రూ.6 లక్షల్లోపు కార్లు.. రెండు కుటుంబాలు కూర్చోవచ్చు! జాతర్లు, టూర్లు, ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్లు
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ భారతీయ మార్కెట్లో కొత్తగా గ్రావైట్ పేరుతో ఒక ఎంవీపీని పరిచయం చేసింది. ఈ మోడల్ ప్రముఖ ఫ్రెంచ్ బ్రాండ్ రెనాల్ట్ తయారు చేసిన ట్రైబర్ ఆధారంగా అభివృద్ధి చేయబడింది. రెండు వాహనాలు ఒకే ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైనప్పటికీ, డిజైన్, ఫీచర్లు, బ్రాండింగ్, కొంతవరకు డ్రైవింగ్ అనుభవంలో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. గ్రావైట్‌లో ముందు భాగం పూర్తిగా కొత్త స్టైల్‌తో రూపొందించబడింది. కుటుంబాలకు తక్కువ ధరలో 7-సీటర్ ఎంపిక కావాలనుకునేవారికి ఇవి మంచి ఆప్షన్లుగా నిలవవచ్చు. వీటి గురించిన వివరాల గురించి ఈ కథణంలో చూద్దాం.
నిస్సాన్ అందిస్తున్న గ్రావైట్ ఎంవీపీ, రూపకల్పన పరంగా రెనాల్ట్ ట్రైబర్‌ను గుర్తు చేస్తుంది. రెండు వాహనాలు ఒకే ప్లాట్‌ఫామ్‌ను పంచుకోవడం వల్ల పరిమాణం, సీటింగ్ లేఅవుట్, కొన్ని ఫీచర్లలో సామాన్యతలు కనిపిస్తాయి. అయితే, అసలు తేడా స్టైలింగ్‌లోనే స్పష్టంగా బయటపడుతుంది. ముఖ్యంగా ముందు భాగంలో గ్రావైట్ పూర్తిగా భిన్నమైన లుక్‌తో వస్తుంది. నిస్సాన్‌కు ప్రత్యేకమైన గ్రిల్ డిజైన్, కొత్త DRL లైటింగ్ సెటప్ దీనికి మరింత ప్రీమియం ఫీల్ ఇస్తాయి.

బానెట్‌పై పెద్ద అక్షరాలతో బ్రాండింగ్ ఎలిమెంట్స్ ఇవ్వడంతో మస్క్యులర్ అపీలును పెంచారు. బంపర్‌లో C-ఆకారపు లైట్లు జోడించడంతో ఇది ట్రైబర్‌తో పోలిస్తే మోడర్న్‌గా కనిపిస్తుంది. వీల్ డిజైన్ ప్రత్యేకంగా రూపొందించబడింది. అలాయ్ వీల్స్‌కు వేరే స్టైల్ ఇవ్వడం ద్వారా సైడ్ ప్రొఫైల్‌లో స్పోర్టీ టచ్ అందించారు. వెనుక భాగం విషయానికి వస్తే, ముందు భాగంలో ఉన్నంత పెద్ద మార్పులు లేకపోయినా, టెయిల్ ల్యాంప్ గ్రాఫిక్స్, బంపర్ డిజైన్‌లో తేడాలు ఉన్నాయి.
వెనుక లుక్ ట్రైబర్‌ను గుర్తు చేసినప్పటికీ, గ్రావైట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండేలా డిజైన్ చేశారు. ఇంకో ముఖ్యమైన అంశం కలర్ ఆప్షన్స్. నిస్సాన్ గ్రావైట్ ఫారెస్ట్ గ్రీన్, ఆంగ్సి బ్లాక్, బ్లేడ్ సిల్వర్, మెటాలిక్ గ్రే, స్నో వైట్ ఆకట్టుకునే రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ కలర్స్ వలన కారు మరింత ప్రీమియం, ఫ్రెష్ లుక్‌ను అందిస్తోంది. ఇంటీరియర్ విషయానికి వస్తే, గ్రావైట్‌లో లేఅవుట్ రెనాల్ట్ ట్రైబర్‌ను పోలి ఉంటుంది.

డ్యాష్‌బోర్డ్ డిజైన్, సెంటర్ కన్సోల్, ఇన్ఫోటైన్‌మెంట్ ప్లేస్‌మెంట్ అంశాలు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ, నిస్సాన్ లోగో, చిన్న డిజైన్ మార్పులు మాత్రమే భిన్నంగా కనిపిస్తాయి. ట్రిమ్ ఫినిష్, సీటు అప్హోల్స్టరీ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసి, గ్రావైట్‌కు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి ప్రయత్నించారు. సీటింగ్ అమరికలు కూడా ట్రైబర్ తరహాలోనే ఉంటాయి. ఇది నాలుగు మీటర్ల లోపు పొడవు కలిగిన వాహనమైనప్పటికీ, అంతర్గత స్థల వినియోగం చాలా సమర్థవంతంగా ఉంది.
ముందు, రెండో వరుస ప్రయాణికులకు సరిపడ లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ లభిస్తుంది. మూడో వరుస సీట్లు పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ, చిన్నపిల్లలు లేదా తక్కువ ఎత్తు ఉన్న పెద్దలకు ఉపయోగపడేలా డిజైన్ చేశారు. ఈ సెగ్మెంట్‌లో నాలుగు మీటర్ల లోపు కార్లలో ఇంత స్పేస్ ఇవ్వడం గ్రావైట్‌కు ఒక ప్లస్ పాయింట్‌గా చెప్పవచ్చు. అయితే, అన్ని మూడు వరుసల సీట్లు ఉపయోగిస్తున్నప్పుడు బూట్ స్పేస్ కొంచెం పరిమితంగానే ఉంటుంది.

లగేజ్ కోసం ఎక్కువ స్థలం కావాలంటే మూడో వరుస సీట్లను మడిచే అవకాశం ఉండటం వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. ఇంజిన్ విషయానికి వస్తే, Renault Triberలో ఉపయోగిస్తున్న అదే 1.0-లీటర్ మూడు సిలిండర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను Nissan గ్రావైట్‌లో కూడా అందిస్తున్నారు. ఈ ఇంజిన్ 72 హెచ్‌పీ శక్తిని, 96 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
గ్రావైట్ ధర ట్రైబర్‌తో పోలిస్తే సుమారు రూ. 10,000 వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే, ఇంజిన్, పనితీరు పరంగా రెండు కార్లు దాదాపు సమానంగా ఉన్నప్పటికీ, ధరలో ఉండే స్వల్ప తేడా, బ్రాండ్ ఎంపిక కొనుగోలుదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేసే అంశాలుగా నిలుస్తాయి.


Click it and Unblock the Notifications








