డబ్బున్నోళ్ల కొత్త ఆటబొమ్మ.. రోడ్డుపై రాకెట్‌లా దూసుకెళ్లే కారు.. స్పోర్ట్స్ కార్లకు బాస్ వచ్చేశాడు!
ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ కార్ల అభిమానుల కలల కార్లలో ఒకటిగా గుర్తింపు పొందిన పోర్షే 911 GT3 ఇప్పుడు భారత మార్కెట్లో అధికారికంగా అడుగుపెట్టింది. 2026 మోడల్ ఇయర్‌కు చెందిన అప్‌డేట్ చేసిన 911 GT3ను భారతీయ కస్టమర్ల కోసం విడుదల చేసింది. ట్రాక్‌పై అసాధారణ పనితీరును అందించడమే కాకుండా, రోడ్డుపై కూడా అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందించే ఈ సూపర్‌కార్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమాన గణాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు అదే కారు అత్యాధునిక సాంకేతికతలు, మెరుగైన ఏరోడైనమిక్స్, మరింత పదునైన పనితీరుతో భారత మార్కెట్లోకి రావడం స్పోర్ట్స్ కార్ ప్రేమికులకు పెద్ద శుభవార్తగా మారింది. భారతదేశంలో ఈ సూపర్‌కార్‌ను పోర్షే రూ.3.33 కోట్ల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది.
ధర భారీగా ఉన్నప్పటికీ, కారు అందించే పనితీరు, ఇంజినీరింగ్ నైపుణ్యం, ప్రత్యేకత కారణంగా ఇప్పటికే ఆటోమొబైల్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. కంపెనీ ఈ మోడల్‌కు బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే అవకాశముండటంతో, ఈ కారు కోసం ఆసక్తి చూపుతున్న వారు ముందుగానే బుకింగ్‌లు చేసుకునే అవకాశముంది. డిజైన్ విషయానికి వస్తే, కొత్త 911 GT3 తన స్పోర్టీ మరియు అగ్రెసివ్ లుక్‌తో మొదటి చూపులోనే ఆకట్టుకుంటుంది.

పోర్షే 911 కారెరాలో కనిపించే అనేక డిజైన్ అంశాలను ఈ మోడల్‌లో కూడా అందించినప్పటికీ, GT3కు ప్రత్యేక గుర్తింపునిచ్చే పలు మార్పులు ఇందులో కనిపిస్తాయి. ముందు భాగంలో 20 అంగుళాల భారీ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో 21 అంగుళాల వీల్స్‌ను అమర్చారు. వీటికి ప్రత్యేకంగా ట్రాక్ పనితీరును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన హై-పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ టైర్లను ఉపయోగించారు. దీంతో అధిక వేగాల్లో కూడా అద్భుతమైన గ్రిప్, స్థిరత్వం లభిస్తుంది.
కారు వెనుక భాగంలో మధ్యలో అమర్చిన డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ దీని స్పోర్టీ స్వభావాన్ని మరింత హైలైట్ చేస్తాయి. వెనుక భాగం మొత్తం ట్రాక్ కారును గుర్తు చేసేలా రూపొందించబడింది. ఏరోడైనమిక్ పనితీరును మెరుగుపరచడానికి చేసిన డిజైన్ మార్పులు కేవలం అందం కోసమే కాకుండా టాప్ స్పీడ్‌లో కారుకు మెరుగైన నియంత్రణను అందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇంటీరియర్‌లో తన రేసింగ్ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.

సాధారణ గేర్ నాబ్, డాష్‌బోర్డ్ పైభాగంలో అమర్చిన క్లాసిక్ అనలాగ్ స్టాప్‌వాచ్, ప్రత్యేకమైన అప్‌హోల్స్టరీ, ప్రత్యేక ట్రిమ్ ప్యానెల్స్ ఈ కారుకు ప్రత్యేకమైన ప్రీమియం, రేస్-రెడీ అనుభూతిని అందిస్తాయి. డ్రైవర్‌కు పూర్తిగా కేంద్రీకృతమైన కాక్‌పిట్ డిజైన్ ప్రతి ప్రయాణాన్ని ఒక రేసింగ్ అనుభవంగా మార్చేలా ఉంటుంది. ఇందులో వెనుక సీట్లు లేవు. పనితీరును ప్రధాన లక్ష్యంగా రూపొందించిన 911 GT3 992.2 వెర్షన్‌లో కేవలం రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి.
కొత్త పోర్షే 911 GT3లో 4.0-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఫ్లాట్-సిక్స్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 510 హెచ్‌పీ పవర్‌తో పాటు 450 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొనుగోలుదారులు తమ అభిరుచికి అనుగుణంగా 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ PDK డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు. ముఖ్యంగా డ్రైవింగ్‌ను ఆస్వాదించే స్పోర్ట్స్ కార్ ప్రేమికుల కోసం మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కొనసాగించారు.

పనితీరు విషయానికి వస్తే, PDK ఆటోమేటిక్ వెర్షన్ కేవలం 3.4 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ/గంట వేగాన్ని అందుకోగలదు. అదే మాన్యువల్ వెర్షన్ 3.9 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. గరిష్ట వేగం మాన్యువల్ మోడల్‌లో 311 కిమీ/గంట కాగా, ఆటోమేటిక్ వెర్షన్‌లో 307 కిమీ/గంటగా ఉంటుంది. ట్రాక్ రేసింగ్‌ను మరింత ఇష్టపడే కస్టమర్ల కోసం పోర్షే 'విసాక్ ప్యాకేజీ'ని కూడా అందిస్తోంది.
దీని ధర అదనంగా రూ.43.90 లక్షలు. ఈ ప్యాకేజీలో బోనెట్, రూఫ్, రియర్ వింగ్ వంటి భాగాలను కార్బన్ ఫైబర్‌తో తయారు చేయడం వల్ల కారు బరువు తగ్గి పనితీరు మరింత మెరుగుపడుతుంది. అలాగే కార్బన్ ఫైబర్ రోల్ కేజ్, తేలికపాటి డోర్ ప్యానెల్స్, సిక్స్-పాయింట్ సేఫ్టీ హార్నెస్ బెల్ట్‌లు కూడా ఇందులో ఉంటాయి. దీంతో ట్రాక్‌పై ఈ సూపర్‌కార్ మరింత వేగంగా, స్థిరంగా పరుగులు తీయగలదు.


Click it and Unblock the Notifications