకు ఈ నిబంధన పాటించడానికి మరొక ఏడాది సమయం ఇచ్చారు. అయితే, అక్టోబర్ 1, 2026 తర్వాత ఆమోదం పొందే కొత్త మోడళ్లకు మాత్రం ఇది వెంటనే వర్తిస్తుంది.
ఈ కొత్త నిబంధన ఎలక్ట్రిఫైడ్ కేటగిరీ M (పాసింజర్ వాహనాలు), కేటగిరీ N (సరుకు రవాణా వాహనాలు) రెండింటికీ వర్తిస్తుంది. భారత ప్రమాణాల సంస్థ (BIS) సరిసమానమైన నిబంధనలు తీసుకొచ్చేంతవరకు, AIS-173 సౌండ్ పరిమితుల ఆధారంగానే వాహనాల శబ్ద శ్రేణిని నిర్ధారిస్తారు. అంటే నగరాల్లో తక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు, అలాగే కారును రివర్స్ తీస్తున్న సమయంలో బయటకు వినపడేలా ప్రత్యేక శబ్దం రావాల్సి ఉంటుంది. కారు టైప్ అప్రూవల్ సమయంలోనే దీనిని తనిఖీ చేస్తారు. ఒకవేళ మీ బుకింగ్ డెలివరీ తేదీలు ఈ అక్టోబర్ 1 గడువు అటుఇటుగా ఉంటే, మీ VIN (వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్), ఫారమ్ 22 ద్వారా కారు ఈ నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో సరిచూసుకోవచ్చు. కారు డెలివరీ పేపర్లతో పాటు ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ కాపీని కూడా మీ వద్ద ఉంచుకోవడం మంచిది.

AIS-173 కింద AVAS: వేగం, సౌండ్ పరిమితులు ఇవే
ఈ AVAS సిస్టమ్ వాహనం ప్రారంభమైనప్పటి నుండి సుమారు 20 కి.మీ/గం వేగం వరకు, అలాగే రివర్స్ తీసే సమయంలో తప్పనిసరిగా పనిచేయాలి. శబ్ద పరిమితుల విషయానికి వస్తే.. 10 కి.మీ/గం వేగం వద్ద కనీసం 50 dB(A), 20 కి.మీ/గం వేగం వద్ద 56 dB(A), రివర్స్ తీసేటప్పుడు 47 dB(A) సౌండ్ రావాలి. ఇక ముందుకు వెళ్లేటప్పుడు గరిష్ట శబ్దం 75 dB(A) దాటకూడదు. కారు వేగం పెరిగేకొద్దీ ఈ సౌండ్ కూడా పెరుగుతుంది. అలాగే రోడ్డుపై వెళ్లేటప్పుడు ఈ శబ్దాన్ని నిలిపివేసే 'పాజ్ స్విచ్'లకు అనుమతి లేదు. ఐక్యరాజ్యసమితికి చెందిన UN R138 మార్గదర్శకాల ఆధారంగానే ఈ లిమిట్స్‌ను ఖరారు చేశారు.
| డ్రైవింగ్ పరిస్థితి (Condition) | కనీస శబ్దం (dB(A)) |
|---|---|
| 10 కి.మీ/గం వేగం (ముందుకు) | 50 |
| 20 కి.మీ/గం వేగం (ముందుకు) | 56 |
| రివర్స్ (తక్కువ వేగంలో) | 47 |
| ముందుకు వెళ్లేటప్పుడు గరిష్ట పరిమితి | 75 |
ధరలు, డెలివరీ: అక్టోబర్ 1 నుంచి రాబోయే మార్పులేంటి?
AVAS సిస్టమ్ స్టాండర్డ్ ఫీచర్‌గా మారనుండటంతో కంపెనీలు కార్ల వేరియంట్లలో కొన్ని మార్పులు చేయడంతో పాటు ధరలను స్వల్పంగా పెంచే అవకాశం ఉంది. గతంలో మమారుతి సుజుకి తమ గ్రాండ్ విటారా స్ట్రాంగ్-హైబ్రిడ్ మోడల్‌లో AVAS సిస్టమ్‌ను జోడించి ధరను స్వల్పంగా పెంచిన సంగతి తెలిసిందే. ఒకవేళ మీకు డెలివరీ చేయాల్సిన కారు తయారీ తేదీ అక్టోబర్ 1 దాటితే.. VIN బిల్డ్ మంత్ ఆధారంగా కారులో AVAS ఫ్యాక్టరీ ఫిట్ ఉందో లేదో డీలర్‌ను అడిగి తెలుసుకోండి. అలాగే ప్రోఫార్మా ఇన్‌వాయిస్‌లో ఈ వివరాలు నమోదు చేయించండి. భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే గెజెట్ నోటిఫికేషన్ కాపీని చూపించవచ్చు.
కార్ల తయారీ సంస్థల సన్నాహాలు: ఇప్పటికే AVASతో వస్తున్న కార్లు ఇవే!
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్లలో ఇప్పటికే 'పెడెస్ట్రియన్ వార్నింగ్ సౌండ్ సిస్టమ్' అందుబాటులో ఉంది. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, ఐయోనిక్ 5 మోడళ్లలో 'వర్చువల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్ (VESS)' ఉపయోగిస్తున్నారు. కియా ఈవీలలో కూడా VESS ఫీచర్ ఉందని ఓనర్ మ్యాన్యువల్‌లో పేర్కొన్నారు. ఎమ్‌జి జెడ్‌ఎస్ ఈవీ (MG ZS EV)లో 'పెడెస్ట్రియన్ అలర్ట్ కంట్రోల్ సిస్టమ్' ఉంది. బివైడి ఆటో 3 (BYD Atto 3) మ్యాన్యువల్‌లో AVAS పనితీరు గురించి వివరంగా ఇచ్చారు. గ్రాండ్ విటారా స్ట్రాంగ్-హైబ్రిడ్ మోడళ్లలోనూ ఈ సిస్టమ్ వస్తోంది. కాబట్టి ఈ కార్ల తయారీ, విక్రయాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
డీలర్ చెక్‌లిస్ట్.. టెస్ట్ డ్రైవ్ సమయంలో గమనించాల్సిన అంశాలు
కారు బిల్లింగ్ చేయడానికి ముందే, VIN నంబర్ ఆధారంగా దాని తయారీ నెలను సరిచూసుకోండి. AIS-173 ప్రమాణాల ప్రకారం కారులో AVAS ఉన్నట్లు ఫారమ్ 22లో నమోదు చేశారో లేదో చెక్ చేయండి. ఇన్‌వాయిస్‌లో ఈ సిస్టమ్ 'ఫ్యాక్టరీ ఫిట్' అని ఉందో లేదో చూడండి. కారు టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు గ్లాస్‌లు కిందకు దించి, 0-20 కి.మీ/గం వేగంతో ఉన్నప్పుడు, అలాగే రివర్స్ చేసేటప్పుడు ఆ అలర్ట్ శబ్దం వినబడుతోందో లేదో గమనించండి. ఒకవేళ పాత కారు స్టాక్ కోసం ఆఫ్టర్ మార్కెట్/రెట్రోఫిట్ సిస్టమ్ వేస్తామని డీలర్ చెబితే, AIS-173 సర్టిఫికేషన్, వారంటీ ప్రూఫ్ అడగండి. రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా డెమో కార్లను అప్‌డేట్ చేయడంతో పాటు ఫీచర్ లిస్ట్‌ను డీలర్లు సరిచూసుకోవడం ముఖ్యం.
కారు కొనుగోలుదారులకు ముఖ్య గమనిక: మీ కారు VIN నంబర్ ఆధారంగా ప్రొడక్షన్ డేట్ సరిచూసుకోండి. పేపర్ వర్క్‌లో AVAS ఫీచర్ ఉందో లేదో గమనించండి. చిన్న టెస్ట్ డ్రైవ్ చేసి సౌండ్ వస్తుందో లేదో స్వయంగా నిర్ధారించుకోండి. కొత్త మోడళ్ల ఆమోదానికి 2026 అక్టోబర్ 1, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడళ్లకు 2027 అక్టోబర్ 1 వరకు గడువు ఉంది. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండుగ సీజన్‌లో మీ కొత్త కారును సంతోషంగా ఇంటికి తీసుకెళ్లవచ్చు.


Click it and Unblock the Notifications
