చార్జ్ టెన్షన్ లేదు.. పెట్రోల్ ఖర్చు జీరో.. 2026లో మార్కెట్‌ను షేక్ చేయబోతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు
భారత ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం ఎలక్ట్రిక్ విప్లవం వైపు వేగంగా పరుగులు తీస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల మంటల నుంచి తప్పించుకోవాలనుకునే వారికి 2026 ఏడాది ఒక సువర్ణావకాశం కాబోతోంది. టాటా మోటార్స్, టయోటా, కియా వంటి దిగ్గజ సంస్థలు సరికొత్త ఈవీ (EV) మోడళ్లను మార్కెట్లోకి వదిలేందుకు సిద్ధమయ్యాయి. మధ్యతరగతి నుంచి లగ్జరీ ప్రియుల వరకు అందరినీ ఆకట్టుకునేలా రాబోతున్న ఆ 5 పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ కార్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
1. టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV):
ఒకప్పుడు భారత రోడ్లను ఏలిన ఐకానిక్ కారు సియెర్రా ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో రాబోతోంది. టాటా మోటార్స్ ఈ కారును కేవలం ఎలక్ట్రిక్ మోడల్ లోనే కాకుండా, 4x4 డ్రైవ్ ట్రైన్‌తో తీసుకురానుంది. అంటే కొండలు, కోనల్లో కూడా ఈ ఈవీ సులభంగా దూసుకుపోతుంది. ఇందులో 55kWh, 65kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉండే అవకాశం ఉంది. ఇది కర్వ్ ఈవీ, హారియర్ ఈవీల మధ్య రేంజ్‌లో నిలవనుంది. లోపల విలాసవంతమైన ఇంటీరియర్స్, అదిరిపోయే డిజైన్‌తో పాత సియెర్రా ప్రేమికులను ఇది ఫిదా చేయడం ఖాయం.

2. టాటా సఫారి ఈవీ (Tata Safari EV):
టాటా ఈవీ విభాగంలో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కారుగా సఫారి ఈవీ నిలవనుంది. మూడు వరుసల సీటింగ్ (7 సీటర్) తో రాబోతున్న ఈ కారు మహీంద్రా XEV 9S కు గట్టి పోటీనిస్తుంది. హారియర్ ఈవీ కంటే ఎక్కువ పవర్, ఎక్కువ రేంజ్ ఇచ్చేలా దీనిని రూపొందిస్తున్నారు. లాంగ్ జర్నీలకు, పెద్ద కుటుంబాలకు ఈ కారు ఒక సరైన ఎంపికగా మారుతుంది. హైవేలపై కూడా ఈ కారు పర్ఫార్మెన్స్ అదిరిపోతుందని కంపెనీ వర్గాలు అంటున్నాయి.

3. టయోటా ఎబెల్లా (Toyota Ebella):
టయోటా సంస్థ భారత్ లో తన తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాను 2026లో లాంచ్ చేయనుంది. ఇది మారుతి ఇ విటారా (e Vitara) ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారవుతున్నప్పటికీ, టయోటా స్టైల్ కు తగ్గట్టుగా ముందు, వెనుక భాగాల్లో భారీ మార్పులు చేశారు.
ఇందులో 49kWh, 61kWh బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. టయోటా బ్రాండ్ వాల్యూ, మారుతి సర్వీస్ నెట్‌వర్క్ కలసి ఈ కారును సూపర్ హిట్ చేసేలా ఉన్నాయి.

4. కియా సైరోస్ ఈవీ (Kia Syros EV):
కియా సంస్థ తన కొత్త ఈవీ సైరోస్‌ను జూలై 2026లో భారత్ లో ప్రదర్శించనుంది. ఇది చూడటానికి హ్యుందాయ్ ఇన్‌స్టర్ (Inster EV)ను పోలి ఉన్నప్పటికీ, కియా తనదైన సిగ్నేచర్ స్టైల్ ను ఇందులో జోడించింది. ఇందులో 42kWh, 49kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండవచ్చు. కియా కార్లలో ఉండే అత్యాధునిక ఫీచర్లు, వెరైటీ లుక్స్ ఈ సైరోస్ ఈవీలో కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా యువతను, టెక్నాలజీని ఇష్టపడే వారిని ఈ కారు ఎక్కువగా ఆకర్షిస్తుంది.
5. విన్‌ఫాస్ట్ విఎఫ్ 3 (Vinfast VF 3):
వియత్నాంకు చెందిన ఈవీ దిగ్గజం విన్‌ఫాస్ట్ భారత్ లో రూ.10 లక్షల కంటే తక్కువ ధరలోనే VF 3 అనే హ్యాచ్‌బ్యాక్ ను తీసుకురాబోతోంది. ఇది ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV) కి నేరుగా పోటీనిస్తుంది. కామెట్ కంటే పెద్ద బ్యాటరీ (18.64kWh), వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయం ఇందులో ఉండటం విశేషం. కేవలం 36 నిమిషాల్లోనే 10 నుంచి 70 శాతం ఛార్జింగ్ ఎక్కుతుంది. సిటీల్లో తిరగడానికి, ఆఫీస్ అవసరాలకు తక్కువ బడ్జెట్ లో లోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.


Click it and Unblock the Notifications