దేశం మొత్తం ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు షురూ
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తన సరికొత్త ఎలక్ట్రిక్ బ్రాండ్ ఫ్లయింగ్ ఫ్లీ (Flying Flea) కింద రూపొందించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 (Flying Flea C6) డెలివరీలను అధికారికంగా ప్రారంభించింది. దీనితో కంపెనీ ఇంధన ఆధారిత వాహనాల నుంచి ఎలక్ట్రిక్ శకంలోకి గ్రాండ్‌గా అడుగుపెట్టింది. ఈ క్రేజీ బైక్ డెలివరీలు ప్రస్తుతం బెంగళూరు నగరంలో మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో దేశంలోని ఇతర ప్రముఖ నగరాలకు కూడా ఈ విక్రయాలను విస్తరించడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కస్టమర్లను ఆకట్టుకునే రంగులు, ధర
రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రేమికులను ఆకర్షించేలా ఈ వినూత్న ఎలక్ట్రిక్ బైక్‌ను స్టామ్ బ్లాక్ (Storm Black), ఫ్లీ గ్రీన్ (Flea Green) అనే రెండు క్లాసిక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చారు. ఈ బైక్ సాధారణ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.79 లక్షలుగా ఉంది. అయితే, కస్టమర్లపై ఆర్థిక భారం తగ్గించడానికి కంపెనీ ఒక అద్భుతమైన ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ బైక్‌ను బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ప్లాన్ కింద కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్ ఎంచుకుంటే, బ్యాటరీ ధర మినహాయించి బైక్ ప్రారంభ ధర కేవలం రూ.1.99 లక్షలకే లభిస్తుంది. బ్యాటరీ కోసం నెలకు విడిగా సబ్‌స్క్రిప్షన్ కడితే సరిపోతుంది.

బెంగళూరులో స్ట్రాంగ్ సర్వీస్ నెట్‌వర్క్
మొదటిసారి ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసే కస్టమర్లలో ఉండే అభద్రతా భావాన్ని తొలగించడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బెంగళూరు నగరంలో అత్యంత పటిష్టమైన సర్వీస్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. దీని కోసం కంపెనీ హబ్-అండ్-స్పోక్ (Hub and Spoke) మోడల్‌ను ఎంచుకుంది. దీని ప్రకారం, బైక్‌కు సంబంధించిన పెద్ద పనులు లేదా మేజర్ రిపేర్ల కోసం బెంగళూరులోని బిటిఎమ్ లేఅవుట్ లో ఒక మెయిన్ హబ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే నిత్యం అవసరమయ్యే సాధారణ సర్వీసింగ్, చిన్నపాటి పనుల కోసం నగరం నలుమూలలా పలు చిన్న స్పోక్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు.
సరికొత్త ఫ్లయింగ్ ఫ్లీ కౌంటర్లు, ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్
వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా బైక్ డెలివరీ, సమాచారం అందించేందుకు కంపెనీ తన పాత షోరూమ్‌లనే ఉపయోగించుకుంటోంది. ఎంపిక చేసిన కొన్ని పాత రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్‌ల లోపలే ఫ్లయింగ్ ఫ్లీ కోసం ప్రత్యేకంగా సరికొత్త కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీనితో పాటు, కస్టమర్ల భద్రత, నమ్మకాన్ని పెంచడానికి ప్రతి బైక్‌తో పాటు 24 గంటలు, వారంలో ఏడు రోజులు (24x7) పనిచేసే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సౌకర్యాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. దీనివల్ల ప్రయాణంలో ఎక్కడైనా బండి ఆగిపోతే వెంటనే కంపెనీ ప్రతినిధులు వచ్చి సహాయం అందిస్తారు.
రెట్రో లుక్, ఫ్యూచరిస్టిక్ ఫీచర్లు
టెక్నికల్, డిజైన్ పరంగా ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పాతకాలపు క్లాసిక్ వింటేజ్ మోటార్‌సైకిళ్ల డిజైన్ రూపాన్ని కలిగి ఉంటుంది. అయినప్పటికీ, ఇందులో నేటి తరం సరికొత్త అడ్వాన్స్‌డ్ ఫీచర్లను అమర్చారు. ఇందులో అమర్చిన పవర్‌ఫుల్ బ్యాటరీ, మోటార్ సెటప్ కారణంగా, ఈ బైక్ సింగిల్ ఫుల్ ఛార్జ్‌పై ఏకంగా 154 కిలోమీటర్ల స్థిరమైన డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. అత్యవసర సమయాల్లో ఉపయోగపడేలా ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. స్మార్ట్ ఫీచర్ల విషయానికి వస్తే బ్లూటూత్ కనెక్టివిటీ, టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, లాంగ్ రైడ్స్‌లో వేగాన్ని నియంత్రించే క్రూయిజ్ కంట్రోల్, దారి చూపే మ్యాప్ నావిగేషన్ వంటి అనేక లగ్జరీ ఫీచర్లు ఇందులో కొలువుదీరాయి.


Click it and Unblock the Notifications