ఏకంగా 10 ఏళ్ల వారంటీ.. రూపాయి ఖర్చు లేని ఫ్రీ సర్వీస్...నిసాన్ గ్రావైట్ కొంటే అదృష్టవంతులే
జపనీస్ దిగ్గజం నిసాన్ మోటార్స్, భారతీయ మధ్యతరగతి కుటుంబాల కోసం ఒక అద్భుతమైన వరాన్ని ప్రకటించింది. బడ్జెట్ ధరలో లభించే సరికొత్త 7-సీటర్ ఎమ్‌పీవీ (MPV) నిసాన్ గ్రావైట్ (Nissan Gravite)ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం తక్కువ ధరకే కారును అందించడమే కాకుండా, కారు కొన్న తర్వాత సర్వీస్ ఖర్చులు భరించలేక ఇబ్బంది పడే సామాన్యుల కోసం జీరో మెయింటెనెన్స్ ప్లాన్‌ను కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
మారుతి సుజుకి ఎర్టిగా, కియా కారెన్స్ వంటి భారీ కార్లు కొనడానికి బడ్జెట్ లేని వారిని లక్ష్యంగా చేసుకుని నిసాన్ ఈ గ్రావైట్‌ను రూపొందించింది. ఇది ఇప్పటికే మార్కెట్లో సక్సెస్ అయిన రెనో ట్రైబర్ ప్లాట్‌ఫామ్‌పైనే ఆధారపడి వచ్చినప్పటికీ, నిసాన్ తనదైన శైలిలో అదిరిపోయే డిజైన్, మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లతో దీనిని ముస్తాబు చేసింది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు ఒకేసారి ఏడుగురు ప్రయాణించే వీలు కలగడమే కాకుండా, నిర్వహణ భారం కూడా లేకుండా పోయింది.

ఈ కారు కొనుగోలు చేసే మొదటి 5,000 మంది కస్టమర్లకు నిసాన్ ఒక బంపర్ ఆఫర్ ఇస్తోంది. వచ్చే ఐదేళ్ల వరకు కారు సర్వీసింగ్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనక్కర్లేదు. అంటే ఐదేళ్ల పాటు ఉచిత సర్వీస్, ఆయిల్ మార్పు వంటి అన్నీ కంపెనీయే చూసుకుంటుంది. ఈ 5,000 మంది తర్వాత కారు కొనేవారి కోసం కూడా తక్కువ ధరకే 5 ఏళ్లు లేదా 50 వేల కిలోమీటర్ల వరకు మెయింటెనెన్స్ ప్యాకేజీలను అందిస్తోంది. దీనివల్ల కారు మెయింటెనెన్స్‌పై స్పష్టమైన అవగాహన, భరోసా కస్టమర్లకు లభిస్తుంది.
వారంటీ విషయంలో కూడా నిసాన్ రికార్డు సృష్టించింది. సాధారణంగా కార్లకు 3 ఏళ్ల వారంటీ ఉంటుంది. కానీ నిసాన్ గ్రావైట్ కొనేవారికి ఏకంగా 10 ఏళ్ల వారంటీ లేదా 2 లక్షల కిలోమీటర్ల వరకు పరిరక్షణ లభించనుంది. ఇందులో 3 ఏళ్ల స్టాండర్డ్ వారంటీతో పాటు, అదనంగా మరో 7 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీని కంపెనీ అందిస్తోంది. అంటే కారు కొన్న తర్వాత దశాబ్ద కాలం పాటు ఇంజిన్ లేదా ఇతర మెకానికల్ సమస్యల గురించి చింతించాల్సిన అవసరం లేదన్నమాట. ఇలాంటి ఆఫర్ ఇండియాలో మరే ఇతర కారుపై లేదని చెప్పొచ్చు.

నిసాన్ గ్రావైట్ లుక్ విషయానికి వస్తే, ఇది చాలా మోడ్రన్‌గా ఉంటుంది. ముందు భాగంలో C ఆకారంలో ఉండే ఎల్‌ఈడీ (LED) లైట్లు, గ్లోసీ బ్లాక్ గ్రిల్, రూఫ్ రైల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. అడవుల్లో తిరిగేందుకు అనువైన ఫారెస్ట్ గ్రీన్‌తో పాటు బ్లాక్, సిల్వర్, వైట్, గ్రే వంటి 5 రకాల కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తోంది. ఇక లోపల స్పేస్ గురించి చెప్పాలంటే.. ఇది నిజంగా ఒక మ్యాజిక్ కారు. అవసరమైనప్పుడు ఏడుగురు కూర్చోవచ్చు, లేదంటే మూడో వరుస సీట్లను పూర్తిగా తీసేసి పెద్ద సామాను పెట్టుకోవడానికి డిక్కీలా మార్చుకోవచ్చు.
ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 72 bhp పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మరీ భారీ ఇంజిన్ కాకపోయినా, ఒక ఫ్యామిలీకి సరిపడా పర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది. మైలేజీ విషయంలో కూడా ఇది చాలా పొదుపైనది. మాన్యువల్ వేరియంట్ 19.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, ఆటోమేటిక్ (AMT) వేరియంట్ 19.6 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఫీచర్ల పరంగా అన్ని వరుసల్లో ఏసీ వెెంట్స్, స్మార్ట్ స్టోరేజ్ ఏరియాలు, సౌకర్యవంతమైన సీట్లు ఉన్నాయి.

మొత్తానికి, తక్కువ ధరలో మంచి మైలేజ్, పది ఏళ్ల వారంటీ, ఉచిత సర్వీసింగ్ కోరుకునే వారికి నిసాన్ గ్రావైట్ ఒక అద్భుతమైన వరం. ప్రస్తుతం ఎర్టిగా వంటి కార్ల అమ్మకాలకు ఇది గట్టి పోటీనిచ్చే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








