మెర్సిడెస్ నుంచి అత్యంత విలాసవంతమైన కారు.. కొత్త ఎస్-క్లాస్ విడుదల!
భారత లగ్జరీ కార్ల మార్కెట్లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు మెర్సిడెస్-బెంజ్ సిద్ధమైంది. కంపెనీ తాజాగా 2026 మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ (Mercedes Benz S Class Facelift)ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఇది S450e మోడల్‌గా అందుబాటులో ఉంది. జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజానికి ఫ్లాగ్‌షిప్ సెడాన్‌గా గుర్తింపు పొందిన ఈ కారు లాంచ్ ఎడిషన్ ఎక్స్‌క్లూజివ్ లైన్ ప్రారంభ ధర రూ.2.20 కోట్లు, మాన్యుఫాక్చర్ ఎడిషన్ AMG లైన్ ధర రూ.2.38 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన సెడాన్లలో ఒకటిగా పేరుగాంచిన ఎస్-క్లాస్, ఈ తాజా అప్‌డేట్‌తో మరింత ఆధునిక రూపాన్ని, అధునాతన సాంకేతికతను, మెరుగైన పనితీరును అందించనుంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో బాహ్య డిజైన్‌లో పలు కీలక మార్పులు చేశారు.
ముందుభాగంలో రీడిజైన్ చేసిన గ్రిల్, కొత్త తరహా LED హెడ్‌ల్యాంప్స్, ఆకర్షణీయమైన బంపర్ డిజైన్, మరింత ప్రీమియం లుక్‌ను అందించే స్టైలింగ్ ఎలిమెంట్స్‌ను జోడించారు. దీంతో కారు రోడ్డుపై మరింత గంభీరంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వెనుక భాగంలో కూడా కొత్త LED టెయిల్‌ల్యాంప్స్, స్వల్ప డిజైన్ మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం మీద ఈ సెడాన్ తన లగ్జరీ ఇమేజ్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా రూపొందించబడింది.

ఇంటీరియర్ విషయానికి వస్తే, ప్రయాణికులకు అత్యున్నత స్థాయి సౌకర్యాలను అందించేలా క్యాబిన్‌ను తీర్చిదిద్దారు. ప్రీమియం లెదర్ అప్హోల్స్టరీ, అత్యాధునిక డిజిటల్ డిస్‌ప్లేలు, కొత్త తరం MBUX ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మెరుగైన కనెక్టివిటీ ఫీచర్లు, AI ఆధారిత స్మార్ట్ టెక్నాలజీలు ఉన్నాయి. వెనుక సీట్లలో ప్రయాణిం చే వారికి ప్రత్యేకంగా రూపొందించిన కంఫర్ట్ ఫీచర్లు, రిలాక్సేషన్ ఫంక్షన్లు, లగ్జరీ అనుభూతిని మరింత పెంచే సదుపాయాలు దీనిని తన సెగ్మెంట్‌లో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, భారత మార్కెట్లో ఎస్-క్లాస్ శ్రేణిలో తొలిసారిగా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) పవర్‌ట్రెయిన్‌ను మెర్సిడెస్-బెంజ్ అందిస్తోంది. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కలయికలో పనిచేసే ఈ సాంకేతికత వల్ల మెరుగైన ఇంధన సామర్థ్యం, తక్కువ ఉద్గారాలు, శక్తివంతమైన పనితీరు లభించనుంది. పర్యావరణానికి అనుకూలమైన డ్రైవింగ్ అనుభూతిని కోరుకునే లగ్జరీ కస్టమర్లను ఆకర్షించడంలో ఈ కొత్త పవర్‌ట్రెయిన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

కంపెనీ ఈరోజు నుంచే కొత్త ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. ఆసక్తి చూపుతున్న వినియోగదారులు దేశవ్యాప్తంగా ఉన్న మెర్సిడెస్-బెంజ్ డీలర్‌షిప్‌ల ద్వారా తమ బుకింగ్‌ను నమోదు చేసుకోవచ్చు. డెలివరీలు 2026 నాల్గవ త్రైమాసికంలో, ముఖ్యంగా దీపావళి పండుగ సీజన్ సమయంలో ప్రారంభం కానున్నాయి. తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సాంకేతికతతో 2026 మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ భారత లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత మార్కెట్లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) టెక్నాలజీతో వచ్చిన తొలి ఎస్-క్లాస్‌గా కొత్త మెర్సిడెస్-బెంజ్ S 450e నిలిచింది. ఇందులో 3.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, 22kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఈ రెండు కలిసి గరిష్టంగా 435 హెచ్‌పీ పవర్, 680 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ శక్తి 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రాలకు చేరుతుంది.

మెర్సిడెస్ ప్రకారం, కొత్త S 450e కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 115 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అలాగే 0 నుంచి 100 కిమీ/గంట వేగాన్ని కేవలం 5.7 సెకన్లలో అందుకుంటుంది. 60kW ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతం వరకు 20 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. అంతేకాకుండా, ఇది WLTP ప్రమాణాల ప్రకారం 32.2 కిమీ/లీటర్ వరకు మైలేజీని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications