ఈ రెండింటిలో ఏ ఎస్‌యూవీ మీ ఫ్యామిలీకి కరెక్ట్? హ్యుందాయ్ క్రెటా వర్సెస్ రెనాల్ట్ డస్టర్
భారత ఆటోమొబైల్ రంగంలో ఒకప్పుడు ఎస్‌యూవీ (SUV) అంటే కేవలం పెద్ద కార్లు మాత్రమే అనే ముద్ర ఉండేది. కానీ సామాన్యుడికి కూడా ఎస్‌యూవీ అనుభూతిని పరిచయం చేసిన ఘనత రెనాల్ట్ డస్టర్ (Renault Duster)కే దక్కుతుంది. మధ్యలో కొంతకాలం విరామం తీసుకున్న ఈ లెజెండరీ కారు, ఇప్పుడు సరికొత్త హంగులతో, పవర్‌ఫుల్ ఇంజిన్లతో మార్చి 2026లో మళ్లీ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ప్రస్తుతం మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)ను ఢీకొట్టడం డస్టర్‌కు అంత ఈజీ కాదు. ఈ రెండు కార్లలో ఏది బెస్ట్? ఏ కారు ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధరలో ఏది తక్కువ? వంటి పూర్తి వివరాలు చూద్దాం.
2022లో అమ్మకాలు నిలిపివేసిన తర్వాత, దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం రెనాల్ట్ డస్టర్ సరికొత్త అవతారంలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. పాత డస్టర్ తో పోలిస్తే ఇది పూర్తిగా మారిపోయింది. రెనాల్ట్ గ్లోబల్ సీఎమ్‌ఎఫ్-బి (CMF-B) ప్లాట్‌ఫారమ్ మీద దీనిని నిర్మించారు. దీనివల్ల కారు సైజ్ పెరగడమే కాకుండా, ప్రయాణికులకు లోపల మరింత స్పేస్ లభిస్తుంది. ముందు భాగంలో DUSTER అనే అక్షరాలు మెరిసిపోతూ, ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్‌లతో చాలా రగ్గుడ్ గా కనిపిస్తుంది. వెనుక వైపు ఒకదానికొకటి అనుసంధానించబడిన ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు కారుకు మోడ్రన్ లుక్‌ను ఇస్తాయి.

క్రెటా మోడ్రన్ లుక్ వర్సెస్ డస్టర్ రగ్గడ్ డిజైన్
హ్యుందాయ్ క్రెటా ఎప్పుడూ తన మోడ్రన్, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌కు పేరుగాంచింది. ముఖ్యంగా సిటీలో తిరిగే వారికి క్రెటా లుక్ చాలా క్లాసీగా అనిపిస్తుంది. క్రెటాలో ఫుల్-ఎల్‌ఈడీ లైటింగ్ సెటప్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి యువతను ఎక్కువగా ఆకర్షిస్తాయి. అయితే, కొత్త డస్టర్ మాత్రం పక్కా ఎస్‌యూవీ లాగా, ఎత్తైన బాడీ మరియు నిటారుగా ఉండే డిజైన్‌తో కనిపిస్తుంది. మీరు అడ్వెంచర్ ప్రియులైతే డస్టర్ లుక్ మీకు నచ్చుతుంది, అదే సిటీలో స్టైలిష్‌గా తిరగాలనుకుంటే క్రెటా డిజైన్ బాగుంటుంది.
ఇంజిన్ పవర్
కొత్త డస్టర్ ఈసారి డీజిల్ ఇంజిన్ లేకుండా కేవలం టర్బో పెట్రోల్, హైబ్రిడ్ ఆప్షన్లలో మాత్రమే వచ్చింది. ఇందులో రెండు రకాల ఇంజిన్లు ఉన్నాయి. మొదటిది 1.0 లీటర్ టర్బో ఇంజిన్ కాగా, రెండోది 1.3 లీటర్ 4-సిలిండర్ టర్బో ఇంజిన్. ఈ 1.3 లీటర్ ఇంజిన్ ఏకంగా 163 PS పవర్, 280 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది హ్యుందాయ్ క్రెటా 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (160 PS) కంటే కాస్త ఎక్కువ పవర్ఫుల్. పర్ఫార్మెన్స్ విషయంలో డస్టర్ తన ప్రత్యర్థికి గట్టి పోటీ ఇస్తోంది.

సైజ్, కంఫర్ట్
కొత్త ప్లాట్‌ఫామ్ కారణంగా డస్టర్ ఇప్పుడు క్రెటా కంటే పెద్దదిగా ఉంది. దీని పొడవు 4346 మిమీ, వెడల్పు 1815 మిమీ, ఎత్తు 1701 మిమీ. క్రెటాతో పోలిస్తే డస్టర్ పొడవు, వెడల్పులో ఎక్కువగా ఉండటం వల్ల లోపల ముగ్గురు పెద్దలు వెనుక సీట్లో సులభంగా కూర్చోవచ్చు. అలాగే డస్టర్ వీల్‌బేస్ 2657 మిమీ ఉండటం వల్ల లెగ్ రూమ్ కూడా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా డస్టర్ గ్రౌండ్ క్లియరెన్స్ 212 మిమీ, ఇది క్రెటా (190 మిమీ) కంటే చాలా ఎక్కువ. దీనివల్ల అధ్వాన్నమైన రోడ్లపై కూడా డస్టర్ ఎక్కడా తగలకుండా దూసుకుపోతుంది.
ఫీచర్ల పరంగా ఎవరిది పైచేయి?
ఫీచర్ల విషయంలో హ్యుందాయ్ ఎప్పుడూ రాజీ పడదు. క్రెటాలో 10.25 ఇంచుల డ్యూయల్ స్క్రీన్లు, 8-వే పవర్ అడ్జస్టబుల్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, బోస్ (Bose) 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు రెనాల్ట్ డస్టర్ కూడా తక్కువేం కాదు. ఇందులో 10.1 ఇంచ్ ఓపెన్-ఆర్ లింక్ టచ్‌స్క్రీన్, గూగుల్ బిల్ట్-ఇన్ సదుపాయం, వైర్‌లెస్ ఛార్జింగ్, లెవల్ 2 ADAS వంటి 17 రకాల సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ ఇంటీరియర్స్ కొంచెం సాఫ్ట్‌గా ఉంటే, డస్టర్ ఇంటీరియర్స్ స్పోర్టీగా, దృఢంగా ఉంటాయి.

ధర, డెసిషన్
ధర విషయానికి వస్తే రెనాల్ట్ డస్టర్ తన ప్రత్యర్థి క్రెటా కంటే రూ.30,000 తక్కువకే ప్రారంభమవుతుంది. డస్టర్ ప్రారంభ ధర రూ.10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, క్రెటా ధర సుమారు రూ. 10.80 లక్షల నుంచి మొదలవుతుంది. మీరు తక్కువ ధరలో మంచి పవర్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, పక్కా ఎస్‌యూవీ లుక్ కోరుకుంటే డస్టర్ బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీకు లగ్జరీ ఇంటీరియర్స్, ఎక్కువ ఫీచర్లు, రీసెల్ వాల్యూ ముఖ్యమనుకుంటే హ్యుందాయ్ క్రెటా సరైన ఎంపిక అవుతుంది. రెనాల్ట్ డస్టర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి, మార్కెట్లో దీని స్పందన ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications








