ఫ్రిజ్, బెడ్, మసాజ్ సీట్లు.. ఈ కారే లగ్జరీ హోటల్.. ఒక్కసారి ఛార్జ్ పెడితే 1450 కి.మీ రేంజ్
ఆటోమొబైల్ ప్రపంచంలో నిస్సాన్ సంస్థ సరికొత్త సంచలనాన్ని క్రియేట్ చేసింది. కేవలం 30 నిమిషాల్లోనే 8,000 బుకింగ్స్ సాధించిందంటే ఈ కారు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిస్సాన్ NX8 పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (SUV), ఫీచర్ల పరంగా లగ్జరీ కార్లకు గట్టి పోటీని ఇస్తోంది. ముఖ్యంగా దీని రేంజ్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 1,450 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే మన హైదరాబాద్ నుంచి బయలుదేరితే నార్త్ ఇండియాలోని లఖ్‌నవూ లేదా పాట్నా వరకు అస్సలు ఆగకుండా వెళ్ళిపోవచ్చు.
నిస్సాన్ NX8 కారులో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ దాని రేంజ్. ఇది రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఒకటి ప్యూర్ ఎలక్ట్రిక్ (BEV), రెండోది ఎక్స్‌టెండెడ్ రేంజ్ ఎలక్ట్రిక్ వెహికల్ (EREV). EREV వెర్షన్ ఏకంగా 1,450 కిలోమీటర్ల కంబైన్డ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తోంది. మన హైదరాబాద్ నుంచి లఖ్‌నవూ (సుమారు 1,400 కిమీ) లేదా ఒడిశాలోని భువనేశ్వర్ (సుమారు 1,100 కిమీ) వంటి నగరాలకు ఒక్కసారి కూడా ఆపకుండా చేరుకోవచ్చన్నమాట. ఈ రేంజ్ కారణంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మిగిలిన ఎలక్ట్రిక్ కార్ల కంటే ఇది చాలా ముందు వరుసలో నిలిచింది.

ఈ కారు ఇంటీరియర్ చూస్తే మనం ఏదైనా విమానంలోని బిజినెస్ క్లాస్ లో కూర్చున్నామా అన్నట్లు ఉంటుంది. ఇందులో రెండు 15.6 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లు, ఒక డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. జీరో గ్రావిటీ సీట్లు ఈ కారు ప్రత్యేకత. లాంగ్ జర్నీలో అలసిపోకుండా ఉండటానికి సీట్లలో మసాజ్, హీటింగ్, వెంటిలేషన్ ఫీచర్లు ఇచ్చారు. అంతేకాదు, ఫ్రంట్ సీట్లను వెనక్కి వాల్చి ఒక లాంజ్ లాగా మార్చుకోవచ్చు. అంటే ప్రయాణంలో హాయిగా పడుకుని వెళ్లొచ్చు. కారులోనే ఒక చిన్న ఫ్రిజ్ కూడా ఉండటంతో వేసవిలో చల్లటి డ్రింక్స్ ను ఎంజాయ్ చేయొచ్చు.
టెక్నాలజీ పరంగా నిస్సాన్ NX8 అగ్రస్థానంలో ఉంది. ఇందులో 25 స్పీకర్ల భారీ ఆడియో సిస్టమ్ ఉంది, ఇది మీకు థియేటర్ అనుభూతిని ఇస్తుంది. కారు మొత్తం 4 జోన్లలో AI బేస్డ్ వాయిస్ కంట్రోల్ తో పనిచేస్తుంది. అంటే కారులో ఏ మూలన కూర్చున్న వారైనా వాయిస్ కమాండ్ ద్వారా కారులోని ఫీచర్లను నియంత్రించవచ్చు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8295P చిప్‌సెట్‌తో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఏమాత్రం ల్యాగ్ లేకుండా అత్యంత వేగంగా స్పందిస్తుంది. ఇందులో హెడ్-అప్ డిస్‌ప్లే కూడా ఉంది, ఇది డ్రైవర్‌కు రోడ్డు మీద నుంచి దృష్టి మళ్ళించకుండా సమాచారాన్ని అందిస్తుంది.

నిస్సాన్ NX8 ప్యూర్ ఎలక్ట్రిక్ వెర్షన్ 650 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని బ్యాటరీని కేవలం 12 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. దీని మోటార్లు 288 hp నుంచి 335 hp వరకు పవర్ ను జనరేట్ చేస్తాయి. అంటే కేవలం లగ్జరీ మాత్రమే కాదు, వేగంలో కూడా ఇది తగ్గేదేలే అంటోంది. రక్షణ పరంగా చూస్తే ఇందులో 29 సెన్సార్లు, LiDAR టెక్నాలజీతో కూడిన అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఉంది. ఇది రోడ్డుపై ఉన్న అడ్డంకులను గుర్తించి డ్రైవర్ ను అప్రమత్తం చేయడమే కాకుండా, అవసరమైనప్పుడు ఆటోమేటిక్ గా బ్రేకులు వేస్తుంది.
నిస్సాన్ NX8 ధర చైనా మార్కెట్లో సుమారు 1.50 లక్షల యువాన్ల నుంచి ప్రారంభమవుతుంది (మన కరెన్సీలో సుమారు రూ.20.53 లక్షలు). టాప్ మోడల్ ధర రూ.28.70 లక్షల వరకు ఉంది. ఈ ఫీచర్లకు ఈ ధర చాలా తక్కువని భావిస్తున్న కస్టమర్లు బుకింగ్స్ కోసం ఎగబడుతున్నారు. బుకింగ్స్ ప్రారంభమైన మొదటి 30 నిమిషాల్లోనే 8,000 యూనిట్లు బుక్ అయ్యాయంటే దీని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అతి త్వరలో భారత్ లో కూడా నిస్సాన్ ఈ మోడల్ ను లాంచ్ చేసే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు.



Click it and Unblock the Notifications








