ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. గెటప్ మార్చి అదిరిపోయే లుక్‌లో వస్తున్న టాటా సుమో
భారత ఆటోమొబైల్ రంగంలో ఒకప్పుడు తిరుగులేని రారాజుగా ఓ వెలుగు వెలిగిన మోడల్ టాటా సుమో (Tata Sumo). ఒక తరం వినియోగదారులను ఎంతగానో అలరించిన ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీని భారతీయులు ఇప్పటికీ మర్చిపోలేరు. ఇటీవల టాటా మోటార్స్ తన పాత ఐకానిక్ మోడల్ సియెర్రా (Sierra)ను కొత్త రూపంలో తీసుకురాబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి, పాత సుమో కూడా తిరిగి వస్తే బాగుంటుందని వాహన ప్రియులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఆటోమొబైల్ డిజైన్ సంస్థ SRK డిజైన్స్ సరికొత్త టాటా సుమో ఎలా ఉండబోతుందో ఊహిస్తూ ఒక కాన్సెప్ట్ రూపాన్ని సృష్టించింది.
సోషల్ మీడియాను ఊపేస్తున్న ఏఐ జనరేటెడ్ వీడియో
సరికొత్త నెక్స్ట్ జనరేషన్ టాటా సుమోకు సంబంధించిన ఒక అద్భుతమైన ఏఐ-జనరేటెడ్ వీడియోను ఎస్‌ఆర్‌కే డిజైన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇది టాటా మోటార్స్ అధికారికంగా విడుదల చేసిన ప్రాజెక్ట్ కానప్పటికీ.. ఒకవేళ భవిష్యత్తులో టాటా గనుక సుమోను తిరిగి మార్కెట్లోకి తెస్తే దాని లుక్ ఎంత అదిరిపోతుందో ఈ డిజైన్ కళ్లకు కట్టింది. పాత సుమోకు గుర్తింపుగా నిలిచిన క్లాసిక్ బాక్సీ డిజైన్ (ఫ్లాట్ రూఫ్)ను అలాగే ఉంచుతూ, దానికి నేటి తరం సరిపోయేలా సరికొత్త మోడరన్ లుక్‌ను అప్లై చేశారు.

అదరగొడుతున్న మోడరన్ డిజైన్ ఎలిమెంట్స్
ఈ కొత్త డిజైన్ లో కారు ముందు భాగం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. పల్చటి ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు (DRLs) ఒక పొడవైన స్టైలిష్ లైట్ బార్‌తో కనెక్ట్ అయి ఉన్నాయి. మధ్యలో పెద్ద గ్రిల్, టాటా అధికారిక లోగో హైలైట్‌గా నిలిచాయి. కారు కింద భాగంలో అమర్చిన సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో కూడిన రగ్గడ్ బంపర్ దీనికి మరింత రఫ్ అండ్ టఫ్ లుక్‌ను ఇచ్చింది. సైడ్ ప్రొఫైల్ చూస్తే పెద్ద అల్లాయ్ వీల్స్, వెడల్పైన వీల్ ఆర్చ్‌లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ , భారీ బాడీ క్లాడింగ్‌తో కారు ఎంతో మస్కులర్‌గా, ప్రీమియంగా కనిపిస్తోంది.
పాత మోడల్‌కు, కొత్త కాన్సెప్ట్‌కు తేడా ఇదే
ఒకప్పుడు మార్కెట్లో ఉన్న సుమో గోల్డ్ (Sumo Gold) మోడల్‌తో పోల్చితే ఈ కొత్త డిజైన్ లో చాలా పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. పాత సుమోను కేవలం పెద్ద కుటుంబాల ప్రయాణాల కోసం, కమర్షియల్ అవసరాల కోసం పటిష్టమైన బాడీ, ఎక్కువ స్పేస్ లక్ష్యంగా తయారు చేశారు. కానీ, ఈ కొత్త ఏఐ రెండర్ మాత్రం నేటి తరం లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీలా కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర ఆధునిక బాడీ-ఆన్-ఫ్రేమ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. పాత సుమో రఫ్ అండ్ టఫ్ నైజాన్ని కోల్పోకుండానే టాటా సరికొత్త కార్ల తరహాలో దీనిని డిజైన్ చేశారు.

సరికొత్త టర్బో లేదా హైబ్రిడ్ ఇంజిన్‌తో వచ్చే ఛాన్స్
గతంలో టాటా సుమో కారు 2.0-లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్, 2.0-లీటర్ TDi టర్బోచార్జ్డ్ ఇంజిన్, 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్ వంటి రకరకాల ఆప్షన్లతో వచ్చేది. అయితే ఈ కొత్త కాన్సెప్ట్ మోడల్ ఇంజిన్ వివరాల గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. ఒకవేళ టాటా మోటార్స్ నిజంగానే సుమోను రీలాంచ్ చేయాలని భావిస్తే మాత్రం ఇందులో సరికొత్త మోడరన్ టర్బో డీజిల్ లేదా మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లను ఇచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త లుక్ గనుక నిజమైతే మార్కెట్లో టాటా హవా మరింత పెరగడం ఖాయం.


Click it and Unblock the Notifications