దారిలో గుంతలున్నా రాళ్లున్నా డోంట్ కేర్.. దూసుకపోవడమే.. త్వరలో మార్కెట్లోకి రూ.10లక్షల్లో రగ్గడ్ కార్లు
దృఢమైన బాడీ, అదిరిపోయే ఆఫ్-రోడింగ్ సామర్థ్యం, ఆధునిక ఫీచర్లు.. ఇవన్నీ కలిపి ఒకే కారులో ఉంటే చూడాలని ఎవరికి ఉండదు? అందుకే భారతీయ వాహన ప్రియుల కోసం టాటా, మహీంద్రా, రెనో కంపెనీలు సరికొత్త రగ్గడ్ (Rugged) ఎస్‌యూవీలను సిద్ధం చేస్తున్నాయి. వీటి ధర కూడా సామాన్యులకు అందుబాటులో రూ.10 లక్షల లోపే ఉండే అవకాశం ఉండటంతో మార్కెట్లో ఇప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.
మహీంద్రా విజన్ ఎస్ (Mahindra Vision S)
మహీంద్రా అంటేనే ఎస్‌యూవీల రారాజు. ఇప్పుడు తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు విజన్ ఎస్ (Vision S) అనే కాన్సెప్ట్ మోడల్‌ను తీసుకువస్తోంది. దీని ప్రొడక్షన్ వెర్షన్ 2027 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కారు డిజైన్ చూస్తేనే ఒక రాక్షస లుక్ కనిపిస్తుంది. భారీ బాడీ, బాక్సీ షేప్, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, కండలు తిరిగిన వీల్ ఆర్చెస్ దీని సొంతం.

ఇది మహీంద్రా అత్యాధునిక NU_IQ మల్టీ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందుతోంది. అంటే, ఇందులో పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో పాటు భవిష్యత్తులో హైబ్రిడ్ వెర్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. లోపల డీటెయిల్స్ విషయానికొస్తే.. పనోరమిక్ సన్ రూఫ్, భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి.
రెనో బ్రిజర్ (Renault Bridger)
ఫ్రాన్స్ కార్ల దిగ్గజం రెనో (Renault) భారత్‌లో తన సత్తా చాటేందుకు బ్రిజర్ (Bridger) అనే సరికొత్త మోడల్‌ను సిద్ధం చేస్తోంది. ఇటీవల ఫ్రాన్స్‌లో దీని కాన్సెప్ట్ మోడల్‌ను ప్రదర్శించారు. భారత్‌లో ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రానుంది. దీనిని 2027 చివర్లో లాంచ్ చేసే అవకాశం ఉంది.

ప్రసిద్ధ డస్టర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా దీనిని తయారు చేస్తున్నారు. ఇందులో 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లను వాడే అవకాశం ఉంది. ధర పరంగా ఇది రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉండే ఛాన్స్ ఉండటంతో, మధ్యతరగతి ప్రజలకు ఇది బెస్ట్ ఆఫ్-రోడర్ కానుంది. రెనో కూడా ఈ మోడల్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది.
టాటా స్కారలెట్ (Tata Scarlet)
మహీంద్రా థార్‌కు దీటుగా టాటా మోటార్స్ ఒక రగ్గడ్ ఎస్‌యూవీని డెవలప్ చేస్తోంది. దీని కోడ్ నేమ్ టాటా స్కారలెట్ (Tata Scarlet). ఈ కారు చూడటానికి చాలా దృఢంగా, బాక్సీ డిజైన్‌తో ఉండబోతోంది. దాదాపు 210 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో వచ్చే ఈ కారు, ఎగుడుదిగుడు రోడ్లపై రాజసం చూపిస్తుంది.

టాటా దీనిని ఐసీఈ (పెట్రోల్/డీజిల్), ప్యూర్ ఎలక్ట్రిక్ వేరియంట్లలో తీసుకురానుంది. ముఖ్యంగా దీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్ ఉండబోతుండటం విశేషం. ఇది 2028లో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. నెక్సాన్ నెక్స్ట్ జనరేషన్ తర్వాత టాటా నుంచి రాబోయే అత్యంత భారీ మోడల్ ఇదే కానుంది. మహీంద్రా విజన్ ఎస్, టాటా స్కారలెట్, రెనో బ్రిజర్ వంటి రగ్గడ్ ఎస్‌యూవీలు త్వరలో విడుదలై మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయం.


Click it and Unblock the Notifications








