డస్టర్‌ను తక్కువలో కొనే అవకాశం.. మార్చి 31 లాస్ట్, రూ.50,000 వరకు ఆదా! ఇప్పుడే బుక్ చేయండి
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మళ్లీ తన ప్రభావాన్ని చూపేందుకు రెనాల్ట్ డస్టర్ (Renault Duster) కొత్త తరం అవతారంలో గ్రాండ్‌గా తిరిగి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు నాలుగు సంవత్సరాల విరామం తర్వాత రూ. 10.49 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఎస్‌యూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకప్పుడు భారత రోడ్లపై తనదైన స్టైల్, దృఢత్వంతో ప్రత్యేక గుర్తింపును సంపాదించిన డస్టర్, ఇప్పుడు మరింత ఆధునిక డిజైన్, టెక్నాలజీతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. భారతదేశంలో SUV సెగ్మెంట్ వేగంగా పెరుగుతున్న సమయంలో, డస్టర్‌కు ఉన్న క్రేజ్ కూడా అదే రీతిలో పెరిగింది. ఒక దశలో ఇది రెనాల్ట్‌కు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. అయితే కాలక్రమేణా అమ్మకాలు తగ్గడంతో 2022లో కంపెనీ ఈ కారును నిలిపివేసింది.
అయినప్పటికీ, డస్టర్ పేరు మాత్రం మార్కెట్లో మాయం కాలేదు. కస్టమర్లు ఎప్పటికప్పుడు దీని రీ-ఎంట్రీ కోసం ఎదురు చూసారు. ఇప్పుడు ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. ఈసారి కొత్త డస్టర్‌పై ఆసక్తి మరింత ఎక్కువగా ఉండటానికి కారణం, ఇది పూర్తిగా కొత్త డిజైన్‌తో పాటు, తాజా ఫీచర్లు, మెరుగైన పనితీరుతో రావడమే. అందుకే మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఈ SUV కోసం భారీగా బుకింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా.

మొదటి కొన్ని నెలల్లోనే ఎక్కువ డిమాండ్ ఉండటం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో, కస్టమర్లు త్వరగా కారును పొందాలంటే ముందుగానే బుకింగ్ చేయడం చాలా ముఖ్యం. బుకింగ్ ఆలస్యమైతే, డెలివరీ కూడా ఆలస్యం కావడం సహజం. ఈ సమస్యను ముందుగానే గుర్తించిన రెనాల్ట్ కస్టమర్లకు ఒక స్మార్ట్ సొల్యూషన్‌గా 'ఆర్-పాస్' సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆర్-పాస్ సిస్టమ్ ద్వారా, కస్టమర్లు కొత్త డస్టర్‌ను మరింత త్వరగా సొంతం చేసుకునే అవకాశం పొందుతారు.
ఈ పాస్‌ను పొందడానికి రూ. 21,000 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది కేవలం ముందస్తు బుకింగ్ సౌకర్యమే కాదు, అదనంగా ఆర్థిక ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఆర్-పాస్ ఉన్న కస్టమర్లకు డస్టర్ కారును తక్కువ ధరలో అందించే ప్రత్యేక ఆఫర్ కూడా ఉంది. సాధారణంగా ఈ SUV ప్రారంభ ధర రూ. 10.49 లక్షలుగా ఉండగా, ఆర్-పాస్ హోల్డర్లకు అదే కారు రూ. 10.29 లక్షలకే లభిస్తుంది.

ఈ ఆర్-పాస్ ప్రయోజనంలో భాగంగా, కస్టమర్లకు రూ. 20,000 నుండి రూ. 50,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, కొత్త డస్టర్‌ను మార్కెట్ ధర కంటే తక్కువ ధరలో సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, డెలివరీ విషయంలో కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ఆర్-పాస్ ఉన్న కస్టమర్లకు కారును వేగంగా డెలివరీ చేయడం ద్వారా, ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ పాస్ కొనుగోలు చేసిన తర్వాత ఏదైనా కారణంతో కారు కొనకపోయినా, లేదా ఈ ప్రోగ్రామ్ నుంచి బయటకు రావాలనుకున్నా, కస్టమర్ చెల్లించిన రూ. 21,000 మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లిస్తామని రెనాల్ట్ హామీ ఇస్తోంది. దీంతో ఈ పథకం రిస్క్-ఫ్రీగా మారి, కస్టమర్లకు మరింత నమ్మకాన్ని ఇస్తోంది. అయితే ఈ ప్రత్యేక ఆఫర్ శాశ్వతం కాదు.

ఆర్-పాస్ విధానం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. అందువల్ల, కొత్త డస్టర్‌ను తక్కువ ధరలో, త్వరగా పొందాలనుకునే వారు ఈ అవకాశాన్ని మిస్ కాకుండా ముందుగానే చర్యలు తీసుకోవడం మంచిది. బుకింగ్ ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు భారతదేశానికి సంబంధించిన రెనాల్ట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. లేదా తమకు సమీపంలోని రెనాల్ట్ షోరూమ్‌ను సందర్శించవచ్చు.


Click it and Unblock the Notifications








