పాత లుక్.. కొత్త 440cc ఇంజన్, హైటెక్ ఫీచర్లతో కొత్త ప్లాన్‌తో మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న అడ్వెంచర్ బైక్
బైక్ ప్రియులకు, ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు ఇది ఒక అదిరిపోయే గుడ్‌న్యూస్. పాత హిమాలయన్ 411 డిజైన్ అంటే పడిచచ్చే కుర్రాళ్ల కోసం కంపెనీ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. త్వరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 440 మార్కెట్లోకి రాబోతోంది. పాత కాలపు రఫ్ అండ్ టఫ్ లుక్, మోడ్రన్ టెక్నాలజీతో కూడిన కొత్త ఇంజన్.. ఈ కాంబినేషన్ వింటేనే అడ్వెంచర్ లవర్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 2026 చివరి నాటికి ఈ బైక్ రోడ్లపై గర్జించబోతోంది.
ఫ్యాన్ ఫేవరెట్ డిజైన్ రీ ఎంట్రీ:
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 411 ఒకప్పుడు అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్‌లో ఒక ట్రెండ్ సెట్టర్. అయితే, కంపెనీ హిమాలయన్ 450ని ప్రవేశపెట్టినప్పుడు, పాత మోడల్‌ను ఆపేసింది. కానీ ఇప్పటికీ చాలా మందికి ఆ పాత రగ్గడ్ లుక్, స్ట్రెయిట్ డిజైన్ అంటేనే ఇష్టం. ఫ్యాన్స్ నుంచి వస్తున్న విపరీతమైన డిమాండ్‌ను గుర్తించిన రాయల్ ఎన్‌ఫీల్డ్, ఇప్పుడు D4G అనే కోడ్ నేమ్‌తో హిమాలయన్ 440 ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది. ఇది చూడటానికి అచ్చం పాత హిమాలయన్ లాగే ఉన్నా, పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోంది.

పవర్ ఫుల్ 440cc ఇంజన్:
ఈ కొత్త బైక్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన స్క్రామ్ 440 (Scram 440)లో వాడే అదే 443cc ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను అమర్చబోతోంది. ఇది దాదాపు 25.4 bhp పవర్, 34 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత 411cc ఇంజన్‌తో పోలిస్తే ఇది మరింత స్మూత్‌గా ఉండటమే కాకుండా, లాంగ్ రైడ్స్‌లో అద్భుతమైన పవర్‌ను అందిస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జోడించనున్నారు, దీనివల్ల హైవేలపై రైడింగ్ మరింత సులభంగా మారుతుంది.
ఆధునిక ఫీచర్ల కలయిక:
డిజైన్ పాతదే అయినా, ఫీచర్లు మాత్రం 2026 టెక్నాలజీకి తగ్గట్టుగా ఉంటాయి. ఇందులో ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, డ్యూయల్ ఛానల్ స్విచబుల్ ఏబీఎస్ (ABS), యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, గూగుల్ మ్యాప్స్ సపోర్ట్‌తో కూడిన ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ ఉండబోతున్నాయి. అలాగే, కొండల్లోనూ, రాళ్లలోనూ ప్రయాణించడానికి వీలుగా డ్యూయల్ పర్పస్ టైర్లను అమర్చుతున్నారు.

హార్డ్‌వేర్, సస్పెన్షన్:
హిమాలయన్ 440 కేవలం లుక్స్ కోసం మాత్రమే కాదు, కఠినమైన దారుల్లో ప్రయాణించడానికి కూడా సిద్ధమవుతోంది. ఇందులో 41mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపు లాంగ్ ట్రావెల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉండనుంది. దీనివల్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఇది ఆఫ్-రోడింగ్ చేసేటప్పుడు బైక్ కింద తగలకుండా కాపాడుతుంది. డిస్క్ బ్రేక్స్ సైజును కూడా పెంచి, బ్రేకింగ్ సిస్టమ్‌ను మరింత శక్తివంతం చేయబోతున్నారు.
ధర, పోటీ:
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్‌ను సుమారు రూ.2.70 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసే అవకాశం ఉంది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న కేటీఎమ్ అడ్వెంచర్, యెజ్డీ అడ్వెంచర్ వంటి బైక్‌లకు ఇది గట్టి పోటీ ఇస్తుంది. మరీ ముఖ్యంగా, పాత హిమాలయన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ బైక్ వస్తోంది కాబట్టి, సేల్స్ పరంగా ఇది మళ్ళీ రికార్డులు సృష్టించడం ఖాయం.


Click it and Unblock the Notifications








