Renault Bridger : లీటరుకు 30KMకు పైగా మైలేజ్..మైలేజీలో సరికొత్త సంచలనం.. రెనాల్ట్ నుంచి మినీ డస్టర్ వస్తోంది
Renault Bridger : ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో భారీ విప్లవం సృష్టించేందుకు సిద్ధమైంది. బ్రిజర్ పేరుతో సరికొత్త ఎస్‌యూవీని విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. దీనిని మినీ డస్టర్ అని కూడా పిలుస్తున్నారు. ఈ కారు లీటరుకు ఏకంగా 30 కిలోమీటర్లకు పైగా మైలేజీని ఇస్తుందని వార్తలు రావడంతో వాహన ప్రియుల్లో ఆసక్తి విపరీతంగా పెరిగింది.
లేటెస్ట్ టెక్నాలజీతో మైలేజీ మ్యాజిక్
రెనో బ్రిజర్ ఎస్‌యూవీలో 1.2 లీటర్ల హైబ్రిడ్ ఇంజిన్‌ను అమర్చనున్నట్లు సమాచారం. ఇది మూడు సిలిండర్ల ఇంజిన్, ఇది మిల్లర్ సైకిల్ సాంకేతికతపై పనిచేస్తుంది. సాధారణ ఇంజిన్లతో పోలిస్తే మిల్లర్ సైకిల్ ఇంజిన్లు ఇంధన సామర్థ్యానికి ప్రసిద్ధి.

ఇటీవల వియన్నా మోటార్ సింపోజియంలో ప్రదర్శించిన అత్యాధునిక సాంకేతికతను ఈ కారులో వాడనున్నారు. ఇదే టెక్నాలజీని అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న డేసియా డస్టర్‌లో కూడా ఉపయోగించారు. ఫలితంగా ఈ కారు అత్యధిక మైలేజీని అందిస్తూ వినియోగదారుల జేబుకు భారం తగ్గించనుంది.
తక్కువ ధరకే లభించే అవకాశం
బ్రిజర్ ఎస్‌యూవీలో 1.2 లీటర్ల ఇంజిన్‌ను వాడటం వల్ల మైలేజీ పెరగడమే కాకుండా, పన్నుల పరంగా కూడా సామాన్యులకు భారీ ఊరట లభించనుంది. మన దేశంలో చిన్న కార్లకు వర్తించే 18 శాతం జీఎస్టీ పరిధిలోకి ఈ మోడల్ వచ్చే అవకాశం ఉంది.
దీనివల్ల కారు ధర కూడా పోటీ సంస్థల వాహనాల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వినియోగదారులకు తక్కువ ధరలో ప్రీమియం అనుభూతిని అందించడమే లక్ష్యంగా రెనో ఈ అడుగులు వేస్తోంది.

దీపావళికి డస్టర్ హైబ్రిడ్ రాక
మినీ డస్టర్‌తో పాటుగా అసలైన డస్టర్ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా రెనాల్ట్ సిద్ధం చేస్తోంది. ఇది 2026 దీపావళి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో శక్తివంతమైన 1.8 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో కలిసి పనిచేస్తుంది.
ఈ హైబ్రిడ్ వ్యవస్థ మొత్తం 160 బీహెచ్‌పి శక్తిని, 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నగర ప్రయాణాల్లోనూ, సుదూర ప్రయాణాల్లోనూ అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది.
పోటీని పెంచనున్న రెనాల్ట్ బోరియల్
ఏడు సీట్ల విభాగంలో కూడా రెనాల్ట్ మార్కెట్లో తన ఉనికిని చాటుకోనుంది. టాటా సఫారి, మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ వంటి మోడళ్లకు పోటీగా బోరియల్ పేరుతో కొత్త ఎస్‌యూవీని తీసుకురానుంది. ఇది పెద్ద ఫ్యామిలీలు ఉన్న వాళ్లకు బెస్ట్ ఛాయిస్ అనే చెప్పాలి. కంఫర్ట్ గా లాంజ్ జర్నీలకు చాలా ఉపయోగపడుతుంది.

ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 10 అంగుళాల స్క్రీన్, ప్రీమియం ఆడియో సిస్టమ్, లెవల్ 2 ఏడీఏఎస్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉండనున్నాయి. 2026 రెండో అర్ధభాగంలో దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ వరుస విడుదలలతో రెనో సంస్థ భారత మార్కెట్లో మళ్ళీ తన పట్టును సాధించాలని చూస్తోంది. అలాగే మార్కెట్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని రెనాల్ట్ కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications