దీపావళి తర్వాత కార్ల డెలివరీల జోరు.. SUVలు, CNG కార్లకే జనం జై కొడుతున్నారు!
దివాళి పండగ తర్వాత దేశవ్యాప్తంగా షోరూమ్‌లలో కొత్త వాహనాల డెలివరీలు జోరందుకున్నాయి. ఈ నెల మధ్యనాటికి ప్యాసింజర్ వాహనాల (PV) రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగినట్లు వాహన్ (Vahan) పోర్టల్ గణాంకాలు చెబుతున్నాయి. నవంబర్ 14 రాత్రి 8:36 గంటల సమయానికి 2,22,135 ప్యాసింజర్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. అక్టోబర్ నెల మొత్తంలో ఈ సంఖ్య 5,14,377గా నమోదైంది. ధన్‌తేరస్, దీపావళి పండగల సమయంలో కొనుగోలు చేసిన వాహనాల డెలివరీలు జరగడం, విక్రయాల తర్వాత కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కొన్ని రోజుల పాటు కొనసాగడమే ఈ నమోదుల పెరుగుదలకు కారణం.
పండగల సీజన్‌లో కొనుగోలుదారులు ఇంధన ఎంపిక విషయంలోనూ పంథా మార్చుకుంటున్నారు. ఆగస్టు నెలలో సీఎన్‌జీ, స్ట్రాంగ్-హైబ్రిడ్ వాహనాలకు ఆదరణ పెరగడంతో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల విక్రయాలు పెట్రోల్ కార్లను మించిపోయాయి. ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన వాహన్ డేటా ప్రకారం.. మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో CNG వాటా దాదాపు పావు వంతు కాగా, హైబ్రిడ్ మోడళ్లు 8 శాతానికి పైగా, ఎలక్ట్రిక్ (EV) వాహనాలు 6 శాతానికి పైగా నమోదయ్యాయి. మైలేజ్ భయం లేకుండా ప్రయాణ ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్‌గా మారుతున్నాయి.

రాష్ట్రాల వారీగా దీపావళి వారం వాహన్ రిజిస్ట్రేషన్లు
ఈ ఏడాది ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్లలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు కూడా వీటికి తీవ్ర పోటీనిస్తున్నాయి. నవంబర్ నెల మధ్యలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. ముంబై-పుణే, ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వడంతో డెలివరీలు వేగవంతమయ్యాయి. అక్టోబర్ నెల ఓవరాల్ వాహన విక్రయాల్లోనూ మహారాష్ట్ర ముందంజలో ఉండటం పశ్చిమ భారతంలో స్థిరమైన డిమాండ్‌ను చూపిస్తోంది.
ఈ నెల సేల్స్‌లో SUVలు, CNG వాహనాలదే హవా!
నగరాల్లోని కుటుంబాలు కాంపాక్ట్ కార్ల నుంచి SUVల వైపు ఆసక్తి చూపిస్తుండగా, తక్కువ ఖర్చును కోరుకునే వారికి ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG మోడళ్లు ప్రాధాన్యతగా మారాయి. ఆర్థిక సంవత్సరం 2026లో ప్యాసింజర్ వాహన విక్రయాల్లో CNG వాటా దాదాపు 22 శాతానికి చేరగా, సగానికి పైగా మార్కెట్‌ను SUVలే కైవసం చేసుకున్నాయి. ప్రధాన నగరాల్లో పెండింగ్ బుకింగ్‌లన్నీ ఇప్పుడు రిజిస్ట్రేషన్లుగా మారుతుండటంతో కాంపాక్ట్-SUVలు, CNG హ్యాచ్‌బ్యాక్ కార్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది.
దీపావళి తర్వాత తగ్గిన వెయిటింగ్ పీరియడ్.. డీలర్ వద్ద స్టాక్
నవంబర్ ప్రారంభంలో డీలర్ల వద్ద దాదాపు 43 నుంచి 45 రోజులకు సరిపడా ప్యాసింజర్ వాహనాల నిల్వలు (ఇన్వెంటరీ) ఉన్నాయని ఫాడా (FADA) తెలిపింది. అయితే దీపావళి విక్రయాల జోరుతో ఈ ఒత్తిడి కాస్త తగ్గింది. డిమాండ్ ఎక్కువగా ఉన్న వేరియంట్లు, పాపులర్ కలర్ల వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా తగ్గుతోంది. కొనుగోలుదారులను త్వరగా డెలివరీ అయ్యే వేరియంట్ల వైపు డీలర్లు ప్రోత్సహిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్, ఇయర్-ఎండ్ డెలివరీల కోసం ఆఫర్లు, ఫైనాన్స్ స్కీమ్‌లు, యాక్సెసరీస్ ప్యాకేజీలతో పాత స్టాక్‌ను క్లియర్ చేస్తున్నారు.
వాహన్ పోర్టల్‌లో ముందంజలో ఉన్న టాప్ ఆటో బ్రాండ్లు
నవంబర్ నెల వాహన్ చార్ట్‌లో ఇప్పటివరకు మారుతి సుజుకి అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. హ్యుందాయ్, మహీంద్రా, టాటా తదుపరి స్థానాల్లో ఉన్నాయి. టాటా ఎలక్ట్రిక్ వాహనాల విభాగం తన జోరును కొనసాగిస్తుండగా, టయోటా, కియా కంపెనీలు హైబ్రిడ్ మోడళ్లు, ప్రీమియం SUVలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. నెల ముగిసేసరికి ఈ ర్యాంకింగ్స్‌లో స్వల్ప మార్పులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అక్టోబర్ నాటి ట్రెండే దాదాపు కొనసాగుతోంది.
భవిష్యత్ అంచనా: నవంబర్ 16–30 పెళ్లిళ్ల సీజన్ డెలివరీలు, డిస్కౌంట్లు
నవంబర్ రెండో అర్ధభాగంలోనూ పెళ్లిళ్ల సీజన్ డెలివరీల వల్ల విక్రయాల వేగం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇయర్-ఎండ్ డిస్కౌంట్లు మొదలవుతాయి. నిల్వలు పెరిగిన చోట CNG, స్ట్రాంగ్-హైబ్రిడ్ వాహనాల లభ్యత పెరిగి, వెయిటింగ్ పీరియడ్ తగ్గుతుంది. కొనుగోలుదారులు ఫైనాన్స్, నచ్చిన రంగులను ముందుగానే ఫిక్స్ చేసుకోవడం మంచిది. వాహనం డెలివరీ అయిన కొన్ని రోజుల వరకు కూడా వాహన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ వివరాలు అప్‌డేట్ అవుతుంటాయి, కాబట్టి ఏ ఒక్క రోజు గణాంకాలు చూసినా అది ఆ నెల మొత్తం ఫలితాన్ని సరిగ్గా ప్రతిబింబించదు.


Click it and Unblock the Notifications
