లీటరుకు ఏకంగా 35 కిమీ మైలేజ్.. టెస్టింగ్ చేస్తుండగా దొరికిపోయిన మారుతి సీక్రెట్ వెపన్
భారతదేశంలో మారుతి సుజుకి కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ అయిన మారుతి ఫ్రాంక్స్ (Fronx) ఎస్‌యూవీ.. చాలా తక్కువ కాలంలోనే కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంది. చిన్న కార్ల నుంచి సబ్-కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్‌యూవీల వైపు మళ్లుతున్న కస్టమర్ల టేస్ట్‌కు తగ్గట్లుగా ఈ కారును డిజైన్ చేశారు.
దీని కూపే స్టైల్ డిజైన్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, మంచి మైలేజ్ వల్ల గత మూడు సంవత్సరాలుగా ఈ కారు మార్కెట్లో రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా మొన్నటి మే నెలలో కూడా దేశంలోనే నంబర్-1 ఎస్‌యూవీ మోడల్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి సూపర్ హిట్ కారును ఇప్పుడు మరింత ఆధునిక మార్పులతో సరికొత్తగా మార్కెట్లోకి తీసుకురావడానికి మారుతి సుజుకి గట్టి ప్లాన్ చేస్తోంది.

ఇందులో భాగంగానే ఫ్రాంక్స్ మొదటి పెద్ద ఫేస్‌లిఫ్ట్ (Facelift) మోడల్‌ను కంపెనీ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన రోడ్ టెస్టింగ్‌లు దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. చాలాసార్లు ముసుగులు (కామోఫ్లాజ్) వేసి ఈ కారును టెస్ట్ చేస్తుండగా ఆటోమొబైల్ నిపుణుల కంట పడింది. ఈ సరికొత్త అప్‌డేటెడ్ ఫ్రాంక్స్ మోడల్ అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, ఇది 2027 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయని సమాచారం.
కొత్త ఫ్రాంక్స్ కారులో రాబోయే అతిపెద్ద హైలైట్ ఏంటంటే.. దీని మైలేజ్. మారుతి సుజుకి సంస్థ తన భవిష్యత్తు కార్లయిన ఫ్రాంక్స్, బాలెనో, స్విఫ్ట్, బ్రెజ్జా వంటి మోడల్స్ కోసం సొంతంగా ఒక సరికొత్త సిరీస్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ (In-house Strong Hybrid Technology)ను డెవలప్ చేస్తోంది. దీనికి HEV అని కోడ్ నేమ్ పెట్టారు. ప్రస్తుతం గ్రాండ్ విటారా, ఇన్విక్టో కార్లలో వాడుతున్న టయోటా హైబ్రిడ్ టెక్నాలజీ కంటే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా ఉండబోతోంది.

నివేదికల ప్రకారం, ఈ కొత్త ఇన్-హౌస్ హైబ్రిడ్ టెక్నాలజీ మొట్టమొదటిసారిగా 2027 ఫ్రాంక్స్ మోడల్‌లోనే పరిచయం కానుంది. ఇది నమ్మకమైన 1.2-లీటర్ Z12E పెట్రోల్ ఇంజిన్‌పై ఆధారపడి పనిచేస్తూ.. లీటరుకు ఏకంగా 35 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ కొత్త మోడల్ కేవలం మైలేజ్ మాత్రమే కాదు, సేఫ్టీ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది. ఈ కారులో సరికొత్తగా అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ అంటే అడాస్ (ADAS) ఫీచర్‌ను కంపెనీ జత చేయబోతోంది. దీనివల్ల ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చి ప్రమాదాల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది.

దీనితో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు.. ఎథనాల్ కలిపిన ఇంధనంతో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ (Flex Fuel) ఆప్షన్‌ను కూడా ఈ కారు సపోర్ట్ చేయనుండటం విశేషం. డిజైన్ పరంగా చూస్తే కారు సైజులో ఎలాంటి మార్పులు ఉండవు కానీ లుక్ పరంగా కొన్ని ఆకర్షణీయమైన మార్పులు చేయనున్నారు.
కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, సరికొత్త ముందు, వెనుక బంపర్లు, అప్‌డేటెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లతో కారు మరింత స్పోర్టీగా కనిపించనుంది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ సరికొత్త ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ మోడల్.. ప్రస్తుతం మార్కెట్లో మంచి సేల్స్‌తో దూసుకుపోతున్న టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO వంటి గట్టి కార్లతో నేరుగా పోటీ పడనుంది. మైలేజ్, సేఫ్టీ కలయికతో రాబోతున్న ఈ కారు మిగిలిన బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications