బాబోయ్..ఇది కారు కాదు కదులుతున్న కంప్యూటర్.. లోపల పెద్ద ప్లేస్టేషన్.. డ్రైవింగ్ చేస్తూ గేమింగ్ ఆడేయచ్చు
టెక్నాలజీ దిగ్గజం సోనీ, ఆటోమొబైల్ దిగ్గజం హోండా చేతులు కలిపితే ఎలాంటి అద్భుతం జరుగుతుందో చూపిస్తోంది అఫీలా(Afeela). అమెరికాలో జరుగుతున్న సిఈఎస్ 2026 వేడుకల్లో సోనీ-హోండా మొబిలిటీ సంస్థ తమ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (Electric SUV) ప్రోటోటైప్‌ను ప్రదర్శించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం రోడ్డు మీద వెళ్లే కారు మాత్రమే కాదు, చక్రాల మీద నడిచే ఒక డిజిటల్ ప్రపంచం అని టెక్ నిపుణులు అభివర్ణిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోనీ,హోండా సంయుక్త వెంచర్ అఫీలా తన ఎస్‌యూవీ మోడల్‌ను లాంచ్ చేసింది. గతంలో చూపించిన విజన్-ఎస్ 02 (Vision-S 02) కన్సెప్ట్ కు ఇది మరింత అప్‌డేట్ వెర్షన్. ఈ కారును చూస్తుంటే భవిష్యత్తులో వాహనాలు ఎలా ఉండబోతున్నాయో మనకు అర్థమవుతుంది. కేవలం ప్రయాణం కోసమే కాకుండా, ఎంటర్టైన్మెంట్, అత్యాధునిక రక్షణ ఫీచర్ల కలయికగా దీనిని రూపొందించారు. 2028 నాటికి ఈ ఎస్‌యూవీ ఉత్పత్తి దశకు చేరుకుని మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

అఫీలా ఎస్‌యూవీ డిజైన్ చాలా స్మూత్ గా కూపే (Coupe) స్టైల్ లో ఆకట్టుకుంటోంది. అయితే అసలైన మ్యాజిక్ అంతా కారు లోపలే ఉంది. డాష్‌బోర్డ్ అంతా ఒక భారీ పనోరమిక్ ట్రిపుల్-స్క్రీన్ డిస్‌ప్లేతో నిండిపోయింది. డ్రైవర్ నుంచి ప్యాసింజర్ వరకు అందరికీ విడివిడిగా స్క్రీన్లు ఉంటాయి. వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికులకు కూడా ప్రత్యేకమైన డిస్‌ప్లేలు ఏర్పాటు చేశారు. అంటే ప్రయాణిస్తున్నప్పుడు ఎవరికి నచ్చిన సినిమాలు వారు చూడొచ్చు లేదా గేమింగ్ ఆడుకోవచ్చు.
సోనీ తన ఎంటర్‌టైన్‌మెంట్ సామ్రాజ్యాన్ని ఈ కారులోకి తీసుకువచ్చింది. క్వాల్‌కామ్ (Qualcomm) సహకారంతో పనిచేసే ఈ స్క్రీన్లలో సోనీ ప్లేస్టేషన్ (PlayStation) గేమ్స్ ఆడుకునే సదుపాయం ఉండబోతోంది. క్లౌడ్ గేమింగ్, సినిమా స్ట్రీమింగ్, హై-క్వాలిటీ మ్యూజిక్ సిస్టమ్ వంటి ఫీచర్లతో ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ప్రయాణ సమయాన్ని కేవలం డ్రైవింగ్‌కే పరిమితం చేయకుండా, దానిని ఉత్పాదక లేదా వినోద సమయంగా మార్చడమే సోనీ లక్ష్యం.

సేఫ్టీ విషయంలో అఫీలా ఎస్‌యూవీ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది. విండ్‌స్క్రీన్, రూఫ్ పైన అమర్చిన అనేక సెన్సార్లు లెవల్ 2 ADAS (Advanced Driver Assistance Systems)ను కలిగి ఉంటాయి. భవిష్యత్తులో దీనిని లెవల్ 3 అటానమస్ డ్రైవింగ్ కు అప్‌గ్రేడ్ చేసే అవకాశం కూడా ఉంది. దాదాపు 4.9 మీటర్ల పొడవు ఉండే ఈ కారులో ఐదుగురు ప్రయాణికులు ఎంతో విలాసవంతంగా ప్రయాణించవచ్చు. వయసు మళ్లిన వారికి కూడా డ్రైవింగ్ సులభతరం చేసేలా ఇందులో సాఫ్ట్‌వేర్ ఫీచర్లను పొందుపరిచారు.
సోనీ-హోండా ప్లాన్ ప్రకారం.. అఫీలా సెడాన్ మోడల్ ఈ ఏడాదే అమెరికా మార్కెట్లోకి వస్తుంది. ఆ తర్వాత 2027లో జపాన్ మార్కెట్లోకి అడుగుపెడుతుంది. ఇక ఇప్పుడు ప్రదర్శించిన ఎస్‌యూవీ మోడల్ 2028 నాటికి మార్కెట్లోకి వస్తుందని సమాచారం. అమెరికా, జపాన్, యూరోప్ మార్కెట్ల తర్వాత ఈ స్మార్ట్ కారు భారత దేశానికి వచ్చే అవకాశం ఉంది. వాహన రంగంలో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సమ్మేళనం ఏ స్థాయిలో ఉండబోతుందో అఫీలా నిరూపిస్తోంది.


Click it and Unblock the Notifications








