మీ బడ్జెట్‌లోనే టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు.. కి.మీకు రూ. 2.60 ఖర్చు.. ధర, బ్యాటరీ, రేంజ్ ఫీచర్స్
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి నేతృత్వం వహిస్తున్న టాటా మోటార్స్ (Tata Motors) మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో బలమైన స్థానం సంపాదించిన ఈ సంస్థ, ఫిబ్రవరి 20న తన ప్రజాదరణ పొందిన Tata Punch EV ను కొత్త అవతారంలో పరిచయం చేసింది. నగర ప్రయాణాలకు సరైన పరిమాణం, ఆకట్టుకునే డిజైన్, వినియోగదారుల బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ప్యాకేజీగా మారింది. కొత్త పంచ్ EV విడుదలతో టాటా మోటార్స్ ప్రధానంగా మొదటి ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 9.69 లక్షలుగా నిర్ణయించింది.
అయితే ఎలక్ట్రిక్ కార్ ఖరీదైనదే అనే అభిప్రాయం ఉన్న వినియోగదారుల కోసం టాటా మోటార్స్ మరింత వినూత్నమైన ఎంపికను తీసుకొచ్చింది. అదే BaaS- బ్యాటరీ యాజ్-ఎ-సర్వీస్ విధానం. ఈ విధానం కింద వాహనం ధరను గణనీయంగా తగ్గిస్తూ, పంచ్ EVను కేవలం రూ. 6.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందిస్తోంది. అంటే మీరు కారును తక్కువ ధరకు కొనుగోలు చేసి, బ్యాటరీ ఖర్చును వేరుగా చెల్లించే సౌకర్యాన్ని పొందుతారు.

ఈ BaaS ప్లాన్‌లో వినియోగదారులు బ్యాటరీ కోసం ముందస్తుగా పెద్ద మొత్తం చెల్లించాల్సిన అవసరం ఉండదు. బదులుగా, వారు ఉపయోగించిన దూరాన్ని బట్టి కిలోమీటరుకు కేవలం రూ. 2.60 మాత్రమే చెల్లిస్తారు. ఇది సాధారణంగా పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. దీంతో రోజువారీ ప్రయాణ ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. నగరంలో ఆఫీసు, షాపింగ్, లేదా చిన్న ప్రయాణాలకు ఈ కారు బెస్ట్.
కొత్త పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ 30 kWh, 40 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లలో లభిస్తుంది. 30 kWh వేరియంట్ ప్రారంభ ధర రూ. 9.69 లక్షలు కాగా, 40 kWh వేరియంట్ ధర రూ. 12.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. చిన్న బ్యాటరీ ప్యాక్ 30 kWh మోడల్ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 365 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఇది రోజువారీ ప్రయాణాలకు బెస్ట్.

ఇక పెద్ద 40 kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే టాప్ వేరియంట్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 468 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. దీంతో లాంగ్ డ్రైవ్‌లు కూడా సులభంగా చేయవచ్చు. ఛార్జింగ్ విషయానికి వస్తే, టాటా ఈ కారులో ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాన్ని అందించింది. ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే బ్యాటరీని కేవలం 26 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేవలం 15 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తోనే సుమారు 135 కి.మీ దూరం ప్రయాణించగలదు. కొత్త పంచ్ EVకు జీవితకాల HV బ్యాటరీ వారంటీతో అపరిమిత కిలోమీటర్ల కవరేజ్ అందిస్తామని టాటా ప్రకటించింది. భద్రతా పరంగా కూడా ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ గణనీయమైన అప్‌గ్రేడ్‌ను అందిస్తోంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు ప్రామాణికంగా అందిస్తున్నారు. అలాగే ABS, EBD, ESP వంటి కీలక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

డ్రైవర్‌కు అదనపు భద్రత కల్పించేందుకు TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరా కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం ఫీచర్ల విషయంలో కూడా కొత్త Tata Punch EV ఏమాత్రం తగ్గలేదు. లోపల ప్లష్ లెథరెట్ అల్ట్రా కంఫర్ట్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.
ఎయిర్ ప్యూరిఫైయర్, వాయిస్-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ప్రీమియం అనుభూతిని ఇస్తాయి. టెక్నాలజీ పరంగా 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, కాక్‌పిట్‌లో ఎంబెడెడ్ నావిగేషన్ వ్యూ అందుబాటులో ఉన్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 6 భాషల్లో 200కిపైగా వాయిస్ కమాండ్‌లు, వైర్‌లెస్ ఛార్జర్ కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








