పెద్ద ఫ్యామిలీ ఉన్న మిడిల్ క్లాస్ వాళ్లకు తక్కువ ధరలో పెద్దకారు.. ఇక షోరూంల ముందు భారీ క్యూలు ఖాయం
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఫ్యామిలీ కార్లకు ముఖ్యంగా 7 సీటర్ కార్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు ఈ విభాగంలో మారుతీ సుజుకీ ఎర్టిగా రారాజుగా వెలుగుతోంది. అయితే మారుతీ ఏకఛత్రాధిపత్యానికి చరమగీతం పాడేందుకు జపాన్ కార్ల దిగ్గజం నిస్సాన్ (Nissan) సిద్ధమైంది. అత్యంత చౌక ధరలో, అదిరిపోయే ఫీచర్లతో నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite) పేరుతో సరికొత్త 7 సీటర్ ఎంబీవీ (MPV) కారును మార్కెట్లోకి దించుతోంది. ఈ కారు రాకతో మధ్యతరగతి ప్రజల సొంత కారు కల చాలా తక్కువ ధరలోనే నెరవేరబోతోంది.
భారత మార్కెట్లో నిస్సాన్ సంస్థ తన పట్టును పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెనాల్ట్-నిస్సాన్ కూటమిలో భాగంగా ఉన్న రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) కారు ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

అదే ట్రైబర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఇప్పుడు నిస్సాన్ గ్రావైట్‌ను రూపొందించింది. నిజానికి ఈ కారు జనవరి 21నే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అయితే నిస్సాన్ అభిమానులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి నెలలోనే ఈ కారును అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది.
నిస్సాన్ ఇండియా తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేసిన తాజా వీడియో ప్రకారం.. ఈ గ్రావైట్ కారు మొత్తం ఐదు అద్భుతమైన రంగుల్లో లభ్యం కానుంది. ఇందులో ప్రత్యేకంగా నిలిచే టీల్ కలర్‌తో పాటు వైట్, సిల్వర్, బ్లాక్, గ్రే రంగుల్లో ఈ కారు కనువిందు చేయనుంది. లుక్ పరంగా ఇది ట్రైబర్ కంటే కొంత భిన్నంగా, నిస్సాన్ సిగ్నేచర్ గ్రిల్, స్టైలిష్ ఎల్ఈడీ లైట్లతో ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. తక్కువ ధరలో లగ్జరీ లుక్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

ఇక ఇంజిన్, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది సిటీ డ్రైవింగ్‌కు, ఫ్యామిలీ ట్రిప్పులకు సరిగ్గా సరిపోతుంది. వినియోగదారుల సౌకర్యార్థం ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఏఎంటీ (AMT) ఆప్షన్ కూడా అందుబాటులో ఉండనుంది.
ఫీచర్ల పరంగా నిస్సాన్ ఎక్కడా రాజీ పడలేదు. 20.32 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 17.78 సెంటీమీటర్ల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

సేఫ్టీ విషయంలో కూడా నిస్సాన్ గ్రావైట్ టాప్ క్లాస్‌లో నిలవనుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి.
పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్ వంటి ఫీచర్లు సామాన్యుడికి కూడా పూర్తి భద్రతను ఇస్తాయి. మారుతీ ఎర్టిగా ధర దాదాపు 9 లక్షల నుంచి ప్రారంభమవుతుంటే, నిస్సాన్ గ్రావైట్ ధర కేవలం రూ.5.75 లక్షల నుంచి రూ.6 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుందని సమాచారం. ఇదే నిజమైతే, ఎర్టిగా అమ్మకాలకు గండి పడటం ఖాయం.
నిస్సాన్ ప్లాన్స్ కేవలం గ్రావైట్ తోనే ఆగిపోలేదు. ఫిబ్రవరి 4వ తేదీన నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton) అనే సరికొత్త ఎస్‌యూవీని కూడా కంపెనీ లాంచ్ చేయబోతోంది. ఇది నిన్ననే విడుదలైన కొత్త తరం రెనాల్ట్ డస్టర్ ఆధారంగా రూపొందించబడింది.
అంతేకాకుండా 2027 నాటికి ఇదే టెక్టాన్ ఆధారంగా మరో పవర్ఫుల్ 7 సీటర్ ఎస్‌యూవీని కూడా తీసుకురావడానికి నిస్సాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తానికి నిస్సాన్ రాబోయే రోజుల్లో భారత ఆటోమొబైల్ మార్కెట్ గతిని మార్చేలా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








