రేపే మార్కెట్లోకి రూ.6లక్షల 7 సీటర్ కారు..ఇక పెద్ద ఫ్యామిలీలంతా షోరూంల ముందు క్యూ కట్టాల్సిందే
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కలల కారుగా మారబోతున్న నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite) ఎట్టకేలకు రేపు (ఫిబ్రవరి 17) అట్టహాసంగా విడుదల కాబోతోంది. 7 సీటర్ కార్ల విభాగంలో ఇప్పటి వరకు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న మహీంద్రా బొలెరో, మారుతీ సుజుకీ ఎర్టిగా వంటి కార్లకు ఇది గట్టి సవాల్ విసరబోతోంది. ముఖ్యంగా బొలెరో కంటే దాదాపు రూ.2 లక్షల తక్కువ ధరకే ఇది లభించనుండటం ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి నిస్సాన్ గ్రావైట్ గత నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కంపెనీ దీని విడుదలను వాయిదా వేసింది. నిస్సాన్ సంస్థ నుండి వస్తున్న ఈ బడ్జెట్ 7 సీటర్ కారు కోసం వేల సంఖ్యలో కస్టమర్లు వేచి చూస్తున్నారు. రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించబడిన ఈ కారు, అతి తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణించే సౌకర్యాన్ని అందించనుంది.

రేపు జరగబోయే ఈ లాంచ్ ఈవెంట్ ద్వారా ఈ కారు పూర్తి ధరలు, వేరియంట్ల వివరాలు అధికారికంగా బయటకు రానున్నాయి. ఈ కారు రూపకల్పనలో నిస్సాన్ తన సిగ్నేచర్ V-మోషన్ గ్రిల్‌ను ఉపయోగించి, కారుకు మరింత ప్రీమియం, మజిల్ లుక్‌ను అందించింది.
నిస్సాన్ గ్రావైట్ ప్రధానంగా రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లతో రాబోతోంది.
1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్: ఇది సిటీ డ్రైవింగ్ కు, మైలేజీ కోరుకునే వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది దాదాపు 72hp పవర్, 96Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్: కొంచెం ఎక్కువ పవర్,హైవే డ్రైవింగ్ ఇష్టపడే వారి కోసం ఈ ఇంజిన్ ను రూపొందించారు.
వీటితో పాటు మేన్యువల్ గేర్‌బాక్స్ తో పాటు సౌకర్యవంతమైన AMT ఆప్షన్ కూడా ఉండబోతోంది. మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో కూడిన మెయింటెనెన్స్, మంచి మైలేజీని ఈ కారు అందిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, భవిష్యత్తులో డీలర్-ఫిట్టెడ్ CNG ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
బడ్జెట్ కారు కదా అని నిస్సాన్ సేఫ్టీ విషయంలో అస్సలు వెనక్కి తగ్గలేదు. అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగులను ప్రామాణికంగా (Standard) ఇస్తుండటం విశేషం. దీనివల్ల కారు ధర తక్కువగా ఉన్నప్పటికీ, ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. వీటితో పాటు ఏబీఎస్ (ABS) విత్ ఈబీడీ (EBD), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్ , టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇలాంటి ప్రీమియం సేఫ్టీ ఫీచర్లు బొలెరో వంటి కార్లలో కూడా కనిపించవు. కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి ఇది అత్యంత సురక్షితమైన ఎంపిక కానుంది. కారు లోపల అడుగుపెడితే ఇది బడ్జెట్ కారు అనే విషయం మర్చిపోయేలా నిస్సాన్ దీనిని తీర్చిదిద్దింది. ఇంటీరియర్ పరంగా కూడా చాలా మార్పులు చేసింది.
8-అంగుళాల (20.32 సెం.మీ) టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ. కారులోని మూడు వరుసల సీట్లలోనూ ఏసీ వెంట్లను ఇచ్చారు, దీనివల్ల వేసవిలో కూడా చివరి సీటులో కూర్చున్న వారికి ఇబ్బంది ఉండదు.
వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు దీనిని మోడరన్ కారుగా నిలబెడుతున్నాయి. లోపలి భాగం పూర్తిగా బ్లాక్,బేజ్ కలర్ కాంబినేషన్ లో రిచ్ గా కనిపిస్తుంది.
ముందే చెప్పుకున్నట్లుగా నిస్సాన్ గ్రావైట్ ప్రధాన ఆకర్షణ దీని ధరే. మహీంద్రా బొలెరో బేస్ ధర దాదాపు రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంటే, నిస్సాన్ గ్రావైట్ బేస్ వేరియంట్ కేవలం రూ.5.75 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. టాప్ వేరియంట్ ధర కూడా రూ.9 లక్షల లోపే ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. మారుతీ ఎర్టిగా బేస్ ధర రూ.8.80 లక్షలుగా ఉన్న నేపథ్యంలో, ఎర్టిగా కంటే దాదాపు రూ.3 లక్షల తక్కువ ధరలో 7 సీటర్ కారు కావాలనుకునే వారికి గ్రావైట్ ఒక వరం లాంటిది.
తక్కువ బడ్జెట్ లో ఎక్కువ మంది అంటే ఏడుగురు ప్రయాణించగలిగే కారు కావాలనుకునే వారికి, ఎక్కువ లగేజీ తీసుకెళ్లే అవసరం ఉన్నవారికి నిస్సాన్ గ్రావైట్ సరైన ఎంపిక. దీని వెనుక సీట్లను అవసరాన్ని బట్టి పూర్తిగా మడిచి పెట్టుకోవచ్చు లేదా తొలగించవచ్చు, దీనివల్ల భారీ లగేజీని కూడా సులభంగా తరలించవచ్చు. సేఫ్టీ, టెక్నాలజీ, బడ్జెట్.. ఈ మూడింటి కలయికతో వస్తున్న గ్రావైట్, రేపు మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.


Click it and Unblock the Notifications








