36 నెలల్లో ఏ కారు సాధించలేనిది.. ఈ ఒక్క కారే సాధించింది.. కంపెనీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టింది
మనదేశంలో మిడ్ సైజ్ ఎస్‌యూవీల సందడి మళ్ళీ మొదలైంది. ఒకప్పుడు ఈ విభాగంలో రారాజుగా వెలిగిన రెనాల్ట్ డస్టర్, ఇప్పుడు సరికొత్త రూపంతో మూడవ తరం మోడల్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టింది. గత 36 నెలల్లో ఎన్నడూ లేనంతగా భారీ అమ్మకాలతో రెనాల్ట్ ఇండియా దూసుకుపోతోంది. ముఖ్యంగా మధ్యతరగతి వాహన ప్రియులను ఆకట్టుకుంటున్న డస్టర్ ఆథెంటిక్ (బేస్ వేరియంట్) గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అమ్మకాల్లో సంచలనం సృష్టిస్తున్న కొత్త డస్టర్
రెనాల్ట్ ఇండియాకు డస్టర్ ఒక అక్షయ పాత్రలా మారింది. గత ఏడాది ఇదే నెలలో కేవలం 2,602 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఏప్రిల్ 2026 నాటికి కంపెనీ అమ్మకాలు ఏకంగా 108 శాతం(5,413 కార్లు) పెరిగాయంటే ఈ కారు క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిస్తూ, కేవలం రెండు నెలల్లోనే దాదాపు 3,761 యూనిట్లు అమ్ముడై సంచలనం సృష్టించింది. తక్కువ ధరలో ప్రీమియం లుక్ కోరుకునే వారిని ఈ కారు విశేషంగా ఆకర్షిస్తోంది.

బేస్ వేరియంట్ ఆథెంటిక్
డస్టర్ బేస్ వేరియంట్ ఆథెంటిక్ ధర సుమారు 10.49 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. బయట నుంచి చూస్తే ఇది బేస్ వేరియంట్ అని ఎక్కడా అనిపించదు. ముందు భాగంలో ఎకో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, స్టైలిష్ ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు కారుకు రాజసాన్ని ఇస్తాయి. అయితే, బడ్జెట్ దృష్ట్యా ఇందులో ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు ఉండవు. 17 అంగుళాల స్టీల్ వీల్స్ ఇచ్చారు కానీ అల్లాయ్ వీల్స్ లేవు. వెనుక వైపు స్పోర్టీ లుక్ ఇచ్చే స్పాయిలర్ ఉన్నప్పటికీ, సన్ రూఫ్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి ఫీచర్లు ఇందులో కనిపించవు.
ఇంటీరియర్, కంఫర్ట్ ఫీచర్లు
కారు లోపలికి వెళ్తే.. డ్రైవర్ సౌకర్యానికి రెనాల్ట్ పెద్ద పీట వేసింది. సీటు ఎత్తును అడ్జస్ట్ చేసుకునే సదుపాయం, టిల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్ ఉండటం ప్లస్ పాయింట్. 7 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉన్నప్పటికీ, మ్యూజిక్ సిస్టమ్ (ఇన్ఫోటైన్మెంట్) మాత్రం ఇందులో ఇవ్వలేదు. ఫాబ్రిక్ సీట్లు, మాన్యువల్ ఏసీ వంటి సాధారణ ఫీచర్లు ఉన్నాయి. లగేజీ కోసం 518 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది, ఇది సుదూర ప్రయాణాలకు ఎంతో ఉపయోగకరం.

సేఫ్టీలోనూ తగ్గేదే లే..
బేస్ వేరియంట్ అయినప్పటికీ భద్రత విషయంలో రెనాల్ట్ ఏమాత్రం రాజీ పడలేదు. భారత్ ఎన్-క్యాప్ క్రాష్ టెస్టులో ఈ కారు 5-స్టార్ రేటింగ్ సాధించడం విశేషం. ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ప్రామాణికంగా వస్తాయి. ఇంత తక్కువ ధరలో ఇన్ని సేఫ్టీ ఫీచర్లు ఉండటం ఈ కారుకు ఉన్న అతిపెద్ద బలం.
ఇంజిన్ సామర్థ్యం, పర్ఫామెన్స్
ఈ బేస్ వేరియంట్‌లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 100 హెచ్‌పి శక్తిని, 166 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఇది లభిస్తుంది. సిటీ డ్రైవింగ్‌కు, సాధారణ ప్రయాణాలకు ఈ ఇంజిన్ సరిపోతుంది. అయితే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కావాలనుకునే వారు పై వేరియంట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఇందులో హైబ్రిడ్ ఇంజిన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

ఈ కారు ఎవరికి సెట్ అవుతుంది?
మీకు బడ్జెట్ తక్కువలో ఉండి, స్ట్రాంగ్ బాడీ, అత్యున్నత భద్రత కలిగిన ఎస్‌యూవీ కావాలనుకుంటే డస్టర్ ఆథెంటిక్ బెస్ట్ ఆప్షన్. లగ్జరీ ఫీచర్లు లేకపోయినా, ఒక ఫ్యామిలీ కారుకు కావాల్సిన అన్ని ముఖ్యమైన ఫెసిలిటీలు ఇందులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications