రెండు సింహాల రసవత్తర పోరు.. కుషాక్ vs డస్టర్.. ధర, ఇంజిన్, ఫీచర్స్ ఫుల్ కంపారిజన్!
భారతీయ కాంపాక్ట్ SUV మార్కెట్లో పోటీ రోజురోజుకూ మరింత కఠినంగా మారుతోంది. ఈ నేపథ్యంలో స్కోడా (Skoda) తాజాగా తన ప్రాచుర్యం పొందిన కుషాక్ (Kushaq) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్లతో వచ్చిన ఈ మోడల్ మార్కెట్లో మళ్లీ దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే, కుషాక్‌కు ఇది సులభమైన ప్రయాణం కాదు. ఎందుకంటే ఎంతోకాలం తర్వాత తిరిగి మార్కెట్లోకి అడుగుపెట్టిన రెనాల్ట్ డస్టర్ (Renault Duster) ఇప్పుడు గట్టి పోటీగా మారింది. ఒకప్పుడు ఈ సెగ్మెంట్‌లో తనదైన గుర్తింపు పొందిన డస్టర్, కొత్త అప్‌డేట్స్‌తో మళ్లీ వినియోగదారుల ముందుకు రావడం వల్ల పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఈ రెండింటి మధ్య తేడాలను ఈ కథణంలో చూద్దాం.
ధర: ఈ రెండు SUVs మధ్య ధరల విషయంలో స్వల్ప తేడా ఉన్నప్పటికీ, కొనుగోలుదారులకు అది ముఖ్యమైన అంశంగా మారే అవకాశం ఉంది. కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.69 లక్షల నుండి ప్రారంభమవుతుండగా, డస్టర్ ధర మాత్రం కొంచెం తక్కువగా రూ.10.49 లక్షల నుంచే మొదలవుతోంది. ఈ చిన్న తేడా కారణంగా, ఎంట్రీ-లెవల్‌లో చూసే వారికి డస్టర్ కొద్దిగా సరసమైన ఆప్షన్‌గా కనిపిస్తుంది.

డిజైన్: కుషాక్ ఫేస్‌లిఫ్ట్ కొత్త గ్రిల్, LED హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ టెయిల్ లైట్లతో స్పోర్టీ, ప్రీమియం లుక్ ఇస్తుంది. 17 ఇంచుల అల్లాయ్ వీల్స్ కూడా ఆకర్షణ పెంచుతున్నాయి. ఇక రెనాల్ట్ డస్టర్ మాత్రం బోల్డ్ 'DUSTER' గ్రిల్, LED లైట్లు, 'C' షేప్ టెయిల్ ల్యాంప్స్‌తో రగ్గడ్ లుక్ ఇస్తుంది. 18 ఇంచుల వీల్స్, స్కిడ్ ప్లేట్స్ దీని రోడ్ ప్రెజెన్స్‌ను మరింత పెంచుతాయి.
ఇంజన్: కుషాక్ ఫేస్‌లిఫ్ట్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 115 hp పవర్‌ను అందిస్తూ, నగర ప్రయాణాలకు సరిపోయే బ్యాలెన్స్‌ను ఇస్తుంది. మరోవైపు, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ 150 hp శక్తిని అందిస్తూ, మరింత ఉత్సాహభరితమైన డ్రైవింగ్ అనుభవాన్ని కలిగిస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్, చిన్న ఇంజన్‌తో టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, అలాగే 1.5 లీటర్ ఇంజన్‌తో 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ లభిస్తాయి.

రెనాల్ట్ డస్టర్ పవర్ విషయంలో కొంచెం ముందంజలో కనిపిస్తుంది. ఇందులో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (TCe 160) 160 bhp, 280 Nm టార్క్‌ను అందిస్తూ, బలమైన పనితీరును ఇస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉంటుంది. అదనంగా, 1.0 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (100 bhp, 160 Nm) కూడా ఉంది, ఇది ప్రధానంగా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
ఫీచర్స్: ఫీచర్ల విషయంలో కుషాక్ ఫేస్‌లిఫ్ట్ మరింత ప్రీమియం అనుభవాన్ని అందించేలా అప్‌డేట్ అయింది. పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్, పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో లభిస్తాయి. ముఖ్యంగా ఈ సెగ్మెంట్‌లో అరుదుగా కనిపించే వెనుక సీట్ మసాజ్ ఫంక్షన్ దీని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఇక రెనాల్ట్ డస్టర్ కూడా ఫీచర్ల విషయంలో వెనుకబడలేదు. 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే), 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
సేఫ్టీ అంశాలు: కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, ముందు-వెనుక పార్కింగ్ సెన్సార్లు, TPMS, ఆటో-డిమ్మింగ్ IRVM భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా, ADAS వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు లేవు. డస్టర్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, ABS with EBD, ISOFIX మౌంట్స్, 360 డిగ్రీ కెమెరా, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, అలాగే లెవెల్ 2 ADAS ఉన్నాయి.


Click it and Unblock the Notifications








