మేకప్ అదిరింది కానీ..మ్యాటర్ వీక్..కొత్త రెనాల్ట్ డస్టర్లో ఉన్న లోపాలు ఇవే..కంపెనీ చెప్పని చేదు నిజాలు
కొన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఎస్యూవీ లవర్స్ ఆరాధ్య దైవం రెనాల్ట్ డస్టర్ (Renault Duster) సరికొత్త అవతారంలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. పాత డస్టర్ సృష్టించిన మేజిక్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ కొత్త వెర్షన్ అదిరిపోయే డిజైన్, ప్రీమియం ఇంటీరియర్లతో వచ్చినప్పటికీ, లోతుగా పరిశీలిస్తే కొన్ని చేదు నిజాలు బయటపడుతున్నాయి. పాత డస్టర్ లో ఉన్న కొన్ని స్ట్రాంగ్ ఫీచర్లు కొత్త దాంట్లో లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ముఖ్యంగా రెనాల్ట్ కంపెనీ పైకి చెప్పని, దాచిపెట్టిన కొన్ని లోపాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
భారతదేశంలో ఒకప్పుడు ఎస్‌యూవీ అంటే డస్టర్ అనే పేరు మార్మోగిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొత్త డస్టర్ విషయంలో డీజిల్ ఇంజన్ లేకపోవడం అతిపెద్ద లోపంగా కనిపిస్తోంది. ఒకప్పుడు డస్టర్ అంటేనే దాని పవర్‌ఫుల్ డీజిల్ ఇంజన్, మైలేజ్. కానీ రెనాల్ట్ ఇప్పుడు కేవలం పెట్రోల్,హైబ్రిడ్ ఇంజన్లకే పరిమితమైంది.

హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి ప్రత్యర్థులు ఇప్పటికీ డీజిల్ ఆప్షన్ ఇస్తుండగా, డస్టర్ ఈ విషయంలో వెనకబడింది. హైబ్రిడ్ వేరియంట్ ను 'కొత్త డీజిల్' అని రెనో ప్రచారం చేస్తున్నప్పటికీ, ఇండియన్ రోడ్లపై డీజిల్ ఇచ్చే ఆ టార్క్, ఆ గ్రిప్ హైబ్రిడ్ ఇవ్వగలదా అన్నది సందేహమే. మరో నిరాశ కలిగించే విషయం ఆల్-వీల్-డ్రైవ్ (AWD). పాత డస్టర్ ను ఆఫ్-రోడింగ్ కింగ్ అని పిలిచేవారు, దానికి కారణం అందులో ఉన్న AWD సిస్టమ్. కానీ కొత్త డస్టర్ లో దీన్ని తొలగించారు.
AWD వాడే వారు ఇండియాలో తక్కువ మంది ఉన్నారని కంపెనీ చెబుతున్నా, అసలైన ఎస్‌యూవీ ప్రియులు మాత్రం దీన్ని కచ్చితంగా మిస్ అవుతారు. విదేశాల్లో లభిస్తున్న 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ తో కూడిన AWD వెర్షన్ ను ఇండియాలో లాంచ్ చేయకపోవడం పెద్ద మైనస్. ఇది కేవలం సిటీ డ్రైవింగ్ కు మాత్రమే పరిమితమైన ఎస్‌యూవీగా మారిపోయే ప్రమాదం ఉంది.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. క్యాబిన్ చూడటానికి చాలా బాగుంది కానీ వెనుక సీటు సౌకర్యం ఆశించిన స్థాయిలో లేదు. బూట్ స్పేస్ (డిక్కీ స్థలం) ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో వెనుక సీటు లెగ్ రూమ్ ను తగ్గించినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారు డిక్కి స్పేస్ కంటే సుఖవంతమైన ప్రయాణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ విషయంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో డస్టర్ ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ముఖ్యంగా లాంగ్ జర్నీలలో వెనుక కూర్చునే వారికి ఇది కొంత ఇబ్బందిగా మారవచ్చు.
ఇక ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే.. బేస్ వేరియంట్ లో రెనాల్ట్ కైగర్ నుంచి తీసుకున్న 1.0 లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ను ఇచ్చారు. డస్టర్ లాంటి భారీ వాహనానికి ఈ ఇంజన్ ఏమాత్రం సరిపోదని నిపుణులు అంటున్నారు. కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో రావడం సిటీ ట్రాఫిక్ లో డ్రైవింగ్ ను కష్టతరం చేస్తుంది. వాహనం బరువుకు తగిన పవర్ లేకపోతే అది మైలేజీ మీద కూడా ప్రభావం చూపుతుంది. చిన్న ఇంజన్ ను పెద్ద కారులో పెట్టడం వల్ల ఇంజన్ పై ఒత్తిడి పెరిగి, కాలక్రమేణా పనితీరు తగ్గే అవకాశం ఉంది.

అన్నిటికంటే పెద్ద షాక్ ఏంటంటే, 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఇప్పుడు అందుబాటులో లేదు. దీన్ని 2026 దీపావళి నాటికి మాత్రమే విడుదల చేస్తామని రెనో ప్రకటించింది. అంటే ఈ లోపు ప్రత్యర్థి కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుని, కొత్త మోడళ్లను రంగంలోకి దించేస్తాయి.
అంతకాలం కస్టమర్లు వేచి చూస్తారా అనేది పెద్ద ప్రశ్న. గ్లోబల్ మార్కెట్ లో డీజిల్ కు డిమాండ్ తగ్గుతోందని, అందుకే హైబ్రిడ్ పై ఫోకస్ చేస్తున్నామని కంపెనీ సమర్థించుకుంటున్నా, ఇండియన్ మార్కెట్ పల్స్ ను రెనో సరిగ్గా పట్టుకోలేదా అనిపిస్తోంది.

అయితే, రెనాల్డ్ ఈ నిర్ణయాల వెనుక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. చైన్నై ప్లాంట్ నుంచి విదేశాలకు కార్లను ఎగుమతి చేయడం వల్ల, అంతర్జాతీయ ప్రమాణాల కోసం హైబ్రిడ్ మోడళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
డీజిల్ వాహనాల మెయింటెనెన్స్ ఖర్చు (DPF క్లీనింగ్, DEF ఫిల్లింగ్) పెరగడం వల్ల కస్టమర్లకు మనశ్శాంతిని ఇవ్వడానికే హైబ్రిడ్ వైపు మొగ్గు చూపామని కంపెనీ చెబుతోంది. ఏది ఏమైనా, ఐకానిక్ డస్టర్ తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే, ఈ లోపాలను సరిదిద్దుకుని స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ ను త్వరగా తీసుకురావాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








