చిన్న ఉద్యోగస్తులు కూడా ఈ కారు కొనచ్చు.. నిన్న మార్కెట్లోకి వచ్చిన టాటా పంచ్ ఫుల్ డీటెయిల్స్
ఎంతో కాలంగా ఆటోమొబైల్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ చివరకు భారత మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న పాత పంచ్‌కు ఇది ఒక అప్డేటెడ్ వెర్షన్‌గా రావడం వల్ల, లాంచ్‌కు ముందే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేలా, టాటా ఈ మైక్రో SUVను కొత్త మార్పులు, ఆకర్షణీయమైన ధరలతో అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత మోడల్‌తో పోలిస్తే, పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా కొన్ని కీలకమైన మార్పులు చేశారు. దీంతో ఇది మరింత ఫ్రెష్‌గా, ఆధునికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువతతో పాటు కుటుంబ వినియోగదారులను కూడా ఆకట్టుకునేలా టాటా ఈ కారును రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు గురించిన ఇతర వివరాలను ఒకసారి చూద్దాం.
ధరల విషయానికి వస్తే, టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌కు రూ.5.59 లక్షల ప్రారంభ ధరను నిర్ణయించింది. ఇక టాప్ వేరియంట్ ధర రూ.9.29 లక్షల వరకు ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలే కావడం గమనార్హం. ఈ ధర శ్రేణిని పరిశీలిస్తే, బడ్జెట్‌లో మంచి SUV తరహా కారు కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తుందని చెప్పవచ్చు. టాటా ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన బుకింగ్‌లను కూడా ప్రారంభించింది.

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల పరంగా కూడా వినియోగదారులకు విస్తృతమైన ఎంపికలను అందిస్తోంది. ఈ మైక్రో SUV స్మార్ట్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అకంప్లిష్డ్ , అకంప్లిష్డ్ ప్లస్ S వేరియంట్లలో లభిస్తుంది. అవసరాలు, బడ్జెట్‌ను బట్టి సరైన వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం ఉండటంతో, విభిన్న వర్గాల కొనుగోలుదారులను ఇది ఆకట్టుకునేలా ఉంది.
డిజైన్ విషయంలో పంచ్ ఫేస్‌లిఫ్ట్ మరింత ఆకర్షణీయంగా మారింది. రోడ్డుపై చూసిన వెంటనే ఆకర్షించేలా స్టైలిష్ లుక్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో అందించిన LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు, LED ఫాగ్ ల్యాంప్‌లు కారుకు ప్రీమియం ఫీలింగ్‌ను ఇస్తున్నాయి. వెనుక భాగంలో ఉన్న LED టెయిల్ లైట్లు కూడా డిజైన్‌కు మరింత హైలైట్‌గా నిలుస్తాయి. అంతేకాదు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ కారుకు బలమైన SUV స్టాన్స్‌ను అందిస్తున్నాయి.

పవర్‌ట్రెయిన్ పరంగా చూస్తే, మూడు ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, అలాగే 1.2-లీటర్ CNG ఇంజిన్ ఉన్నాయి. దీంతో పనితీరు, ఇంధన సామర్థ్యం, తక్కువ రన్నింగ్ ఖర్చు కోరుకునే వినియోగదారులందరికీ సరైన ఎంపిక. గేర్‌బాక్స్ ఎంపికల విషయానికి వస్తే, ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్, అలాగే 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది
మైలేజ్ విషయంలో కూడా టాటా మంచి సంఖ్యలను ప్రకటిస్తోంది. వేరియంట్, ఇంజిన్‌ను బట్టి, ఈ పంచ్ ఫేస్‌లిఫ్ట్ లీటరుకు సుమారు 19 నుంచి 27 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది. కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్‌లోకి అడుగుపెట్టగానే, ఇది పాత మోడల్‌తో పోలిస్తే ఎంతగా అప్గ్రేడ్ అయిందో వెంటనే అర్థమవుతుంది. అంతర్గత డిజైన్‌ను టాటా చాలా జాగ్రత్తగా రూపొందించింది.

ప్రీమియం టచ్, ఆధునిక లేఅవుట్‌తో ఈ క్యాబిన్ నిజంగా అద్భుతంగా కనిపిస్తుంది.వేరియంట్‌ను బట్టి 8-అంగుళాలు లేదా 10.2-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తుంది. దీనితో పాటు డ్రైవర్ ముందు భాగంలో ఉన్న 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డ్రైవింగ్‌కు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలను స్పష్టంగా చూపిస్తుంది. ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌ను అందించారు.
మరో కీలక విషయం ఏమిటంటే, పూణేలోని టాటా అడ్వాన్స్‌డ్ క్రాష్ టెస్టింగ్ సెంటర్‌లో ఈ కారుకు క్రాష్ టెస్ట్ నిర్వహించారు. పరీక్ష సమయంలో, పంచ్ కారును 50 కి.మీ/గం వేగంతో ఆగి ఉన్న ట్రక్కు ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత ప్యాసింజర్ క్యాబిన్ చెక్కుచెదరకుండా ఉంది. ఇది ఇప్పటికే, భారత్ NCAPలో వయోజన, పిల్లల ప్రయాణీకుల రక్షణ కోసం 5-స్టార్ రేటింగ్‌ను పొందింది.


Click it and Unblock the Notifications








