లీటరుకు 22 కి.మీ మైలేజీ.. అదిరిపోయే ఫీచర్లు.. పేదవాడి కారును కొనే నాథుడే లేదు..షోరూమ్‌లు వెలవెల
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒకప్పుడు చిన్న కార్ల విభాగంలో సంచలనం సృష్టించిన రెనాల్ట్ క్విడ్ (Renault Kwid) ఇప్పుడు షోరూంలలో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. మధ్యతరగతి ప్రజల కలల కారుగా, బడ్జెట్ ధరలో లభించే స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్‌గా పేరు తెచ్చుకున్న ఈ కారు అమ్మకాలు ఊహించని విధంగా పడిపోయాయి. గత నెల అంటే ఫిబ్రవరి 2026 నాటి అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, కేవలం 375 మంది మాత్రమే ఈ కారును కొనుగోలు చేశారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే అమ్మకాల్లో సుమారు 46.28 శాతం క్షీణత కనిపించడం వాహన రంగ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఫిబ్రవరి 2025లో రెనాల్ట్ క్విడ్ 698 యూనిట్లు అమ్ముడవ్వగా, ఏడాది తిరిగేసరికి ఆ సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. రూ.4.30 లక్షల ప్రారంభ ధరతో, అద్భుతమైన ఫీచర్లు ఉన్నప్పటికీ కస్టమర్లు ఈ కారు వైపు చూడటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు రెనాల్ట్ కంపెనీకి వెన్నెముకలా నిలిచిన క్విడ్, ఇప్పుడు అదే కంపెనీలో అత్యల్పంగా అమ్ముడవుతున్న మోడల్‌గా నిలవడం గమనార్హం. కేవలం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ మార్కెట్లలో కూడా క్విడ్ ప్రభావం తగ్గిపోతోంది.

అమ్మకాలు తగ్గుతున్నప్పటికీ, ఫీచర్ల విషయంలో క్విడ్ ఇప్పటికీ తన సెగ్మెంట్‌లో పవర్‌ఫుల్ కార్లలో ఒకటిగా ఉంది. దీని ఎస్‌యూవీ తరహా డిజైన్ (SUV inspired design) యువతను బాగా ఆకర్షిస్తుంది. ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్ (LED DRLs), డైనమిక్ గ్రిల్, ఆకర్షణీయమైన బాడీ కలర్స్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ని ఇస్తాయి. లోపల కూడా 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కమాండ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ప్రాథమిక ఫీచర్లను రెనో అందిస్తోంది.
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది సిటీ డ్రైవింగ్‌కు, చిన్నపాటి హైవే ప్రయాణాలకు సరిగ్గా సరిపోతుంది. కస్టమర్ల సౌలభ్యం కోసం మాన్యువల్, ఏఎమ్‌టీ (ఆటోమేటిక్) గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మైలేజీ పరంగా చూస్తే క్విడ్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 21 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 22 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తాయి. నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉండటం ఈ కారుకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్.

అయినప్పటికీ క్విడ్ అమ్మకాలు పడిపోవడానికి ప్రధాన కారణం మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా మారుతి సుజుకి ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, టాటా టియాగో వంటి కార్లు గట్టి పోటీని ఇస్తున్నాయి. కస్టమర్లు ఇప్పుడు కేవలం ధరనే కాకుండా రీసేల్ వాల్యూ, సర్వీస్ నెట్‌వర్క్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. రూ. 4.30 లక్షల నుండి రూ. 5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో దొరుకుతున్న క్విడ్, తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతుందా లేదా అన్నది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








